తమ పూర్వ విద్యార్థిని హరిణి అమరసూరియ శ్రీలంకకు 16వ ప్రధాని కావడం పట్ల తమకు ‘ఎంతో గర్వంగా ఉంది’ అని ఢిల్లీలోని హిందు కళాశాల వెల్లడించింది. ‘తమ పూర్వ విద్యార్థిని డాక్టర్ హరిణి అమరసూరియ సాధించిన గణనీయ విజయాన్ని హిందు కళాశాల గర్వంగా వేడుక చేసుకుంటున్నది. శ్రీలంక ప్రజాస్వామ్య సామ్యవాద రిపబ్లిక్ 16వ ప్రధాని కావడం, ఆ ప్రతిష్ఠాకర పదవిని నిర్వహిస్తున్న మూడవ మహిళ కావడం ద్వారా ఆమె చరిత్ర సృష్టించారు.
హిందు కళాశాల తరగతి గదుల నుంచి తన దేశంలో అత్యున్నత పదవికి డాక్టర్ హరిణి ప్రస్థానం ఆమె పూర్వ విద్యా సంస్థకు అమిత గర్వకారణం’ అని కళాశాల ఒక ప్రకటనలో పేర్కొన్నది. డాక్టర్ హరిణి జయసూరియ 1991 నుంచి 1994 వర్కు హిందు కళాశాల విద్యా సంవత్సరాల్లో సోషియాలజీ విభాగం విద్యార్థిని. నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పిపి) పార్టీకి చెందిన అమరసూరియ విద్యా,హక్కుల కార్యకర్త. విశ్వవిద్యాలయ అధ్యాపకురాలు. విద్య, సాంఘిక న్యాయ రంగాల్లో ఆమె విశేష కృషి చేశారు. ఆమె నియామకం శ్రీలంక రాజకీయాల్లో గణనీయమైన మైలురాయి.