Monday, December 2, 2024

రాజకీయాలకు శరద్ పవార్ గుడ్‌బై?

- Advertisement -
- Advertisement -

బారామతిలో సూచన ప్రాయంగా తెలిపిన ఎన్‌సిపి (ఎస్‌పి) చీఫ్
ఇక ఎన్నికల్లో పోటీ చేయబోను
యువ తరాన్ని ప్రోత్సహిస్తుంటా
4 సార్లు మహారాష్ట్ర సిఎంగా వ్యవహరించిన శరద్ పవార్

బారామతి : ఆరు దశాబ్దాల పాటు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించిన ఎన్‌సిపి (ఎస్‌పి) అధ్యక్షుడు శరద్ పవార్ తన రిటైర్‌మెంట్‌ను మంగళవారం సూచనప్రాయంగా తెలియజేశారు. ఇక ముందు ఏ ఎన్నికల్లోను తాను పోటీ చేయబోనని, యువ తరాన్ని తీర్చిదిద్దడం కోసం పాటుపడతానని పవార్ ప్రకటించారు. తాను ‘ఎక్కడో ఒక చోట ఆగిపోవలసి ఉంటుంది’ అని 83 ఏళ్ల పవార్ చెప్పారు. రాజకీయాలలో నుంచి తప్పుకునే ముందు మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు తన ఆఖరి పోరాట క్షేత్రం కాగలదని ఆయన సూచించారు.

తన మనుమడు యుగేంద్ర పవార్ తరఫున ప్రచారం సందర్భంగా బారామతిలో ఒక సమావేశంలో శరద్ పవార్ ప్రసంగిస్తూ, ‘నేను అధికారంలో లేను. రాజ్యసభలో కచ్చితంగా ఉన్నాను. ఇంకా ఒకటిన్నర ఏడాది మిగిలి ఉంది. అయితే, ఒకటిన్నర సంవత్సరాల తరువాత రాజ్యసభకు తిరిగి వెళ్లాలా లేదా అన్నది గాను ఆలోచించవలసి ఉంటుంది. లోక్‌సభకు పోటీ చేయబోను. ఏ ఎన్నికల్లోను పోటీ చేయబోను’ అని చెప్పారు. 1967లో బారామతి నుంచి తొలిసారి ఎంఎల్‌ఎ అయినప్పటి నుంచి 57 ఏళ్ల ఎన్నికల రాజకీయాల్లో ఓటమి ఎరగని శరద్ పవార్ ప్రజల కోసం తాను పని చేస్తూనే ఉంటానని తెలియజేశారు.

తన సిద్ధాంతం గురించి కూడా ఆయన వివరించారు. ‘నేను 14 సార్లు పోటీ చేశాను. మీరు (ప్రజలు) నన్ను కనీసం ఒక్కసారి కూడా ఇంటికి పంపించలేదు. మీరు నన్ను ప్రతిసారి ఎన్నుకున్నారు. కానీ, నేను ఎక్కడో ఒక చోట ఆగిపోవలసి ఉంటుంది& నేను కొత్త తరాన్ని ముందుకు తీసుకుపోవలసి ఉంటుంది. ఆ సిద్ధాంతంతోనే పని చేస్తున్నాను. సామాజిక కార్యక్రమాలను నేను వదలివేశానని దీని అర్థం కాదు. కానీ నేను అధికారం కోరుకోవడం లేదు. నేనే ప్రజల కోసం సేవ, కృషి కొనసాగిస్తాను’ అని పవార్ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల్లో అభిమానులు కలిగిన రాజకీయ నిష్ణాతుడైన పవార్ నాలుగు పర్యాయాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆయన యుపిఎ హయాంలో కేంద్రంలో కీలకమైన రక్షణ, వ్యవసాయ శాఖలు నిర్వహించారు. పవార్ 1999లో ఎన్‌సిపిని ఏర్పాటు చేశారు. ఆయన సోదరుని కుమారుడు అజిత్ పవార్ వేరే వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు 2023లో పార్టీ చీలిపోయింది. ఒక ఏడాది క్రితం మరాఠా దిగ్గజం రిటైర్‌మెంట్ వదంతులను ఖండించారు. తాను ‘అలసి పోలేదు, రిటైర్ కాలేదు’ అని ఆయన స్పష్టం చేశారు. వయస్సు రీత్యా శరద్ పవార్ క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకోవాలన్న అజిత్ పవార్ సూచనకు ఆయన ఆవిధంగా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News