మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్‌లో మహిళలపై జరిగిన క్రూరత్వం మానవతకు మచ్చ అయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది దారుణాతిదారుణ విషయం అని స్పందించారు. ఈ రెండు రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న బిజెపి ఎంతసేపూ ప్రచార ఆర్భాట కేంద్రీకృత ప్రభుత్వాలతో పాలనను సాగిస్తోంది. ఈ క్రమంలో సమాజంలో ఓ విధమైన జుగుప్సాకర , విచక్షణారహిత వ్యవస్థ నెలకొంది. దీనికి బలి అవుతున్నది ఎక్కువగా దేశంలోని మహిళాలోకమే అని రాహుల్ వ్యాఖ్యానించారు. మహిళకు రక్షణ లేదా అని ప్రశ్నించారు. ఉజ్జయినిలోని అగర్ నాకా ప్రాంతంలో చెత్త ఏరుకుని బతికే ఓ మహిళకు ఓ మగవాడు బలవంతంగా సారా తాగించి, అత్యాచారం జరిపాడు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్‌లో ఓ అంబులెన్స్‌లోనే డ్రైవర్, హెల్పర్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె వెంట ఓ మానసిక వికలాంగ భర్త ఉన్నప్పుడే ఈ దారుణం జరిగింది.
ఈ రెండు చోట్లా జరిగిన ఈ పైశాచిక చర్యలు అమానుషానికి ప్రతీక అయ్యాయని రాహుల్ తెలిపారు. దేశంలో రోజురోజుకీ మహిళకు భద్రత లేని పరిస్థితికి ఈ రెండు ఘటనలు అద్దం పట్టాయి. ఈ రెండు ఘటనల్లోనూ బాధితుల వారి కుటుంబాల పట్ల పోలీసు తీరు మరీ దారుణంగా ఉందన్నారు. ఇది సమాజంలో నెలకొన్న క్రూరత్వాన్ని తెలియచేస్తోందని సామాజిక మాధ్యమంలో రాహుల్ పేర్కొన్నారు. ఇదంతా కూడా తామేదో గొప్ప చేశామని ప్రచారం చేసుకునే అధికార పార్టీల క్రమంలో వెల్లువెత్తిన పరిస్థితి అని రాహుల్ స్పందించారు. వారి వైఖరితో ఎక్కువగా చితికిపోతున్నది మహిళనే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ పరిస్థితిపై ఉపేక్ష తగదు, మహిళల భద్రతకు పాటుపడాల్సిందే. ఈ క్రమంలో జరిగే యత్నాలకు నైతిక మద్దతు వ్యక్తం చేయాల్సి ఉందన్నారు. ఉత్తమ పౌరులు సముచిత సామాజిక వ్యవస్థలను సృష్టిస్తారు. ఇక సరైన వ్యవస్థలతో సక్రమ సమాజం నెలకొంటుందని తెలిపారు. ఉజ్జయినిలో పట్టపగలు ఓ అబలపై ఫుట్‌పాత్‌పై జరిగిన పరమ కిరాతక లైంగిక చర్య అత్యంత భయానకం అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు.
ఇప్పుడు మన సమాజం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతోందనే కీలక ప్రశ్నలు ఇటువంటి ఉదంతాలతో మన ముందుకు వస్తున్నాయని ప్రియాంక పేర్కొన్నారు. ఉజ్జయినిలో మహిళపై దారుణం జరుగుతూ ఉంటే దారినపొయ్యే వారు సెల్‌ఫోన్లలో వీడియోలు తీసుకున్నట్లు తెలిసింది. అత్యంత పవిత్రమైన ఉజ్జయినిలో ఓ మహిళపై జరిగిన ఈ పశు ప్రవృత్తి దారుణకాండతో మానవత మంటగలిసిపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన ఓ వీడీయోలో మహిళపై అత్యాచారం ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఉజ్జయినిలో జరిగిన ఈ దారుణం వెలుగులోకి రావడం, తరువాత పోలీసులు స్పందించి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.