Sunday, October 1, 2023

పురిట్లోనే చనిపోయిన బిడ్డ 42 ఏళ్ల తర్వాత తల్లిని కలిస్తే…

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: పుట్టిన కొన్ని గంటలకే చనిపోయాడనుకున్న కుమారుడు 42 ఏళ్ల తర్వాత కన్న తల్లిని కలుసుకున్న అపురూప క్షణాలవి. పురిటి బిడ్డను తల్లి చేతుల్లోనుంచి తీసుకున్న ఆసుపత్రి నర్సులు నీ కుమారుడు మరణించాడని ఆ తల్లికి చెప్పారు. కడుపు కోతతో కన్నీరు మున్నీరైన ఆ తల్లికి అదే కుమారుడు 42 ఏళ్ల తర్వాత సజీవంగా కళ్ల ముందు నిలబడి అమ్మా అని పిలిస్తే..ఆ అపూర్వ దృశ్యం ఇటీవల చిలీలోని వాల్దీవియాలో చోటుచేసుకుంది.

ఒక అమెరికా దంపతులకు దత్తపుత్రుడిగా పెరిగిన జిమ్మీ లిప్పెర్ట్ హైడెన్ తనకు జన్మనిచ్చిన తల్లి ఎవరో తెలుసుకోవడానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో అన్వేషణ ప్రారంభించాడు. చిలీలో జన్మించి అక్కడి నుంచి దత్తతకు వెళ్లిపోయిన వందలాది మంది పిల్లలు చిలీకి చెందిన నోస్ బస్కామోస్ అనే స్వచ్ఛంద సంస్థ సాయంతో తిరిగి తమ అసలు తల్లిదండ్రులను కలుసుకుంటున్న వైనానికి సంబంధించిన వార్తాకథనాలు అతని దృష్టిలో పడ్డాయి. వెంటనే హైడెన్ ఆ స్వచ్ఛంద సంస్థను సంప్రదించి తన వివరాలు తెలియచేశాడు.

చిలీ రాజధాని శాంటియాగోలోని ఒక ఆసుపత్రిలో హైడెన్ నెలలు నిండక ముందే పుట్టినట్లు ఆ సంస్థ కనుగొంది. ఆ బిడ్డను ఇన్‌క్యుబేటర్‌లో ఉంచిన ఆసుపత్రి సిబ్బంది ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని ఆసుపత్రి నుంచి పంపివేశారు. తన బిడ్డ కోసం ఆ తల్లికి తిరిగిరాగా నీ బిడ్డ చనిపోయాడని, బిడ్డను పూడ్చిపెట్టివేశామని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు.

ఆ బిడ్డను ఒక అమెరికన్ దంపతులకు ఆసుపత్రి సిబ్బంది అమ్మేశారు. దత్తతకు సంబంధించిన పత్రాలపై ఆ బిడ్డకు తల్లిదండ్రులు ఎవరూ లేరని రాశారు. అమెరికాలో పెరిగిన హైడెన్ ఇప్పుడు క్రిమినల్ దిఫెన్స్ అటార్నీకి ప్రాక్టీసు చేస్తున్నాడు. న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేని నిర్భాగ్యుల తరఫున ఉచితంగా కేసులు వాదిస్తున్నాడు.

తనది నకిలీ దత్తత అని తెలుసుకున్న హైడెన్ ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా తన అసలు తల్లిదండ్రుల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు తీవ్రం చేశాడు. తనకు నలుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నట్లు అతనికి తెలిసింది.

1970, 1980వ దశకాలలో వేలాదిమంది చిలీ శిశువుల అక్రమ రవాణా జరిగినట్లు ఆ స్వచ్ఛంద సంస్థ చెబుతోంది. వీరిలో వందలాది మంది పిల్లలు దేశాన్ని వదిలిపెట్టారు కాని తిరిగి రాలేదు. పేద కుటుంబాల నుంచి శిశువులను దొంగిలించి మానవ అక్రమ రవాణా చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. గత తొమ్మిదేళ్లలో ఈ సంస్థ ద్వారా 450 మందికి పైగా పిల్లలు తమ అసలు తల్లిదండ్రులను కలుసుకోగలిగారు. డిఎన్‌ఎ సాయంతో వారిని వారి అసలు తల్లిదండ్రులను కలిపేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది.

హైడెన్‌కు డిఎన్‌ఎ పరీక్ష నిర్వహించగా అతను చిలీ జాతీయుడేనని 100 శాతం నిర్ధారణైంది. చిలీలో నివసిస్తున్న తనకు వరుసకు సోదరుడైన వ్యక్తికి హైడెన్ తాను జన్మించిన ఆసుపత్రి, తన తల్లి పేరును పంపాడు. ఆ వ్యక్తి తల్లికి దూరపు బంధువు పేరు కూడా మరియా ఆంజెలికా గొంజాల్వేజ్ అని తెలియడంతో ఆమె వివరాల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఫోన్ కాల్స్‌కు ఆమె స్పందించకపోవడంతో తన ఫోటోతోపాటు తన భార్య, ఇద్దరు కుమార్తెల ఫోటోను ఆమెకు వాట్సాప్‌ప్‌లో షేర్ చేశాడు. చనిపోయాడనుకున్న తన కుమారుడు నుంచి సమాచారం అందచడంతో ఆ తల్లి ఆనందానికి అంతులేకుండా పోయింది.

వెంటనే తన తల్లిని కలుసుకునేందుకు హైడెన్ తన జోహన్నా, తన కుమార్తెలు 8 ఏళ్ల ఎబ్బా జాయ్, 5 ఏళ్ల బెట్టీ గ్రేస్‌తో శాంటియాగో బయల్దేరి వెళ్లాడు. కుటుంబాన్ని వీడిన బిడ్డ 42 ఏళ్ల తర్వాత వస్తున్నందుకు గుర్తుగా 42 రంగురంగుల బుడగలతో హైడెన్‌కు అతని సొంత కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు.

ఈ అపూర్వ సమాగమాన్ని హైడెన్‌ను దత్తత తీసుకుని పెంచిన తల్లిదండ్రులు కూడా స్వాగతించారు. తమకు బిడ్డ కావాలని ఆశించామే తప్ప తల్లి నుంచి వేరు చేసిన బిడ్డ కాదని వారు తెలిపారు. ఏదేమైనా తమ బిడ్డ తన అసలు తల్లిదండ్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News