Thursday, April 25, 2024

సమరోత్సాహంతో హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్16లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్ టీమ్‌కు భువనేశ్వర్ కుమార్, రాజస్థాన్‌కు సంజు శాంసన్ సారథ్యం వహిస్తున్నారు. రెగ్యూలర్ కెప్టెన ఐడెన్ మార్‌క్రమ్ అందుబాటులో లేక పోవడంతో మొదటి మ్యాచ్‌కు భువనేశ్వర్ సారథ్యం వహిస్తున్నాడు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది. ఇదిలావుండే సొంత గడ్డపై ఆడుతుండడంతో హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు శాంసన్ సేనను కూడా తక్కువ అంచనా వేయలేం. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

భారీ ఆశలతో..

కిందటి సీజన్‌లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన సన్‌రైజర్స్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. మినీ వేలం పాటలో హైదరాబాద్ పలువురు ప్రతిభావంతులైన క్రికెటర్లను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ సంచలనం హారీ బ్రూక్ చేరికతో బ్యాటింగ్ బలోపేతంగా తయారైంది. మయాంగ్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ తదితరులతో బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక నటరాజన్, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్, వాషింగ్టన్ సుందర్, అకిల్ హుస్సేన్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. గత సీజన్‌లో అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరిచిన రాహుల్ త్రిపాఠి ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన త్రిపాఠి చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్‌కు కష్టాలు ఖాయం. ఇక మయాంక్ అగర్వాల్ రూపంలో మరో పదునైన అస్త్రం ఉండనే ఉంది. ఎటువంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా మయాంక్ సొంతం. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక వేలం పాటలో కళ్లు చెదిరే ధరను పలికిన హారి బ్రూక్‌పై కూడా అందరి దృష్టి నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద కురిపిస్తున్న బ్రూక్ ఐపిఎల్‌లోనే చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న హైదరాబాద్ విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది.

తక్కువ అంచనా వేయలేం..

మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. కిందటి సీజన్‌లో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. హైదరాబాద్‌తో పోల్చితే రాజస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కెప్టెన్ సంజు శాంసన్‌తో పాటు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవ్‌దుత్ పడిక్కల్, హెట్‌మెయిర్, రియాన్ పరాగ్, జో రూట్, జేసన్ హోల్డర్ వంటి హార్డ్ హిట్టర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక అశ్విన్, చాహల్, బౌల్ట్, ఆడమ్ జంపా, నవ్‌దీప్ సైనీ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉన్న విషయం తెలిసిందే. దీంతో రాజస్థాన్ కూడా ఈ మ్యాచ్‌కు భారీ ఆశలతో సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News