Saturday, June 15, 2024

క్రీడా ప్రాంగణాల వెలుగులు… పల్లె స్వరూపాన్ని మార్చిన స్టేడియాలు

- Advertisement -
- Advertisement -

గ్రామీణ ప్రాంతాల్లో ఇండోర్..ఔట్ డోర్ స్టేడియాల నిర్మాణం
క్రీడాకారుల్లో వెల్లువెత్తుతున్న ఉత్సాహం
సిరిసిల్ల..బాన్సువాడల్లో ఇప్పటికే ఏర్పాటు
తాజాగా మహబూబ్‌నగర్.. వైరాలోనూ నిర్మాణం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన క్రీడా ప్రాంగణాలు గ్రామీణ ప్రాంతాల స్వరూప, స్వభావాలనే మార్చి వేశాయి. పల్లెలకు కొత్త శోభను తీసుకొచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లోని బాల, బాలికల్లో దాగివున్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు గ్రామీణ స్టేడియాలు ఇతోధికంగా మేలు చేస్తున్నాయని, అందుకే ఇటీవల జరిగిన జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిల నుంచి జాతీయ స్థాయిల్లో జరిగిన క్రీడల పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో బహుమతులను గెలుచుకొని ఛాంపియన్‌లుగా తయారవుతున్నారని క్రీడల మంత్రిత్వశాఖలోని పలువురు సీనియర్ అధికారులు సంతోషం వ్యక్తంచేశారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశంతో నిర్మించిన క్రీడా ప్రాంగణాలు ఒక వెలుగు వెలుగుతున్నాయి. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి పెద్ద పీట వేసిన కెసిఆర్ ఆ మేరకు క్రింది నుండి పైకి వచ్చేలా గ్రామీణ ప్రాంత క్రీడా ప్రాంగణాల నిర్మాణాలకు ప్రాధాన్యతను ఇచ్చారు. ఇండోర్.. ఔట్ డోర్ సహా ఏ క్రీడలను ఆడుకోవాలనుకున్నా మైదానాలే ప్రామాణికం కావడంతో ముందు వాటి నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ శాట్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌లు సిఎం కెసిఆర్ సూచించినట్లుగా వాటి నిర్మాణాలను పూర్తి చేశారు. వీటిని గ్రామీణ ప్రాంతాల నుండే నిర్మిస్తుండడంతో గ్రామ, మండల, జిల్లా స్థాయి క్రీడాకారుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. క్రీడాకారుల్లో మరింత ఉత్సాహం తీసుకువచ్చేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పలు జిల్లాల్లో నూతనంగా క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తోంది.

ఇప్పటి వరకు రాజధాని హైదరాబాద్‌లోనే ఎల్‌బి స్టేడియం, గచ్చిబౌసి తదితర భారీ స్టేడియంలు ఉండగా..ఇక జిల్లాలతో పాటు మండల, గ్రామీణ ప్రాంతాల్లోనూ మైదానాలను నిర్మించింది. మైదానాల నిర్మాణంలో అందరి కంటే కూడా పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చొరవ తీసుకుని తన నియోజక వర్గం సిరిసిల్లలో దేశంలోనే అబ్బుర పడే స్థాయిలో క్రీడా ప్రాంగణాలను నిర్మింపజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్‌కే పరిమితమైన అలాంటి స్టేడియాలు సిరిసిల్ల లాంటి మారుమూల జిల్లాలకు విస్తరించడంతో…2022 మే మాసం 11వ తేదీన వీటిని ప్రారంభించడంతో నాటి ఈ స్టేడియం ప్రారంభోత్సవానికి వెళ్లిన పలువురు మంత్రులు , ఎంఎల్‌ఏలు తమ తమ నియోజక వర్గాల్లోనూ ఈ స్థాయిలో ఉండేలా కావాలని కోరడంతో సిఎం కెసిఆర్ అన్ని జిల్లాల్లోనూ క్రీడా ప్రాంగణాలను నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా తన నియోజక వర్గంలో కావాలంటూ మరీ పట్టుబట్టి తన బాన్సువాడలోనూ అబ్బుర పడే స్థాయిలో స్టేడియం నిర్మాణం చేయిస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుంటున్న మరి కొందరు తమ తమ జిల్లాల్లో క్రీడల అభివృద్ధి, క్రీడాకారులకు అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. క్రీడల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోనూ అద్బుతమైన ఔట్ డోర్ స్టేడియం నిర్మాణం పూర్తయి ఇటీవలే ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఖమ్మం జిల్లా వైరాలోనూ ఇండోర్ స్టేడియాన్ని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్స్) ఇటీవలే నిర్మించగా ఆ జిల్లా మంత్రి దీనిని ప్రారంభించడం గమనార్హం. ఇలా ఒక్కో క్రీడా ప్రాంగణానికి సుమారు కోట నుండి మూడు నాలుగు కోట్ల వరకు వ్యయం చేసి నిర్మిస్తుండడంతో ఆయా జిల్లాల్లోని క్రీడాకారుల ఆనందానికి అవధులే లేవు.
గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం
తెలంగాణలోని క్రీడాకారులు తమ చిన్నప్పటి నుండి గ్రామీణ ప్రాంతాల నుండి ఆడుకుని వచ్చిన వారే. ఇలాంటి వారే ఇప్పుడు ఆసియన్ గేమ్స్ వరకు ఎదిగి బంగారు పతకాలను సాధిస్తున్నారు కూడా. ఇటీవల 19వ ఆసియన్ గేమ్స్‌లోనూ షూటింగ్ 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్, అలాగే 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలోనూ రజత పతకం సాధించిన ఇషాసింగ్ గ్రామీణ క్రీడాకారిణినే అని వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామీణప్రాంత క్రీడలకు, క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఇటీవల సిఎం కప్ క్రీడలను నిర్వహించిందని వారు గుర్తు చేస్తున్నారు. అంతే కాకుండా ఛలో మైదాన్ పేరిట మరో సారి క్రీడాశాఖ చర్యలు తీసుకుందని వారు చెబుతున్నారు.
కెసిఆర్ చొరవతోనే మైదానాలు : శాట్స్ ఛైర్మన్ డా.ఆంజనేయ గౌడ్
సిఎం కెసిఆర్ చొరవతోనే గ్రామీణ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు క్రీడా మైదానాల నిర్మాణం జరుగుతోందని, మూడో సారి అధికారంలోకి వస్తే అన్ని గ్రామ, మండల , జిల్లా స్థాయిలోనూ క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు పూర్తి చేయిస్తామని శాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తెలిపారు. తమ శాట్స్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న క్రీడా అకాడమిలకు సిఎం కెసిఆర్ ప్రభుత్వం ఇప్పటికే ఎంతో ప్రొత్సాహం కల్పిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత దాదాపు దశాబ్దకాలం నుండి క్రీడా అకాడమిలు, స్పోర్ట్ స్కూళ్ల పై తమ శాట్స్ శాఖ ప్రత్యేక శ్రద్ధతో అనేక చర్యలు చేపట్టిందని, దీంతో క్రీడాకారుల్లో ఉత్సాహం మరింత రెట్టించిందని ఈ సందర్బంగా ఆయన ‘మన తెలంగాణ’కు తెలిపారు. క్రీడా పాఠశాలలు, అకాడమీల నిర్వహణపైనా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను ప్రతి ఏటా ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి చర్యలతో అటు క్రీడా ప్రాంగణాల నిర్మాణం, ఇటు క్రీడాకారుల్లో పతకాలు తేవాలన్న లక్షం ఏక కాలంలో నెరవేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

SATS chairman

Stadium 3

stadium

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News