Tuesday, October 15, 2024

కెకె-5 గనిలో ప్రమాదం..కార్మికుడు మృతి

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియా పరిధిలోని కె కె 5 గని లో బుధవారం తెల్లవారుజామున జరిగిన గని ప్రమాదంలో మోకెన లక్ష్మణ్ (39) అనే కోల్ కట్టర్ కార్మికుడు మృతి చెందాడు. రెండవ షిఫ్టులో విధులు నిర్వహించి తిరుగు ప్రయాణంలో మ్యాన్ రైడింగ్ ద్వారా వస్తుండగా 15వ పోలు వద్ద జారిపడిగా తోటి కార్మికులు గమనించి ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు సమాచారం. గని వద్ద కనీసం స్ట్రెచ్చర్ కూడా అందుబాటులో లేదని సరియైన వైద్యం అందకనే మృతి చెందాడని గని కార్మికులు ఆరోపిస్తున్నారు. లక్ష్మణ్ మృతిని గని ప్రమాదంగా గుర్తించి టెర్మినల్ బెనిఫిట్స్, బ్యాంకు కంపెన్సేషన్ తోపాటు కుటుంబంలో ఒకరికి సూటబుల్ ఉద్యోగం ఇవ్వాలని సింగరేణి కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే కార్మికులు గని పై ధర్నా నిర్వహించారు.

మొదటి షిఫ్టు విధులకు హాజరు కాకుండా ఆందోళన చేపట్టడంతో గని అధికారులు, కార్మిక సంఘాల నాయకులు గని వద్దకు చేరుకొని కార్మికులతో చర్చించారు. కార్మికులకు సరైన వైద్య సహాయం అందడం లేదని, ఉత్పత్తిపై మాత్రమే శ్రద్ధ చూపుతున్నారని రక్షణ చర్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏఐటీయూసీ నాయకులు శైలేంద్ర సత్యనారాయణ, గాండ్ల సంపత్,ఐ ఎన్ టి యు సి నాయకులు కాంపల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, హెచ్ ఎం ఎస్ నాయకులు జె శ్రీనివాస్ లు ఆరోపించారు.కార్మికుని మృతి పట్ల కనీస వేతనాల అడ్వైజరీ కమిటీ చైర్మన్, ఐఎన్ టి యు సి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుడు స్థానిక శ్రీపతి నగర్ కాలనీలో నివసిస్తున్నాడని అతనికి భార్య , కుమారుడు, కూతురు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రమాద ఘటనను తెలుసుకున్న కార్మిక కార్మిక సంఘం నేతలు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలి వెళ్ళారు, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News