Thursday, May 2, 2024

అసమాన కలం యోధుడు షోయబుల్లా ఖాన్

- Advertisement -
- Advertisement -

పెన్నును గన్నుగా మార్చి, అక్షరాలను బుల్లెట్లుగా ప్రయోగించి, నాటి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా రాజీలేని రచనలతో నిజాం ప్రభుత్వానికి నిద్దుర పట్టనీయకుండా వణికించిన షోయబ్ ఉల్లా ఖాన్ అక్షర వీరుడు. ప్రజల కోసం కలం పట్టి ప్రాణాలను తృణప్రాయంగా వదలిన ధీరుడు. పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చిన నిజాయితీపరుడు. తన రచనలతో తెలంగాణ పాత్రికేయ చరిత్రలో సుస్థిరస్థానం పొందిన కలం యోధుడు. లక్ష్యసాధనలో ప్రాణ త్యాగం చేసిన అమరుడు. నిఖార్సయిన వాడీవేడితో కూడిన తన రచనల ద్వారా నిజాం ప్రభుత్వ విధానాలను, రజాకార్ల దుశ్చర్యలను ఎండగట్టిన నిబద్ధత కలిగిన పాత్రికేయుడు. తన స్వేచ్ఛా రచన జీవితానికి చరమగీతం పాడుతుందని తెలిసినా వెనుకంజ వేయని మేరు నగధీరుడు. అపూర్వ త్యాగధనుడు. షోయబ్ ఉల్లాఖాన్ 1920, అక్టోబరు 17న ఖమ్మం జిల్లా సుబ్రవేడులో జన్మించాడు. తండ్రి హబీబుల్లా ఖాన్. తల్లి లాయహున్నీసా బేగం. వారి కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడింది.

షోయబ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బిఎ, జర్నలిజం డిగ్రీ పూర్తి చేశాడు. బొంబాయిలో ఇంటర్మీడియట్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్ష కూడా ఉత్తీర్ణుడైనాడు. తన కుమారునిలో గాంధీ మహాత్ముని పోలికలున్నాయని భావించి హబీబుల్లాఖాన్.. ‘షోయబుల్లా గాంధీ’ అని ముద్దుగా పిలుచుకునే వాడు. గాంధీ లాగానే షోయబ్ కూడా తాను నమ్మిన మార్గంలో ప్రయాణించడంలో నిబద్ధతను, మొండితనాన్ని ప్రదర్శించాడు. తెలంగాణ అగ్నిగోళంలా మండుతున్న కాలమది. నిరంకుశ పాలన, దోపిడీ, దౌర్జన్యాలు సాగదంటూ సామాన్యుడు సమరం సాగిస్తున్న సమయమది. అది పత్రికలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న కాలం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా ప్రచురణ చేయడానికి సాహసించని గడ్డుకాలం. ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ప్రజాస్వామ్య కాంక్షతో దుర్మార్గ పాలనను ఎదురించే చైతన్యంతో క్యాంపస్ నుండి షోయబుల్లా ఖాన్ బయట కొచ్చాడు. సమ సమాజం కోసం, అణగారిన అమాయక ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన బలంగా ఉన్న షోయబ్ జాతీయోద్యమ స్ఫూర్తితో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచు కున్నాడు. చిత్తశుద్ధి, అంకిత భావం, నిబద్ధత కలిగిన జర్నలిస్ట్‌గా జీవితం ప్రారంభించాడు.

మొదట షోయబ్ ‘తేజ్ ’ అనే ఉర్దూ పత్రికలో ఉప సంపాదకుడిగా చేరాడు. నిరంకుశ నిజాం ప్రభుత్వం, ఆయన తాబేదార్లయిన రజాకార్ల దౌర్జన్యాలు, అరాచకాలను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ వార్తలనే అస్త్రాలను సంధించాడు. ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేప్రయత్నం చేశాడు. చివరకు ‘తేజ్’ పత్రికను నిషేధించారు. కణకణ మండుతున్న నిప్పుకణికల్లాంటి షోయబుల్లాఖాన్ అక్షరాలకు ప్రచురణ అవకాశం అప్పటికే ముందుముల నర్సింగ రావు నిర్వహణలోని రయ్యత్ పత్రిక కల్పించింది. ఆయన స్వతంత్ర భావ ప్రకటనలకు ఆ పత్రిక వేదిక అయింది. కొంత కాలానికి నిజాం ప్రభుత్వం ‘రయ్యత్’ పత్రికను మూసి వేయించింది. నిజాం దౌర్జన్యాన్ని ఎదిరించడానికి సొంత పత్రిక ఉంటేనే మంచిదను కున్నాడు షోయబుల్లా ఖాన్. మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సహాయంతో భార్య, తల్లి నగలను అమ్మి ఇమ్రోజ్ ను స్థాపించాడు. 1947 నవంబర్ 17న మొదటి సంచిక వెలువడింది.

బూర్గుల రామకృష్ణారావు ఇంట్లో ఇమ్రోజ్ ఆఫీస్ ఉండేది. ఉర్దూలో ఇమ్రోజ్ అంటే ఈ రోజు. పాలక వర్గాల దౌర్జన్యాలను, దోపిడీని చీల్చి చెండాడాడు. ‘ఇమ్రోజ్’ దిన పత్రిక తొలి సంచిక 1947 నవంబరు 17 వ తేదీన వెలువడింది. నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయాల్సిందేనని ఖరాఖండి గా చెబుతూ సంపాదకీయాలు రాశాడు. విశాల దేశప్రయోజనాల దృష్ట్యా విలీనం తప్పనిసరి అని పేర్కొన్నాడు. పదునైన విమర్శనాస్త్రాలు సంధించాడు. ఎక్కడ ఏ మూలన నిజాం ఏలుబడిలో ఆగడాలు చెలరేగుతున్నా, ఎక్కడ ఆర్మీ క్యాంప్స్ ఉన్నా వాటి గురించి నిర్భయంగా రాసేవాడు. హైదరాబాద్ ఇండియాలో విలీనం కావాల్సిందేనని తన రాతలతో స్పష్టం చేసేవాడు. నిజాంకు వ్యతిరేకంగా ఉన్న ముస్లిం విద్యావంతుల అభిప్రాయాలను ప్రచురించే వాడు. నిజాం మొండితనానికి, రజాకార్ల ఉన్మాదానికి ఎక్కువ బలవుతోంది పేద ముస్లిం కుటుంబాలు, యువకులేనని ఎన్నో సార్లు ఆవేదన చెందాడు. రచనల ద్వారా బహిర్గతం చేశాడు.

కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్ వారు, విద్యార్థులు, యూత్ లీగ్ ఎవరు పోరాటాలు చేసినా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్తలన్నీ ప్రముఖంగా ప్రచురించాడు. హైదరాబాద్ ఇండియాలో విలీనం కావడమనేది షోయబుల్లాఖాన్ కల. లక్ష్యం. దాని కోసం ఆత్మార్పణకైనా సిద్ధపడ్డాడు. నడిరోడ్డు మీద ప్రాణాలను బలి పెట్టాడు. రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ 1948 ఆగస్టు 19 సభలో షోయబ్ చేతులు నరికి వేస్తామని బహిరంగం గానే హెచ్చరించాడు. 1948 అగస్టు 21న కాచిగూడలోని రైల్వేస్టేషన్ రోడ్‌లో ఇమ్రోజ్ ఆఫీసులో పని పూర్తి చేసుకుని అర్ధరాత్రి బావమరిది ఇస్మాయిల్ ఖాన్‌తో కలిసి ఇంటికి బయలుదేరిన షోయబుల్లాను ఒక్కసారిగా పది మంది దుండగులు చుట్టుముట్టి ఆయన వార్తలు రాసే కుడి అర చేతిని ముష్కరులు నిర్దాక్షిణ్యంగా నరికి వేశారు. అడ్డుకో బోయిన ఇస్మాయిల్‌నూ తీవ్రంగా గాయపరిచి గానీ వదల్లేదు. నెత్తిటి మడుగులో కొట్టుమిట్టాడిన షోయబుల్లాను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా 1948 ఆగస్టు 22న తెల్లవారు జామున షోయబ్ తుది శ్వాస విడిచాడు. నిజాం సర్కార్ షోయబ్ అంతిమ యాత్రను నిషేధించింది. అంతిమ యాత్ర పోలీసు బందూకుల మధ్య జరిగింది. గోషామహల్ మాలకుంట శ్మశాన వాటికలో ఆయన ఖననం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News