Thursday, August 21, 2025

వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్

- Advertisement -
- Advertisement -

రానున్న రోజుల్లో టీమిండియా వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను నియమిస్తారా అంటే జాతీయ మీడియాలో ఔననే కథనాలు వస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కీలకమైన వన్డే ఫార్మాట్‌కు శ్రేయస్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశాలున్నాయని జాతీయ, సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. బిసిసిఐ పెద్దలు శ్రేయస్‌ను వన్డే కెప్టెన్‌గా నియమించేందుకు సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వన్డేల్లోశ్రేయస్ అయ్యర్ అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్నాడు. దీంతో అతనికి వన్డే సారథ్య బాధ్యతలు అప్పగిస్తే జట్టుకు ప్రయోజనంగా ఉంటుందని బోర్డు పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటివరకు బిసిసిఐ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా మీడియాలో వస్తున్న వార్తలను గమనిస్తే బోర్డు ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతోంది.

ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే టీమ్‌కు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. వచ్చే వరల్డ్‌కప్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రేయస్‌కు ముందుగానే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే మెగా టోర్నమెంట్‌కు జట్టును సంసిద్ధం చేయాలని బిసిసిఐ భావిస్తున్నట్టు తెలిసింది. ఇందు కోసం అవసరమైన చర్యలను కూడా చేపట్టినట్టు వార్తలు వస్తున్నాయి. శుభ్‌మన్ గిల్‌ను టెస్టు కెప్టెన్‌గా కొనసాగించి వన్డేల్లో ఆ బాధ్యతలను శ్రేయస్‌కు అప్పగించాలని బిసిసిఐ భావిస్తోంది. ఇక పొట్టి ఫార్మాట్‌లో సూర్యకుమార్‌ను మరికొంత కాలం పాటు సారథిగా కొనసాగించే అవకాశాలున్నాయి. సూర్యకుమార్ సారథ్యంలో టీమిండియా టి20లలో అద్భుత ఆటను కనబరుస్తోంది. దీంతో ఈ ఫార్మాట్‌లో అతన్నే కెప్టెన్‌గా కొనసాగించాలని బిసిసిఐ యోచిస్తోంది.

శుభ్‌మన్ గిల్ ఆసియాకప్ కోసం వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసినా రానున్న రోజుల్లో అతని స్థానంలో ఇతర ఆటగాడికి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్‌లలో ఎవరో ఒకరిని టి20 ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్‌గా నియమించే ఛాన్స్ ఉంది. ఇక వన్డేల్లో అయితే రోహిత్ స్థానంలో శ్రేయస్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు, బిసిసిఐ పెద్దలు సిద్ధమైనట్టు వార్తలు గుప్పుమన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News