Wednesday, April 24, 2024

ఎవరి భద్రత?

- Advertisement -
- Advertisement -

భావ ప్రకటన స్వేచ్ఛను అరికట్టడం ప్రజాస్వామ్యానికి హానికరమని సుప్రీంకోర్టు లెక్కలేనన్ని సార్లు చెప్పి వుంటుంది. కాని పాలకులు మీడియా గొంతు నొక్కడాన్ని మాత్రం మానుకోలేదు. ఏపాటి విమర్శను తట్టుకోలేని తత్వాన్ని వారు పెంచుకొన్నారు. వారిలో ప్రజాస్వామిక చైతన్యం ఏనాడో అడుగంటిపోయింది. సుప్రీంకోర్టు బుధవారం నాడు కేరళకు చెందిన మీడియా వన్ అనే మలయాళ ఛానల్‌పై కేంద్రం విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ అవసరాన్ని గురించి మరొకసారి నొక్కి చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డి.వై చంద్రచూడ్ అధ్యక్షతన గల ధర్మాసనం ఈ సందర్భంగా పాలకులకు విలువైన సూచనలు చేసింది. కచ్చితమైన ఆధారాలు చూపకుండా భద్రతా కారణాలంటూ మీడియా రెక్కలు విరిచికట్టడం ప్రజాస్వామ్యానికి తీవ్ర హానికరమని హెచ్చరించింది.

ప్రజాస్వామ్యం పటిష్టంగా వర్ధిల్లడానికి స్వతంత్ర మీడియా అత్యవసరమని, అది ప్రభుత్వ పని తీరుపై వెలుగు ప్రసరిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. నిజాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత మీడియాపై వుందని, అలాగే ప్రజలకు కఠోర వాస్తవాలను తెలియజేయడం ద్వారా ప్రజాస్వామ్యం సరైన మార్గంలో నడవడానికి అనుగుణంగా వారు సరైన నిర్ణయాలు తీసుకోడానికి తోడ్పడవలసిన బాధ్యత కూడా దానిపై వుందని చెప్పింది. సామాజిక, ఆర్థిక అంశాల నుంచి రాజకీయ సిద్ధాంతాల వరకు వివిధ విషయాలపై వైవిధ్యం, భిన్నత్వం లేని ఒకే రకమైన దృక్పథం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందని వివరించింది. దేశంలో సామాజిక, సాంస్కృతిక వైవిధ్యాన్ని హరించాలని చూస్తున్న బిజెపి పాలకుల కు ఇది చెంపపెట్టు వంటిది. మీడియా వన్ ఛానల్ ప్రభుత్వ విధానాలను విమర్శించడాన్ని సహించకపోడం మంచి పద్ధతి కాదని కేంద్రానికి ధర్మాసనం మొట్టికాయలు వేసింది. మీడియా వన్‌కు జమాత్ ఇ ఇస్లామి హింద్ సంస్థతో సంబంధాలున్నందున భద్రత సంబంధించిన కారణాలు చూపి దాని లైసెన్స్‌ను రద్దు చేయడం సరికాదని, అది నిషిద్ధ సంస్థ కాదని అభిప్రాయపడింది.

అలాగే కేంద్రం సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు తన అభిప్రాయాలు చెప్పడం కూడా తప్పని స్పష్టం చేసింది. తన అభిప్రాయాలేమిటో అవతలి పక్షానికి కూడా తెలియజేయాల్సిన అవసరం వుందని సీల్డ్ కవర్ పద్ధతికి స్వస్తి చెప్పాలని పేర్కొన్నది. పౌరుల తరపున ప్రశ్నించడం, ప్రభుత్వ తీరుతెన్నులపై చేదు వాస్తవాలను బహిరంగ పరచడం మీడియాకు ప్రాణప్రదమైన అంశాలు. ఈ లక్షణాలు గల మీడియా మాత్రమే ప్రజాస్వామ్యానికి రక్షాకవచంగా, గట్టి కావలి వ్యవస్థగా నిరూపించుకోగలుగుతుంది. దురదృష్టవశాత్తు అధికారంలో వున్న శక్తులు మీడియాకు ఈ లక్షణాలు అణుమాత్రమైన లేకుండా చేస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ఇటీవల సమర్పించిన 202324 బడ్జెట్‌లో మహిళల యాజమాన్యంలోని కుటుంబాలకు నెలకు రూ. 1000 ఇవ్వాలని నిర్ణయించింది.

అయితే ఇందుకు అర్హతలను నిర్ధారించడంలో ఆలస్యం చేయడంతో ప్రభుత్వం అనర్హులకు ఈ పథకాన్ని కట్టబెట్టాలని చూస్తున్నదంటూ ప్రదీప్ అనే వ్యక్తి ఒక పాత తమిళ సినిమాలోని దృశ్యాన్ని అనుకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్య విమర్శను పోస్టు చేశాడు. అది ఆర్థిక మంత్రికి, ముఖ్యమంత్రికి తగిలి వచ్చేలా వుంది. దానితో అర్ధరాత్రి అతన్ని అరెస్టు చేసి రెండు వారాల పాటు జైల్లో వుంచారు. భారత శిక్షాస్మృతిలోని కఠినమైన సెక్షన్‌ల కింద కేసు పెట్టారు. పాలకులు విమర్శను సహించకపోడానికి ఇంతకు మించిన ఉదాహరణ వుండదు. భారత దేశంలో పత్రికా స్వేచ్ఛ నానాటికీ హరించుకుపోతున్నదని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ (ఐపిఐ) మూడేళ్ళ క్రితమే విమర్శించింది. విమర్శ అంటే ప్రభుత్వం సహించడం లేదని, స్వతంత్ర మీడియా అంతరించిపోతున్నదని అభిప్రాయపడింది.

దేశంలో చాలా మీడియా సంస్థలు రాజకీయ పార్టీలతో సంబంధమున్న వ్యక్తుల యాజమాన్యాల్లో వుండడం వాటి స్వేచ్ఛను హరిస్తున్న కారణాల్లో ఒకటని, ఇండియాలో మీడియాను కొద్ది మంది మాత్రమే అదుపు చేస్తున్నారని అంతర్జాతీయ సంస్థలు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని కొట్టి పారేయలేము. మీడియా నిర్వహణ అత్యంత పెట్టుబడితో కూడుకొన్నందున మామూలు వ్యక్తులు ఆ సంస్థలను నిర్వహించడం కష్టసాధ్యమవుతున్నది. ఆర్థిక భారం మోయలేక చిన్న మీడియా సంస్థలు మనలేకపోతున్నాయి. ఇది అంతిమంగా మీడియాపై గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్నది. భిన్నాభిప్రాయం వ్యక్తం కాకుండా చేస్తున్న అంశం కూడా ఇదే. ప్రజల్లో నిరక్షరాస్యత, అజ్ఞానం ప్రబలి వుండడం కూడా భావ ప్రకటనా స్వేచ్ఛకు గుదిబండ వంటిది. మీడియా వన్‌పై భద్రతా కారణాలు చూపి విధించిన నిషేధాన్ని రద్దు చేయడం ద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రజాస్వామ్యానికి, స్వతంత్ర మీడియాకు రక్షా కవచంగా వుంటానని ప్రకటించింది. ఇది అత్యంత హర్షదాయకమైన పరిణామం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News