Thursday, May 2, 2024

తేలిపోయిన శ్రీలంక

- Advertisement -
- Advertisement -

పేలవమైన ఆటతో లీగ్ దశలోనే ఇంటిదారి

హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లోని అత్యంత బలమైన జట్లలో ఒకటిగా పేరున్న శ్రీలంక కొన్నేళ్లుగా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌లో ఘనమైన రికార్డు ఉన్నా ఈసారి మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించడంలో విఫలమైంది. అయితే క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో వరుసగా 13 విజయాలు సాధించడంతో శ్రీలంక గాడిలో పడినట్టేనని అందరు భావించారు. అయితే శ్రీలంక మాత్రం ప్రపంచకప్‌లో అత్యంత పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో కేవలం రెండింటిలో మాత్రమే జయభేరి మోగించింది. వరుస ఓటములతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.

ప్రతిభావంతులున్నా..
శ్రీలంక జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. అయినా కూడా లంక వరల్డ్‌కప్‌లో పూర్తిగా తేలిపోయింది. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ వంటి చిన్న జట్ల చేతుల్లో సయితం ఓటమి పాలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, పసికూన నెదర్లాండ్స్‌పై మాత్రమే లంక విజయం సాధించింది. ఆతిథ్య టీమిండియా చేతిలో అయితే అవమానకర రీతిలో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. భారత బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక కేవలం 55 పరుగులకే కుప్పకూలి అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

పథుమ్ నిసాంకా, కరుణరత్నె, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, చరిత్ అసలంక, మాథ్యూస్ వంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లు జట్టులో ఉన్నా లంకకు వరుస ఓటములు తప్పడం లేదు. కీలక ఆటగాళ్లు గాయంతో టోర్నీ మధ్యలోనే ఇంటిదారి పట్టడం లంకకు ప్రతికూలంగా మారింది. కెప్టెన్ శనక గాయంతో వైదొలగడం లంకపై భారీ ప్రభావాన్నే చూపింది. ఇక భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లో లంక కనీసం సెమీఫైనల్‌కు చేరుకుంటుందని అందరూ భావించారు. భారత పిచ్‌లపై లంక ఆటగాళ్లకు మంచి అవగాహనే ఉంది.

అంతేగాక ఐపిఎల్‌లో ఆడిన అనుభవం కూడా ఉండడంతో ఈసారి లంక మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేశారు. దీనికితోడు వరల్డ్‌కు ముందు ఏకంగా వరుసగా 13 వన్డేల్లో విజయం సాధించడంతో లంకకు తిరుగలేదనే అనుకున్నారు. అయితే లంక ఆటగాళ్లు మాత్రం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టలేక పోయారు. సమష్టిగా రాణించడంలో విఫలమయ్యారు. దీంతో లంకకు వరుస ఓటములు తప్పలేదు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో కూడా ఓటమి పాలు కావడంతో లీగ్ దశలోనే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News