నా నేల మీద మందిరాలు, మసీదులున్నాయి
గురుద్వారాలు, చర్చీలు వున్నాయి
జైన దేవాలయాలు, బౌద్ధ ఆరామాలు
వెలుగుతున్నాయి
పారసీల ప్రార్ధనా మందిరాలు
మరెన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయి
ఐనా ఇక్కడ -నా దేహం నాది
అన్న స్వరాలు శ్రమ శక్తులవుతాయి
విశ్వాసమున్న వాడు, నమ్మకం లేనివాడు ఇద్దరూ కలిసి చెమటోడ్చే కూలీలవుతారు
పొలాల్లో బురద కాళ్ళను నాగలి కర్రులు చేసి రాజనాలు పండిస్తారు
విత్తనమై ఈ మట్టిపొరలతోనే స్నేహం చేస్తారు
ఆకలికి కడుపు నింపి, ఎండిన డొక్కలకు
సేదదీర్చి తిరిగి శ్రమ శక్తికి ఊపిరి అవుతారు
శ్రమకు, ఆకలికి కులం లేదు, మతం లేదు
మట్టికి జాతి లేదు, వర్ణం లేదు
విత్తనానికి మందిరం లేదు, మసీదు లేదు గురుద్వార లేదు, చర్చీ లేదు
ఆకలి కడుపే దాని నివాసం,
మట్టి పొరలే దాని అంగవస్త్రం
కారుణ్యమే దాని గుణం, త్యాగమే
దాని కులం, మతం, జాతి, వర్ణం
మనం విత్తనమవుదాం
ఈ మట్టికి శ్వాస అవుదాం
ప్రసూతిలో ప్రసవ వేదన పడుతున్న
తల్లి ఈ నేల కొత్త జన్మకు స్వాగతిద్దాం
కాలం వంతెన మీద నిలబడి
కొత్తపాట పాడుకుందాం
- డా.రూప్‌కుమార్ డబ్బీకార్