Friday, May 3, 2024

అనర్హతపై నిర్ణయాధికారాలు స్పీకర్‌కు మాత్రమే ఉండడం తగదు

- Advertisement -
- Advertisement -

Supreme Court

న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారాలు కేవలం స్పీకర్‌కు మాత్రమే ఉండడానికి బదులుగా ఒక స్వతంత్ర, శాశత వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంగళవారం సుప్రీం కోర్టు పార్లమెంట్‌కు సూచించింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాలు స్పీకర్‌కు మాత్రమే ఉండడంలోని ఔచిత్యాన్ని సమీక్షించాల్సిన సమయం పార్లమెంట్‌కు ఆసన్నమైందని జస్టిస్ రోహిన్‌తన్ ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడింది. ఒక రాజకీయ పార్టీ సభ్యుడిగా ఉండగా స్పీకర్‌కు అనర్హతా పిటిషన్లపై అధికారాలు ఎలా ఉండగలవని ధర్మాసనం ప్రశ్నించింది.

ఇటీవల సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన కొన్ని కేసులను సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ ఎంపీలు, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం స్పీకర్‌కు మాత్రమే ఉండరాదని, ఇందుకోసం ఒక స్వతంత్ర సంస్థ లేదా ఒక శాశ్వత వ్యవస్థ ఏర్పాటు ఉండాలని పార్లమెంట్‌కు సూచించింది. పార్టీ ఫిరాయించడం వంటి అంశాలలో అనర్హత వేటును ఎదుర్కొన్న ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు అధికారంలో ఒక్కరోజు కూడా కొనసాగడానికి వీల్లేదని ధర్మాసనం పేర్కొంది. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచి ఆ తర్వాత బిజెపి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వంలో చేరి అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా కొనసాగుతున్న తౌనోజమ్ శ్యామ్‌కుమార్‌పై అనర్హత పిటిషన్‌కు సంబంధించిన కేసులో ధర్మాసనం విచారణ జరిపింది. శ్యామ్‌కుమార్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు పిటిషన్ సమర్పించగా నిర్ణయం తీసుకోవడంలో ఆయన జాప్యం చేశారు.

దీంతో వారు హైకోర్టును ఆశ్రయించగా స్పీకర్ చర్యను తీవ్రంగా ఆక్షేపించిన హైకోర్టు అయితే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యే అనర్హతపై నిర్ణయాధికారాలు తమకు లేవని నిస్సహాయతను వ్యక్తం చేసింది. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సోమవారం తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ సుదీర్ఘ కాలం ఉండడానికి వీల్లేదని, ఒక నిర్ణీత కాల వ్యవధిలో తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిందేనని స్పష్టం చేసింది. మూడు వారాల్లో అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. మణిపూర్ కేసుకు సంబంధించి నాలుగు వారాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని అక్కడి స్పీకర్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం రాని పక్షంలో తిరిగి సుప్రీంకోర్టుకు రావాలని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ధర్మాసనం సూచించింది.

Speaker Couldnt decide disqualification of MLAs, Mps, says SC, Independent or Permanent body should be established to decide disqualification petitions

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News