Thursday, June 20, 2024

సైన్సుకు దేశంలో గడ్డుకాలం!

- Advertisement -
- Advertisement -

భారత ప్రభుత్వం వారి డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు ముఖ్యమైన సైన్స్ అకాడెమీలకు నిధులు సమకూరుస్తుంది. అవి 1. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీ (ఐఎన్‌ఎస్‌ఎ) 2. నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా (ఎన్‌ఎఎస్‌ఐ) 3. ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ (ఐఎఎస్) ఈ మూడూ స్వయం ప్రతిపత్తి గల సంస్థలు. ఈ దేశ ప్రజలకు ఉపయోగకరమైన పరిశోధనలు చేయడం వీటి ధ్యేయం! అంతేకాదు, దేశంలో ఉత్తమ పరిశోధనలు చేస్తూ, సమాజానికి మేలు చేస్తున్న శాస్త్రజ్ఞుల్ని గుర్తించడం, వారికి అవార్డులు ప్రకటించి ప్రోత్సహించడం వీటి ఉద్దేశం. ఇందులో మూడవది ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ (ఐఎఎస్) అవార్డులు ప్రకటించదు. కాని, మొదటి రెండు దేశ వ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, విద్య, ఆరోగ్య రంగాలలో కొన్ని వందల సంఖ్యలో ప్రతి యేటా అవార్డులు ప్రకటిస్తోంది. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల సిలబస్ లోంచి వైజ్ఞానిక విషయాలు, చారిత్రక అంశాలు తొలగించి తమ హిందూత్వ ఎజెండాను అమలు పరచాలనుకుంటున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ‘విజ్ఞాన్ ప్రసార్’ లాంటి గొప్ప వైజ్ఞానిక సంస్థను కూడా మూసేసింది.

అంటే వైజ్ఞానిక స్పృహకు దేశంలో తలుపులు మూసేసింది. వీటన్నిటిని ప్రారంభించి, ప్రోత్సహించింది భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గనక, ఆయనపై వున్న వ్యక్తిగత కక్ష కారణంగానే వైజ్ఞానిక సంస్థలు మూసివేయడం, వాటికి ప్రతి యేటా ఇవ్వాల్సిన నిధులు అందివ్వక పోవడం చేస్తున్నారేమో ఇటీవల జవహర్ లాల్ నెహ్రూ మ్యూజియం పేరు మార్చి పి.ఎం. మ్యూజియం అని ప్రకటించడం మనకు తెలుసు. ఎలాగైనా సరే ఎక్కడా నెహ్రూ పేరు వినపించకుండా చేయాలని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా వుంది. ఇంతటితో ఆగకుండా ప్రతి యేటా శాస్త్రవేత్తలకు ఇచ్చే అవార్డులను కూడా రద్దు చేసింది. 2022లో సుమారు 300 సైన్స్ అవార్డులను రద్దు చేసిన శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఈ సంవత్సరం మరో ముందడుగు వేసి, 92 సైన్స్ అవార్డుల్ని రద్దు చేసింది. ఇలాంటి విషయాలకు పత్రికలు, మీడియా విస్తృత ప్రచారమివ్వవు. అందువల్ల సామాన్య జనానికి విషయాలు తెలియవు.

కేంద్ర ప్రభుత్వ నిధులు అందుకుంటున్న అకాడెమీలు ఇచ్చే అవార్డులు ఇకపై కొనసాగించరాదని ఈ ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి ప్రభుత్వం భావించింది. యువ శాస్త్రవేత్తలు, సైన్స్ టీచర్లు, లెక్చరర్లు, జాతీయ అంతర్జాతీయ స్థాయి కలిగిన సైంటిస్ట్‌ల కోసం వివిధ స్థాయిల్లో ఇస్తున్న పలు రకాల అవార్డులన్నీ ఇప్పుడు రద్దయిపోయాయి. తమకు దక్కాల్సిన గుర్తింపుల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినందుకు వివిధ పరిశోధనాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో పని చేసే శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు అందరూ ఆందోళన పడడం, పెద్ద ఎత్తున తమ నిరసనలు తెలియజేయడం మామూలే! అయితే ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు ఏ విషయంలో చీమ కుట్టింది గనుకా? గతంలో పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు, సాహిత్య అకాడెమీ అవార్డుల్ని (అవార్డు వాపసీ) ప్రస్తుత ప్రభుత్వానికి తిప్పి కొట్టినప్పుడే ఈ ప్రభుత్వం సిగ్గు పడలేదు. ఇక ఇప్పుడు పడాలని ఎందుకు అనుకుంటుందీ? ఇక మిగిలింది ఒక్కటే ఈ దేశంలో విజ్ఞాన శాస్త్రం ఎవరూ చదవకూడదు అని చట్టం తీసుకు రావడమే! ఇంత చేసిన వారు ఇక ముందు అది కూడా చేయరని నమ్మకమేమిటి? మన కేంద్ర ప్రభుత్వంపై మనకు తప్పకుండా నమ్మకముండాలి. కాబట్టి, వారు సులభంగానే ఈ కింది చట్టాలు తేగలరు.

1. దేశంలో ప్రశ్న బతికి వుండకూడదు. 2. దేశంలో వైజ్ఞానిక స్పృహ వుండకూడదు. 3. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పేరెత్తితే ఇకపై కఠిన శిక్షలు. 4. గత జ్ఞాపకాలు ఎవరికీ వుండకూడదు. ఎవరూ గత చరిత్రను తవ్వి తీయకూడదు. 5. ప్రభుత్వం వారి ‘మన్ కి బాత్’ మాత్రమే విని చెవులు ఊపుతూ వుండాలి. 6. దేశంలో మేం ప్రజాస్వామ్యాన్ని గొప్పగా బతకనిస్తున్నాం అని మన దేశ నాయకులు విదేశాల్లో చెప్పి వస్తుంటారు. వాటిని విని నోరు మెదపకూడదు. గమ్మున కూర్చోవాలి. 7. మైనారిటీలను స్వంత బిడ్డల్లా చూసుకుంటున్నామని అంతర్జాతీయ వేదికల మీద మన నాయకులు ప్రసంగించి వస్తారు. మనమిక్కడ చప్పట్లు చరుస్తుండాలి. 8. బేటీ బచావో బేటీ పడావో నినాదాన్ని ప్రతి ఊర్లో సందు గొందుల్లో గొంతెత్తి నినదించాలి. 9. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున మహిళా క్రీడాకారుల మీద దౌర్జన్యం చేశారని తెలిసినా నోరు విప్పకూడదు. 10. అమెరికా పర్యటనలో వైట్ హౌజ్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో భారత దేశంలో జరుగుతున్న హిందూత్వ అఘాయిత్యాల మీద, గుజరాత్ మానవ హననం మీద, జాతి వివక్ష మీద, అసమర్థ పాలన మీద విలేకరులు సంధించిన కేవలం రెండు ప్రశ్నలకు కూడా సమాధానమివ్వకుండా ‘ప్రజాస్వామ్యం మా డిఎన్‌ఎలో వుందని’

మన ప్రధాన నాయకుడు పిట్టకథ చెప్పి వచ్చిన అంశాన్ని ఎక్కడా ప్రస్తావించగూడదు. 11. వాషింగ్టన్ డిసి ప్రధాన వీధుల్లో భారత దేశంలోని కేంద్ర ప్రభుత్వం మీద అక్కడి జనం విమర్శలు గుప్పిస్తుంటే మన ప్రధాన నాయకుడు నోరు మెదపకుండా నవ్వుతూ ఏడుపు మొహం వేసుకొని రాలేదా? 12. భారత దేశంలో ప్రస్తుత హోం మంత్రి ఒక జడ్జిని చంపించిన క్రిమినల్ అని వాషింగ్టన్ వీధుల్లో తమ అధ్యక్షుడు బైడెన్‌కు వినపడేంతగా మైకులు పగిలేట్లు వక్తలు ఉద్రేకంతో ఉపన్యసిస్తుంటే దేశం వెలిగిపోతోందని.. మనమిక్కడ మన్నుదిన్న పాముల్లా పడి వుండాలా? వద్దా? వుండాల్సిందే కదా? 13. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక ఇంటర్వూలో భారత ప్రధానిని ఉద్దేశించి సంధించిన ప్రశ్నలు వినిపించినా వినపడనట్లే నవ్వుతూ చెయ్యి ఊపుతూ ఆయన గారు అక్కడ తిరగలేదా? అంత పెద్ద స్థాయిలో వున్న వారికి లేని సిగ్గు సామాన్య మానవులం మనకు ఎందుకబ్బా? పట్టించుకోవద్దు కదా? మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. మన చర్మాన్ని మనమే మందంగా తయారు చేసుకోవాలి? తప్పదు మరి

భారత ప్రధాని పర్యటనపై స్పందిస్తూ ముగ్గురు ప్రతిభావంతులైన ప్రముఖ అమెరికా సెనెటర్లు చెప్పిన విషయాలు చూద్దాం. ఇందులో మొదటి ఇద్దరు మహిళలు. చాలా తీవ్రమైన పదజాలంతో నేటి భారత ప్రభుత్వం పట్ల తమ అసహనాన్ని, ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.మానవ హక్కులకు విఘాతం కలిగిస్తూ, జర్నలిస్టులను హింసిస్తూ ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేసిన ఘనమైన చరిత్ర ప్రస్తుత భారత ప్రధానిది. కోరిబుష్.మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గౌరవించకూడదు. ఒకసియో కోర్ట్ ప్రధాని మోడీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను, స్వేచ్ఛాలోచనను ధ్వంసం చేసింది. ప్రతిపక్ష సభ్యుల మీద నేరాలు మోపింది. జైలు పాలు చేసింది. పౌర సంఘాల స్వేచ్ఛను హరించింది. తనను కలిసినప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్, తప్పక ఈ సమస్యల్ని భారత ప్రధానికి ఎత్తి చూపాలి! ప్రశ్నించాలి!! బెర్ని సాండర్స్.
దేశంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా, అమెరికా అధ్యక్షుడు ఎందుకంత ఘనంగా భారత ప్రధానిని ఆహ్వానించారు? అందులో వున్న రహస్యమేమిటీ అంటే ఇరు దేశాల మధ్య వున్న లావాదేవీలు ముఖ్య కారణం అంతకు మంచి అక్కడ భారత ప్రధానికి వ్యక్తిగతంగా లభించిన గౌరవమేమీ లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News