మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం లో అత్యాధునిక సౌకర్యాలతో మరో బస్ స్టేసన్ అందుబాటులోకి తే వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎంజిబిఎస్, జె బిఎస్ బస్ స్టేషన్స్‌తో పాటు మహబూబ్‌నగర్, వికారాబాద్ వైపు వెళ్లే ప్రయాణీకుల సౌకర్యార్థం ఆరాంఘర్ ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో నూతన బస్ స్టేషన్ నిర్మించాలనే ఆలోచన ఉందని ర వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ఆరాంఘర్‌లో అత్యాధునిక బస్టాండ్‌ను నిర్మించేందుకు స్థలం కోసం ప్రభుత్వాన్ని అడిగామని అది గాకపోతే ప్రత్యామ్నయం గురించి ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు. నాటి అవసరాల కోసం ఎంజిబిఎస్, జెబిఎస్ వంటి బస్ స్టేషన్‌లను నిర్మించారని, ఇప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, మహబూబ్‌నగర్, వికారాబడాద్ ప్రాంత ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా ఆరాంఘర్ వద్ద ఒక స్థలం ఉందని దాంట్లో నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నిర్మించేందుకు ఆలోచన ఉందని, దీనిపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ఫోర్త్ సిటీకి అనుసంధానం చేసేందుకు కూడా వీలుగా ఉంటుందన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం ఆర్‌టిసి డిపోలు, బస్‌స్టేషన్‌ల కోసం స్థలం ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. నగరం విస్తరిస్తున్న కారణంగా బస్‌స్టేషన్‌లు, డిపోల నిర్మాణానికి స్థలాలు దొరకడం ఇబ్బందికరంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో బస్సుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల డిమాండ్ మరింత పెరిగిందని, ఈ నేపథ్యంలో ప్రయాణికులకు అన్ని అత్యాధునిక సౌకర్యాలతో బస్ స్టేషన్‌లు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం అన్నారు. ప్రయాణికుల సంక్షేమమే ధ్యేయంగా రాబోయే కాలంలో మోడ్రన్ లుక్, మోడ్రన్ ఫెసిలిటీలతో బస్ స్టేషన్‌లు నిర్మిస్తామని, ప్రతి గ్రామానికి బస్సులను నడుపాలన్నది ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అన్నారు. తెలంగాణ ఆర్‌టిసి దేశానికే రోల్ మోడల్‌గా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.