Tuesday, April 30, 2024

సోనియా వారసులుగా రాయబరేలి నుంచి బరిలోకి ఎవరు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గం నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకోవడం, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తుండడం కాంగ్రెస్‌లో రానున్న మార్పులకు సంకేతంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ సాగిస్తున్న పోరాటానికి ఇది సూచిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. గత 25 సంవత్సరాలుగా లోక్‌సభ సభ్యురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ 2004 నుంచి రాయబరేలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంట్ లోపల వెలుపల కాంగ్రెస్ పార్టీకి ఆమె పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఫిరోజ్ బాగంధీ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాయబరేలి నుంచి ప్రాతినిధ్యం వహించారు.

అయితే వచ్చే మరి కొద్ది నెలల్లోనే జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను రాయబరేలి నుంచి తిరిగి పోటీ చేయడం లేదని సోనియా గాంధీ గత వారం ప్రకటించారు. ఆరోగ్య, వృద్ధాప్య కారణాల వల్ల తాను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని గురువారం సోనియా గాంధీ ప్రకటించారు. అయితే తన కుటుంబంతోనే ఉండాలని ఆమె రాయబరేలి ప్రజలకు పిలుపునిచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ చేజారి బిజెపి వశమైన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో రాయబరేలిని ఆ కుటుంబం వదులుకునే అవకాశం లేదు. అయితే రాయబరేలి నుంచి ఆ కుటుంబంలో ఎవరు పోటీ చేస్తారన్నదే ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న. కాగా..సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఇక్కడ నుంచి పోటీ చేస్తారని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.

తన నానమ్మ ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ తన ఎన్నికల రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు కూడా ఆశిస్తున్నాయి. ప్రియాంకకు ఇది సురక్షిత స్థానం అయినప్పటికీ ఆమె సోదరుడు రాహుల్ గాంధీ మరోసారి అమేథీ నుంచి పోటీచేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి స్మృతి ఇరాని చేతిలో ఓటమి పాలైన రాహుల్ గాంధీ మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పక్షంలో అది ఆయన రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కారణంగానే రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రయాంక గాంధీ ఈ ఎన్నికల్లో కచ్ఛితంగా పోటీ చేస్తారని, అయితే ఆమె రాయబరేలి నుంచి కాకుండా వ్రారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీపై తలపడే అవకాశం అధికంగా ఉందని తెలుస్తోంది.

ఇదే ప్రశ్నను విలేకరులు గతంలో ప్రియాంక గాంధీని అడిగినపుడు పార్టీ ఆదేశిస్తే తాను ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమని ప్రకటించారు. అయితే, అమేథీని కోల్పోయినప్పటికీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసి గెలుపొందిన రాహుల్ గాంధీ మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తారా లేక తన స్వక్షేత్రం ఉత్తర్ ప్రదేశ్ నుంచి బరిలోకి దిగుతారా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రంలో బిజీగా ఉన్నారు. మణిపూర్‌లో ప్రారంభమైన ఈ యాత్ర మార్చి 20న ముంబైలో ముగియనున్నది. కాగా..కాంగ్రెస్ పార్టీ ముందు ఇప్పుడు రెండు ప్రధాన సమస్యలు నిలుచున్నాయి.

గత ఎన్నికల్లో రాహుల్‌ను ఓడించిన స్మృతి ఇరానీపై ఈ రానున్న ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టాలన్నది ఒక సమస్యయితే రాయబరేలి నుంచి ఎవరిని బరిలోకి దించాలన్నది మరో సమస్య. ఈ రెండు స్థానాలలో విజయం కాంగ్రెస్‌కు కీలకం కానున్నది. రాయబరేలితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని సోనియా గాంధీ గురువారం ఉదయం నియోజకవర్గ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన మామగారు ఫిరోజ్ గాంధీని, ఆ తర్వాత తన అత్తగారు ఇందిరా గాంధీని ఈ నియోజక వర్గ ప్రజలు గెలిపించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రాయబరేలి ప్రజలతో తనకున్న అనుబంధాన్ని సోనియా గాంధీ ప్రస్తావించారు. తన అత్తగారిని, తన భర్తను కోల్పోయిన తర్వాత తాను మీ దగ్గరకు వచ్చానని, నన్ను ఆత్మీయంగా అక్కున చేర్చుకుని గత రెండు ఎన్నికల్లో తనకు అండగా నలిబడ్డారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News