Tuesday, May 20, 2025

మానసిక రుగ్మతలతో మొదటికే మోసం

- Advertisement -
- Advertisement -

మానసిక ఆరోగ్యమే జీవిత వికాసం. మానసిక ఆరోగ్య సమస్యల వల్ల జీవితాలు ఛిన్నాభిన్నమవుతున్నా యి. ఈ సమస్యల వల్ల ఉత్పాదకతకు నష్టం వస్తోందన్న అంశంపై ఎకనామిక్ సర్వే 2024 మొట్టమొదటిసారి దృష్టి కేంద్రీకరించింది. దేశంలోని వయోజనుల్లో 10.6% మంది మానసిక రుగ్మతలకు గురవుతున్నారని ఈ సర్వే అంచనా వేసింది. మానసిక ఆరోగ్య సమస్యల వల్లనే 2012 నుంచి 2030 కాల పరిధిలో 1.03 ట్రిలియన్ డాలర్ల మేరకు దేశంలో ఆర్థిక నష్టాలు ఎదురవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఈ సమయంలో యువభారతీయులు ఎదుర్కొనే మానసిక సమస్యలు మరింత ఎక్కువవుతాయని సూచించింది. దీని వల్ల విద్యా పనితీరు, సామాజిక ప్రవర్తనపై విపరీత ప్రభావం చూపించి, విద్యార్థుల పాలిట వ్యసనాలను ప్రేరేపిస్తుంది. ఉన్నత విద్యలో పోటీ క్రూరత్వం, సరైన ఉద్యోగాలు దొరకడంలో కష్టాలు, ఒత్తిడి స్థాయిలను, ఆందోళనలను పెంచుతున్నాయి.

ఎంపిక ప్రక్రియల తీరు వల్ల ప్రతిభావంతులైన అనేక మంది విద్యార్థులకు కూడా వ్యతిరేక ఫలితాలు ఎదుర్కోవలసి వస్తోంది. ఉన్నత చదువుల కోసం అమెరికాలో ఉన్నత చదువులను ఆశించే విద్యార్థుల వీసాలపై వేటువేయడం అనేక మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. కేరళలో భయంకరమైన డ్రగ్ సంక్షోభానికి విద్యాసంస్థలు కేంద్రాలుగా అవతరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ అనారోగ్యానికి మూలం సామాజిక ఆర్థిక అంశం. ఇది చట్టపరంగా పరిష్కరించాల్సిన సమస్య. అన్ని విధాలా అవకాశాలు కోల్పోయి కుంగుబాటుకు గురైన యువత మానసిక దౌర్బల్యాల వల్ల వ్యసనాలకు బానిస కావడం ఆయా కుటుంబాలకు, సమాజానికి తీవ్ర సమస్యగా తయారవుతోంది. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, స్వీయ భద్రత కల్పించకపోవడం విద్యావ్యవస్థ వైఫల్యాలు యువత స్వయంగా పెడదారిపట్టడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావం కూడా పనిచేస్తోంది. అందుకనే 16 ఏళ్ల లోపువారికి సోషల్ మీడియా వినియోగాన్ని ఆస్ట్రేలియా నిషేధించింది.

మన దేశంలో సైబర్ బెదిరింపులు, పోర్నోగ్రఫీ స్క్రీన్ ఎడిక్షన్‌కు బానిస కావడం, తదితర అనర్ధాలను విద్యావేత్తలు, తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నప్పటికీ తమ పిల్లల్లో అనారోగ్య లక్షణాలు, ఒంటరితనం, తదితర విపరీతాల వల్ల మనసులకు తీవ్ర నష్టం అవుతుండడాన్ని గమనించలేకపోతున్నారు. మనదేశంలో మానసిక ఆరోగ్యానికి సరైన ప్రాధాన్యం లభించడం లేదు. మానసిక రుగ్మతల్లో సగం వ్యక్తికి 14 ఏళ్ల వయసు వచ్చే ముందే తొలిసంకేతాలు చూపుతాయి. మూడొంతుల రుగ్మతలు 24 ఏళ్లకు ముందే ప్రారంభమవుతాయి. కౌమార దశలో 20% కంటే తక్కువ, పెద్దల్లో 44%వరకు మాత్రమే ప్రజలకు అవసరమైన చికిత్స లభిస్తోంది. వైద్యపరంగా ఎంతో పురోగతిలో ఉన్న అమెరికాలో ప్రతి ఐదుగురిలో ఒకరు మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతి 25 మందిలో ఒకరు స్కిబో ఫ్రేనియా, బైపోలార్ డిజార్డర్ వంటి తీవ్ర సమస్యలతో సతమతం అవుతున్నారు. భారతదేశంలో ప్రతి 20 మందిలో ఒకరు కుంగుబాటుతో బాధపడుతున్నారని జాతీయ మానసిక ఆరోగ్య వ్యూహం (ఎన్‌ఎమ్‌హెచ్‌ఎస్) 201516 అధ్యయనంలో రుజువైంది.

లాన్‌సెట్ సైకియాట్రీ 2017లో అధ్యయనం ప్రకారం భారత దేశజనాభాలో 14.3% మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కల ప్రకారం 2019లో 1,39,123 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి 3.4% పెరిగాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ 201516లో దేశవ్యాప్తంగా చేసిన అధ్యయనం ప్రకారం 15 కోట్ల మంది భారతీయులకు చురుకైన మానసిక ఆరోగ్యం అవసరం. ఇందులో చికిత్స పొందుతున్న వారు 3 కోట్ల మంది కన్నా తక్కువే. భారతదేశం ప్రస్తుతం తన మొత్తం ఆరోగ్య బడ్జెట్‌లో మానసిక ఆరోగ్యం కోసం వెచ్చిస్తున్నది అతిస్వల్పం. అదికూడా పూర్తిగా వ్యయం కావడంలేదు. 2019లో రూ. 62,398 కోట్ల ఆరోగ్య సంరక్షణ బడ్జెట్‌లో జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాలకు నిధుల కేటాయింపు రూ. 50 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు తగ్గింది. అంటే దేశ ఆరోగ్య బడ్జెట్‌లో మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం కేటాయిస్తున్నది 0.06% మాత్రమే. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) 2021 డేటా ప్రకారం దేశంలో 13,000 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ మంది కుంగుబాటుకు గురవుతున్నారని, 2030 నాటికి అభిజ్ఞ, అభివృద్ధి, మేధో, మానసిక, శారీరక, ఇంద్రియ లేదా బహుళ కారకాల వల్ల వైకల్యాలు ఏర్పడే పరిస్థితికి దారి తీయవచ్చు. నైరాశ్యభారం దేశంలో కొనసాగడానికి కారణాలు తెలుసుకోవడానికి 2024లో అధ్యయనాలు కొనసాగాయి. 56 మిలియన్‌కు పైగా మంది నైరాశ్యంతో సతమతమవుతున్నారని తేలింది. ప్రతి 150 మందిలో ఒకరు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీరిలో 70% మంది ఎలాంటి చికిత్సకు నోచుకోకుండా ఉండిపోతున్నారు. ఈ మానసికి స్థితి అసమతుల్యతను తక్కువ మానసిక స్థితి, శక్తి క్షీణించడం, ఆసక్తి కోల్పోవడం, స్వీయహాని ఆలోచనలు వంటి లక్షణాలుగా వర్గీకరించారు. ఇవి కాక ఉన్మాదపు పోకడలు కనిపిస్తుంటాయి. ఆత్మహత్యలతో జీవితాలను అంతం చేసుకున్న 60% మందిపై పరిశోధన కేంద్రీకరించగా, కుంగుబాటు, మానసిక స్థితి అసమతుల్యత వల్లనే ఇది జరిగిందని వెలుగులోకి వచ్చింది.

దేశంలో మానసిక ఆరోగ్యం చిత్రాన్ని పరిశీలిస్తే అనేక కారణాలు దీనితో ముడిపడి ఉంటున్నాయి, విద్యార్థులు, యువకుల విషయంలో భౌతికపరమైన అంశాల కోసం అన్వేషణ తీవ్రమైన పోటీగా మారడం, విశ్రాంతిపైన, ఒత్తిడి తగ్గించుకోవడం పైన దృష్టి పెట్టకపోవడం, ఫలితంగా జీవితాల్లో కుంగుబాటు పెరుగుతోంది. వీటన్నిటితో కలిపి ఇంటర్నెట్, సోషల్ మీడియాలతో విపరీతమైన ఒత్తిడులు పెరుగుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో నేషనల్ టెలిమెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (టెలి మానస్ ), ఆయుష్మాన్ భారత్, హెచ్‌డబ్లుసి స్కీమ్ ఉన్నాయి. టెలిమాన్సాస్ 24 గంటలూ మానసిక వైద్యాన్ని ఉచితంగా టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ద్వారా అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ మానసిక వైద్య సేవలను ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కింద సమన్వయం చేసి అందిస్తుంది. మానసిక అనారోగ్యాన్ని కల్పించే అంశాలు రానున్న కాలంలో మరీ ఎక్కువయ్యే పరిస్థితులున్నాయి. క్రియాశీలకంగా ముందు చూపుతో వ్యవహరిస్తే సమర్థవంతమైన ప్రత్యామ్నాయాలు లభిస్తాయి.

-డా. బి.రామకృష్ణ
99599 32323

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News