అహ్మదాబాద్ : కాంగ్రెస్ పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) కోసం పని చేస్తున్న నేతలు, కార్యకర్తలను ఏరివేయవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం స్పష్టం చేశారు. అటువంటి వారిపై కఠిన చర్య తీసుకుంటామని, వారి తొలగింపు కూడా జరుగుతుందని రాహుల్ హెచ్చరించారు. తన రెండు రోజుల గుజరాత్ పర్యటన రెండవ రోజు శనివారం అహ్మదాబాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ, పార్టీ ప్రథమ కర్తవ్యం రెండు గ్రూపుల కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలను వేరు చేయడం అని, తమ గుండెల్లో పార్టీ సిద్ధాంతాన్ని మోస్తూ, ప్రజలకు దన్నుగా ఉండేవారు ఒక గ్రూపు అని, ప్రజలకు దూరంగా జరిగిన వారు రెండవ గ్రూపు అని, ‘వారిలో సగం మంది బిజెపితో ఉన్నారు’ అని చెప్పారు. 2027 అసెంబ్లీ ఎన్నికలే లక్షంగా రాహుల్ గుజరాత్ పర్యటనకు వచ్చారు.పార్టీ రాష్ట్ర శాఖలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేయనున్నట్లు ఆయన సూచనప్రాయంగా చెప్పారు.
బిజెపి ఓటమికి పటిష్ఠమైన ప్రణాళిక రూపొందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ‘గుజరాత్ కాంగ్రెస్ నాయకత్వంలో, కార్యకర్తల్లో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. ఒక రకం వ్యక్తులు ప్రజల పట్ల నిజాయతీతో ఉంటూ, వారి కోసం పోరాడుతూ, వారిని గౌరవిస్తూ, కాంగ్రెస్ సిద్ధాంతం తమ గుండెల్లో నిలుపుకొని ఉన్నవారు. రెండవ రకం వ్యక్తులు ప్రజలకు దూరంగా ఉంటూ, వారిని గౌరవించనివారు, వారిలో సగం మంది బిజెపితో కలసి ఉన్నారు’ అని రాహుల్ వివరించారు. ఆ రెండు వర్గాల వారిని ఏరివేయడం పార్టీ ప్రథమ బాధ్యత అని, అటువంటి వ్యక్తులను తొలగించడం వంటి కఠిన చర్యనైనా తీసుకుంటామని లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ హెచ్చరించారు. ఆ రెండు వర్గాల వారిని వేరు చేయనంత వరకు గుజరాత్ ప్రజలు పార్టీని విశ్వసించబోరని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు వలల్లో చిక్కుకున్నారని, వజ్రాలు, జౌళి, పింగాణీ పరిశ్రమలు అస్తవ్యస్తంగా ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. ‘గుజరాత్ రైతులను చూడండి.
వారు కొత్త లక్షం కోసం అర్రులు చాస్తున్నారు. గడచిన 2025 సంవత్సరాల లక్షం విఫలమైంది, కాంగ్రెస్ ఆ లక్షాన్ని తేలికగానే సమకూరుస్తుంది. కానీ, ఆ రెండు రకాల వ్యక్తులను ఏరివేయనంత వరకు అది సాధ్యం కాదు’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ మూడు దశాబ్దాలకు పైనుంచి గుజరాత్‌లో అధికారంలో లేదని, తాను ఎప్పుడు రాష్ట్రాన్ని సందర్శించినా, ఎన్నికల గురించే చర్చలు సాగుతుంటాయని ఆయన చెప్పారు. ‘అయితే, అసలు ప్రశ్న ఎన్నికల గురించి కాదు, మన బాధ్యతలను మనం నెరవేర్చనిదే గుజరాత్ ప్రజలు ఎన్నికల్లో మనల్ని గెలవనివ్వరు. మన బాధ్యతలు నెరవేర్చేంత వరకు మనకు ప్రభుత్వాన్ని ఇవ్వవలసిందిగా ప్రజలను మనం కోరకూడదు. మన బాధ్యతలను మనం పరిపూర్తి చేసిన రోజు గుజరాత్ ప్రజలు అందరూ మనకు మద్దతు ఇస్తారని గ్యారంటీ ఇవ్వగలను’ అని రాహుల్ చెప్పారు.