ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టు
సొసైటీలకు జిహెచ్‌ఎంసి పరిధిలో
భూ కేటాయింపులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
లబ్ధిదారులకు ఆయా స్థలాలపై యాజమాన్య హక్కు,
చట్టపరమైన హోదా విషయంలో అనిశ్చితి
ఈ ఏడాది సెప్టెంబర్ 8న పాత్రికేయులకు
ఇళ్ల స్థలాలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం
జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులకు సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రావు బి. చెలికాని పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై విచారించిన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం లోని ధర్మాసనం సోమవారం తుది తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు నివాస స్థలాలను కేటాయించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 8న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు డాక్యుమెంట్లు అప్పగించారు.
ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో లబ్ధిదారులకు ఆయా స్థలాలపై యాజమాన్య హక్కు, చట్టపరమైన హోదా విషయంలో అనిశ్చితి ఏర్పడింది. ఈ పరిణామం రాష్ట్ర ప్రభుత్వాల స్థలాల పంపిణీ ప్రక్రియపై అనేక ప్రశ్నలను లేవదీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ స్థలాల పంపిణీ ప్రకియలో చట్టపరమైన లోపాలను ఈ తీర్పు ఎత్తి చూపింది. ఈ విషయంలో పారదర్శకతతోపాటు చట్ట పరమైన మద్దతు అవసరమని సూచించింది. దేశంలో ఇలాంటి కేటాయింపులకు సవాలుగా ఈ తీర్పు ఉదాహరణగా నిలిచింది. ఈమేరకు సంబంధిత లబ్ధిదారుల స్పందన బట్టి తదుపరి పరిణామాలు ఉంటాయి