Monday, May 5, 2025

స్వర్గాలు కరిగించి స్వప్నాలు పలికించిన ఆశాదూత శ్రీశ్రీ

- Advertisement -
- Advertisement -

ఎర్రకాంతుల ఇనోదయమూ
రెక్క విప్పిన రివల్యూషన్
కడలి వలపూ, వలవు కడలీ
కవీ, నీపాటల్!
కవీ ! నీగళగళన్మంగళ
కళాకాహళహళాహళీలో
కలసిపోతిని ! కరిగిపోతిని!
కానరాకే కదలి పోతిని!

ఇవేమిటి వింత భయాలు?
ఇంట్లో చీకటి!
ఇవేమిటీ అపస్వరాలు?
తెగింది తీగ!
అవేమిటా రంగుల నీడలు?
చావూ, బ్రదుకూ!
ఎచటికి పోతావీ రాత్రి?
అవతలి గట్టుకు!

జూన్ 15, 1983 నాడు శ్రీశ్రీ ఈ లోకం నుండి వెళ్ళిపోయినప్పుడు నివాళి అర్పించడానికి ఇంతకంటే గొప్ప కవితా వాక్యాలు లేవు. 1936 లో ఏ.సి.స్విన్బర్న్ అనే ప్రముఖ ఆంగ్లకవి కోసం శ్రీశ్రీ రాసిన కవితలోని పాదాలివి. శ్రీశ్రీ అనువాదం చేసిన మయకోస్కీ ‘లెనిన్’ కావ్యంలోని వాక్యం ప్రేరణగా ‘కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీని కన్నది’ అంటూ శివసాగర్ నివాళులర్పించాడు. ఏ కవికైనా నివాళి అర్పించడానికి తాను రాసిన కవి తా వాక్యాలే ఆలంబన కావడం కన్నా గొప్పతనం ఏముంటుంది? ‘ఇప్పటి దాకా తెలుగు కవిత్వం నన్ను నడిపించింది. ఇకనుండీ తెలుగు కవిత్వాన్ని నేను నడిపిస్తున్నాను. ఈ శతాబ్దం నాది’ అని సగర్వంగా ప్రకటించి తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, శాసించిన మహత్తర శక్తి శ్రీశ్రీ. ఏప్రిల్ 30, 1910 నాడు జన్మించిన శ్రీశ్రీకి ఇది 115వ జయంతి. తాను ఈ లోకం నుండి వెళ్ళిపోయి 42ఏండ్లు కావస్తున్నాయి.

‘మహాప్రస్థానం’లోని మొదటి గీతం ‘జయభేరి’కి ఈ జూన్ 2025కి 92ఏండ్లు నిండుతాయి. జూన్ 1950లో ప్రచురితమైన ‘మహాప్రస్థానం’కు 75 ఏండ్లు. దాదాపు గత తొమ్మిది దశాబ్దాలుగా తెలుగు సాహిత్యం, కవి త్వం మీద శ్రీశ్రీ నెరపిన ప్రభావం అపూర్వమైనది. ఎవరు కాదన్నా చెరిగిపోనిది, చెరపలేనిది. అనేక తరాల తెలుగు ప్రజలను ఇంతగా ప్రభావితం చేసి న కవి ఇంకొకరు లేరంటే అతిశయోక్తికాదు. ఒక్క నవల మినహాయిస్తే (పదవ ఏట రాసిన వీరసింహ, విజయ సింహాలు లెక్కలోకి తీసుకోకపోతే) కవి త్వం, కథలు, నాటికలు, అనువాదాలు, సాహితీ విమర్శ, వ్యాసాలు, పదబంధ ప్రహేళిక (cross word puzzle), సినిమా పాటలు లాంటి అన్ని సాహితీ ప్రక్రియల్లోనూ విస్తారంగా సాహితీ సంపదను సృష్టించిన శ్రీశ్రీ లాంటి సాహిత్యకారుడు బహుశా తెలుగు సాహిత్యంలోనే కాదు, భారతీయ సాహిత్యంలోనూ ‘నభూతో నభవిష్యతి’.
ఇప్పటి దాకా శ్రీశ్రీ సాహిత్యాన్ని ఎందరో విశ్లేషించి, విమర్శించి అంచనా వేశారు.

ఉపయోగకరమైన సహేతుక నిష్పాక్షిక విమర్శ చేశారు. తిట్టిపోస్తూ తీవ్రంగా అభిశంసించారు. శ్రీశ్రీ సాహిత్యం అన్ని విమర్శలను దాటుకుని నిలబడింది. ప్రజల నాలుకల మీద సజీవంగా ఉన్నది. తన సాహిత్యంలో ఏ సమాజమైతే మారాలని శ్రీశ్రీ ఆశించాడో అది కొనసాగినంత వరకూ తన సాహిత్యం ప్రాసంగికంగా ఉంటుంది. శ్రీశ్రీ కవిత్వంలోని విశ్వజనీన మానవ విలువలు, తాత్వికత సజీవంగానే ఉంటాయి. తన జీవితకాలంలో ప్రతి సామాజిక చలనంలో క్రియాశీలక పాత్ర నిర్వహించిన శ్రీశ్రీ ఆచరణ, అనేక లొసుగులు, తప్పిదాలు ఉన్నప్పటికీ, సామాజిక మార్పును ఆశించే ప్రతి ఒక్కరికీ నేర్చుకోదగ్గ పాఠమే.

నవ్య కవిత్వ, అభ్యుదయ కవిత్వ, విప్లవ కవిత్వ ఉద్యమాల్లో అగ్రగామి పాత్ర నిర్వహించిన శ్రీశ్రీ, సమాజంలోని కుళ్ళుని ధిక్కరించిన దిగంబర కవిత్వంతో భుజం భుజం కలిపి నడిచాడు. గురజాడ వేసిన బాటను మరింత వెడల్పు చేసి, కవిత్వాన్ని పాటగా నిరక్షరాస్యులైన పీడిత ప్రజానీకం వద్దకు తీసుకెళ్లిన తరాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించి, కలిసి నడిచాడు. శ్రీశ్రీ గొప్ప చదువరి. సంస్కృత, తెలుగు, అంతర్జాతీయ సాహిత్యాన్ని ఔపోసన పట్టాడు. ఎందరో కవులను తెలుగులోకి అనువాదం చేశాడు. తాను జీవిస్తున్న కాలం కన్నా కనీసం ఒక శతాబ్దం ముందుండి ఆలోచించిన దార్శనికుడు. గొప్ప సృజనాత్మకత గల భావుకుడు. తెలుగు కవిత్వంలో శ్రీశ్రీ చేసినన్ని ప్రయోగాలు మరొకరు చేయలేదనడం అతిశయోక్తి కాదు. ఆయన చేసిన అనువాదాలు కూడా ముందు చూపుతో చేసినవే.

శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ వరకే కవి అనీ, తర్వాత కాదనీ, కవిత్వం రాస్తున్నప్పుడు మార్క్సిస్టు కాదని, మార్క్సిస్టులతో కలిసి నడిచినప్పుడు కవి కాడని, ‘మహాప్రస్థానం’లో ప్రాచుర్యం పొందిన గేయాల్లో ఉద్రేకాన్ని రెచ్చగొట్టే శబ్దాతిరేకతే తప్ప, వాటి ప్రాసంగికత పోయాక తేలిపోతాయని, కమ్యూనిస్టు అయ్యాక ‘భ్రష్టుపట్టి పోయి కవిత్వం రాయలేకపోయాడని కొందరు విమర్శకులన్నారు, మరికొందరు స్త్రీలు, దళితులు, మైనారిటీల గురించి రాయలేదన్నారు. బ్రాహ్మణుడు కాబట్టి కుల సమస్యను పట్టించుకోలేదని, దళితులపై అణచివేత గురించీ రాయలేదన్నారు. ‘మహాప్రస్థానం’ నిండా సంస్కృత సమాసభూయిష్టమైన భాష అని, వాడినవన్నీ హైందవ బ్రాహ్మణ ప్రతీకలనీ విమర్శించారు.

వేర్వేరు కారణాల వల్ల, తెలుగు సాహిత్యంలో, సమాజంలో శ్రీశ్రీ తీసుకొచ్చిన మహత్తరమైన మార్పుని, కదలికని, మొత్తంగా ఆయన కృషినీ పూర్తిగా నిరాకరిస్తూ కొట్టిపారేస్తున్నారు. ఏ పీడిత ప్రజల విముక్తిని ఆయన్ను కోరుకుని సా హిత్యం సృష్టించాడో వాళ్ళే శ్రీశ్రీని ప్రశ్నిస్తున్నారు. శ్రీశ్రీ దళితుల గురించి కుల అణచివేతల గురించి పీడిత కులస్పృహతో రాయలేదు అనడం పూర్తిగా అచారిత్రికమైన విమర్శ. ఆయన ‘మహాప్రస్థానం’ రాసిన 1930-40 కాలం, ఆనాటి చారిత్రిక పరిస్థితులు, తెలుగు సాహిత్యంలో ఆనాడున్న పరిస్థితులు, ఆయన జీవితం, అధ్యయనం – ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా ఆయనని తిరస్కరించే విమర్శ పూర్తిగా అచారిత్రికమైనది. ఏ సాహిత్యకారుల సాహిత్యాన్నైనా వాళ్లు జీవించిన చారిత్రిక పరిస్థితులు, జీవితం, నేపథ్యం నుండే అంచనా వేయా లి. చరిత్ర నుండి, సామాజిక నేపథ్యం నుండి శ్రీశ్రీ ని వేరు చేసి, ఆయన నుండి సమస్తాన్ని ఆశించడం, అభియోగాలతో తిరస్కరించడం సరైంది కాదు.

‘మహాప్రస్థానం’లో శ్రీశ్రీ వాడిన భాష శబ్దసౌందర్యం గల సంస్కృత సమాసాలతో ఉండొ చ్చు. కానీ మనకు చిరపరిచితమైన పురాణ ప్రతీకలను అపరిచయం (defamiliarize) చేస్తూ పూర్తి విరుద్ధ, భిన్నార్థాల్లో ఆయన సృష్టించిన పదబంధాలను, పదచిత్రాలను, సరికొత్త డిక్షన్ను, అది తెలు గు కవిత్వానికి చూపిన సరికొత్త ప్రజాస్వామిక మార్గాల్ని గుర్తించాలి కదా! ‘భిక్షువర్షీయసి’ కానీ, ‘ఉన్మాది’ కానీ, ‘బాటసారి’ కానీ, కమ్మరి, కుమ్మ రి, సాలెలు, జాలర్లు కానీ, ‘ఊరవతల నీరింకిన చెరువు పక్క సఖుల వలన పరిచ్యుతులు, జనుల వలన తిరస్కృతులు’ కానీ, పతితులు, భ్రష్టులు, బాధసర్పదష్టులు కానీ, కడుపు దహించుకు పోతూ రాక్షస రతిలో నలిగిపోయే వేశ్య కానీ దళిత బహుజనులు కారా? నిన్నటి జట్కావాలా ప్రత్యేకంగా కుల ప్రస్తావన లేకపోయినా బహుజనుడు కదా.

‘యిప్లవం యాడుందో అక్కడే కూడున్నది’ దళిత బహుజనులకు కదా. ప్రత్యేక కుల స్పృహ శ్రీశ్రీకి లేకపోవచ్చేమో కానీ ఆయన సాహిత్యమంతా వాళ్ళ విముక్తి గురించే కదా? ‘ఈ లోకం మీదేనండీ ఈ రాజ్యం మీరేలండీ’ అని పీడిత ప్రజల రాజ్యాధికార స్పష్టతతో 1940లోనే రాసిన శ్రీశ్రీ తాత్విక దార్శనికత గొప్పది కాదా? ‘మహాప్రస్థానం’, ‘ఖడ్గసృష్టి’ నుండి ‘మరో ప్రస్థానం’ దాకా జాతీయ అంతర్జాతీయ సమాజం తో శ్రీశ్రీ సాహిత్యం, జీవితం ప్రయాణం చేసింది. సంస్కృత సమాస భూయిష్టమైన మహాప్రస్థాన భాష నుండి నిరక్షరాస్యులైన పీడిత ప్రజల భాష, డిక్షన్కు శ్రీశ్రీ కవిత్వం ‘మరో ప్రస్థానం చేసింది’. దుర్భర పేదరికం, చాలీచాలని జీతం, సినిమా పా టలు రాస్తే వచ్చే అరకొర ఆదాయం, అయినా చలించకుండా ప్రజలతో నిలబడ్డ జీవిత ప్రయా ణం. లౌల్యాలతో క్షమించరాని తప్పిదాలు చెయ్య క పోలేదు. ఆయనను ఏ తప్పిదాలు లేని స్వచ్ఛమై న పరిపూర్ణ మానవుడిగా చూస్తూ, ఆయనలోనూ మనుషుల్లో సహజంగా ఉండే లోపాలుంటాయని గుర్తించకపోవడం అచారిత్రికం, అశాస్త్రీయం! ఆ యన తన తప్పుల్ని గుర్తించి, తనను ప్రేమించిన స మాజాన్ని క్షమాపణలు అడిగితే తెలుగు ప్రజలు ఆయనను అక్కున చేర్చుకున్నారు. ఆయన కవి త్వం తెలుగు సమాజంలో ఇప్పటికీ ప్రాసంగికం గా, సజీవంగా ఉన్నది. విశ్వజనీన తాత్వికతతో శ్రీశ్రీ కవిత్వం, సాహిత్యం జాతి జీవనాడిగా స్పం దిస్తూ, జీవనదై పారుతున్నది.
నారాయణ స్వామి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News