మనతెలంగాణ, సిటిబ్యూరోః జీతం సరిపోతలేదని గంజాయి విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 500 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…నగరంలోని మల్లేపల్లి, మాంగళహార బస్తీకి చెందిన మహ్మద్ నదీం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తనతోపాటు పనిచేస్తున్న అర్జున్‌రెడ్డితో స్నేహం ఏర్పడింది. అర్జున్ రెడ్డి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ విషయం నదీంకు చెప్పడంతో కారును అద్దెకు తీసుకుని గంజాయి విక్రయించడం ప్రారంభించాడు.
ఈ క్రమంలోనే అర్జున్ రెడ్డి తీసుకుని వచ్చిన 500 గ్రాములు గంజాయిని తీసుకున్న నదీం లాంగ్ డ్రైవ్ యాప్ ద్వారా కారు బుక్ చేసుని నారాయణగూడ ప్రాంతంలో విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిఐ నాగరాజు, సిబ్బందితో కలిసి పార్క్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న నదీంను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం నారాయణగూడ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. గంజాయి సరఫరా చేస్తున్న అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కాగా గంజాయి విక్రయిస్తున్న డెలివరీ బాయ్ లోకనాథ్ నాయక్‌ను బాలానగర్‌లో ఎక్సైజ్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 2.1కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎపిలోని అనంతపురం జిల్లా, పికె తండా, నల్లమడ ప్రాంతానికి చెందిన లోకనాథ్ నాయక్ కెపిహెచ్‌బిలో ఉంటూ గంజాయి విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌టిఎఫ్ సిఐ నాగరాజు, సిబ్బంది కలిసి పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.