Monday, February 26, 2024

అదనపు వేసవి!

- Advertisement -
- Advertisement -

ఆకాశం నిండా తెల్ల మేఘాలే! జూన్ 15వ తేదీ వచ్చేసినా తడి వార్తల జాడ లేదు. పొడి వాతావరణం రోజురోజుకీ మరింత వేడెక్కిపోయి హాహాకారాలు చేయిస్తున్నది. ముఖ్యంగా వర్షాధార భూముల్లో విత్తనాలు చల్లుకొనే దారి లేక రైతుల కళ్ళల్లో నీళ్ళు మామూలు కంటే అధికంగా చిప్పిల్లేలా చేస్తున్నాయి. విశ్వాసం ప్రకారం ఏరువాక నాడు దున్ని విత్తనాలు చల్లుకొన్న రైతులు అవి మొలకలయ్యే అవకాశాలు మూసుకుపోడంతో ఆకాశం వైపు నిరాశగా చూస్తున్నారు. మామూలుగా జూన్ మొదటి రెండు వారాల్లో చల్లబడాల్సిన భూమి ఇంకా భగభగ మండుతున్నది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దిగువకు రావడం లేదు. ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్ ఈ విషయమై ముందే హెచ్చరించింది. ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది తొలకరి ఆలస్యంగా తొంగి చూస్తుందని, వేడి ఠారెత్తిస్తుందని ప్రకటించింది.

Also Read: రాష్ట్రంలో మరో17 బిసి గురుకుల డిగ్రీ కాలేజీలు

కాని ప్రభుత్వ ఆధ్వర్యంలోని వాతావరణ విభాగం (ఐఎండి) మాత్రం ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని చెప్పి ఆశలు చావకుండా చూసింది. చివరికి స్కైమెట్ దే వాస్తవమవుతున్నది. జులై 6 వరకు తెలంగాణకు చినుకు మోక్షం లేదని ఈ సంస్థ తాజాగా ఒక భయోత్పాత ప్రకటన చేసింది. రేకు కప్పుల ఇళ్ళల్లో నివసించే నిరుపేదలు, శ్రమజీవులు, రైతులు ఈ వేడిని ఎలా తట్టుకొంటారు? బిపర్జాయ్ తుపాను వల్ల నైరుతి రుతుపవనాలు ఆలస్యమవుతాయని కొద్ది రోజులుగా అనుకొంటున్నదే. స్కైమెట్ కూడా అదే చెబుతోంది. ఈ తుపాను గుజరాత్ తీరంలో బీభత్సాన్ని సృష్టిస్తున్నది. ప్రధాన తొలకరి ప్రాంతమైన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, బీహార్, తూర్పు యుపి, స్వల్ప ప్రాంతం మినహా తెలంగాణ అంతటా మండు వేసవి కొనసాగుతుందని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు భరించలేని వేడి అనుభవిస్తాయని స్కైమెట్ హెచ్చరిస్తున్నది.

దేశంలోని 32 కోట్ల 90 లక్షల హెక్టార్ల భూప్రాంతంలో 14 కోట్ల హెక్టార్ల భూమి సాగుకు అనువైనదని ఇందులో 7 కోట్ల హెక్టార్లు పూర్తిగా వర్షాధార భూమి అని గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు ఈ వర్షాధార ప్రాంతమంతా ఇప్పుడు సాగు నీటి కోసం ఆవురావురుమని ఎదురు చూడవలసిందే. ఈసారి ఏ పంట వేసుకోవాలి అనేది రైతులకు సంకట ప్రాయంగా మారనున్నది. వ్యవసాయ అధికార్లు వారికి తగు సలహాలు ఇచ్చి ఈ కష్ట కాలంలో ఆదుకోవలసి వుంది. కేరళలో 60 శాతం వాతావరణ కేంద్రాల పరిధిలో వర్షం పడితేగాని తొలకరి వచ్చినట్టుగా భావించలేమని అది ఇంత వరకు పూర్తిగా ఏర్పడలేదని హైదరాబాద్‌లోని ప్రభుత్వ వాతావరణ విభాగం దాదాపు వారం రోజుల క్రితం వెల్లడించింది. ఇంత వరకు జూన్ 10 కల్లా వస్తుందనుకొన్న తొలకరి ఇప్పుడు 15 20 తేదీల మధ్య రావచ్చునని ఈ విభాగం తెలిపింది. అది జరిగినా సంతోషమే. ఈ నెలాఖరుకల్లా విత్తనాలు చల్లడం పూర్తి అయిపోయి రైతులు నిమ్మళంగా వుంటారు.

2020లో ఇలాగే తొలకరి బాగా ఆలస్యమైందని, కాకపోతే 13 వాయు గుండాలు ఏర్పడి మంచి వర్షాలు కురిశాయని ప్రభుత్వ వాతావరణ విభాగ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అందుచేత ఈ ఆలస్యం తొలకరిని బలహీనపరుస్తుందని భయపడవలసిన పని లేదంటున్నారు. మంచి ఎవరు చెప్పినా మంచిదే. అది జరగాల్సిందే. ఖమ్మం, భద్రాచలం ప్రాంతాల్లో వడగాడ్పుల పరిస్థితి వుందని చెబుతున్నారు. కరీంనగర్, ములుగు, నల్లగొండ, ఆసిఫాబాద్, జైశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 45 డిగ్రీలు, జమ్మికుంటలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మొన్నమొన్ననే అకాల వర్షాలు కురిసి కల్లాల్లోని ధాన్యపు రాశులను మితిమించి తడిపేసి రైతును తీవ్ర విషాదంలోకి నెట్టి వేశాయి.

ఇప్పుడు ఈ వర్షాభావం గోరు చుట్టు మీద రోకటి పోటు అయింది. ఈ ఏడాది రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నల్లగొండ జిల్లాలోని నిడమానూరు, సూర్యాపేట జిల్లాలోని మామిళ్లగూడెం 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతను చవిచూశాయి. హైదరాబాద్ నగరం మాత్రం 41 డిగ్రీల వద్ద చెమటలు కక్కింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ప్రత్యేక పరిస్థితులు భూమిని తీవ్రంగా వేడెక్కిస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడ్డానికి అంతర్జాతీయంగా తీసుకొంటున్న నిర్ణయాలు సవ్యంగా అమల్లోకి రావడం లేదు. వాతావరణంలో తాప వాయువుల ప్రభావాన్ని పరిమితం చేయడం, బొగ్గు సంబంధిత కాలుష్యాన్ని తగ్గించుకోడం ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగడం లేదు. దీని ప్రభావం వల్ల అనేక ఉత్పాతాలు సంభవిస్తున్నాయి. గ్రీన్ హౌస్ వాయువులు పెచ్చరిల్లి ఓజోన్ పొర తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి నుంచి మనిషి తనను తాను కాపాడుకోవలసి వుంది. సకాలంలో తొలకరి వర్షాలు కురవకపోడం వల్ల పంటలు దెబ్బతిని మితిమించిన ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం వుంది. ఇప్పటికే ఆకాశానికి అంటిన వివిధ సరకుల ధరలు ఇక దిగిరామంటూ మొండికేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News