Saturday, August 16, 2025

శిక్ష ముగిసిన ఖైదీలకు సుప్రీం బాసట

- Advertisement -
- Advertisement -

నిర్ణీత శిక్ష పూర్తి చేసుకుని మరే ఇతర కేసుల్లో దోషిగా లేదా నిందితులుగా లేని ఖైదీలను తక్షణం విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడం ఖైదీల ఆశలకు కాంతి రేఖ వంటిది. శిక్షాకాలం పూర్తి చేసుకున్న ఖైదీలు ఇంకా జైళ్లలోనే మగ్గుతుండడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే పద్ధతి కొనసాగితే దోషి విడుదల కాకుండానే జైల్లోనే మరణిస్తాడని ధర్మాసనం అభిప్రాయపడింది. ఢిల్లీలో 2002లో జరిగిన పరువు హత్య కేసులో జీవితఖైదు పడిన సుఖ్‌దేవ్‌కు ఈ ఏడాది మార్చితో శిక్షాకాలం పూర్తి కాగా, తన విడుదల కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా విడుదల చేయాలని జులై 29నే సుప్రీం కోర్టు ఆదేశించింది. అతడి ప్రవర్తనను విశ్లేషించిన శిక్షా సమీక్ష బోర్డు విడుదల చేసేందుకు నిరాకరించింది. దీనిపై ఢిల్లీ ప్రభుత్వ వాదనలను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. ఇక దేశం మొత్తం మీద విచారణలో ఉన్న ఖైదీల్లో చాలా మంది అట్టడుగు వర్గాలవారేనని నివేదికలు చెబుతున్నాయి.

తమ తరఫున వాదించేందుకు న్యాయవాదులను నియమించుకోవడానికి తగిన ఆర్థిక స్తోమతు లేనివారే వీరిలో ఎక్కువ శాతం ఉంటున్నారు. అటువంటి వారి తరఫున వాదించడానికి న్యాయవాదులను (Lawyers argue) నియమించే ప్రక్రియకు సుప్రీం సహకరిస్తే చాలావరకు న్యాయం సమకూరుతుందన్న అభిప్రాయం వివిధ బడుగువర్గాల్లో వినిపిస్తోంది. దేశంలో మొత్తం 5.06 లక్షల మంది ఖైదీల జనాభాలో 74.2 శాతం మంది అంటే దాదాపు 3.75 లక్షల మంది విచారణలో ఉన్న ఖైదీలే అని నివేదికలు చెబుతున్నాయి. 4,27,000 మంది విచారణ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో 24,033 మంది విచారణ ఖైదీలు ఇప్పటికి మూడు నుంచి ఐదేళ్లపాటు జైళ్లలో మగ్గుతున్నారని రికార్డులు చెబుతున్నాయి. ఈ మేరకు బీహార్‌లో 87 శాతం మంది, ఉత్తరప్రదేశ్‌లో 77 శాతం మంది, దాద్రా అండ్ నగర్ హవేలీలో 100 శాతం మంది, జమ్మూకశ్మీర్‌లో 96.6 శాతం, ఢిల్లీలో 88.3 శాతం మంది విచారణ ఖైదీలు ఉన్నారు.

దేశం మొత్తం మీద 2022లో మొత్తం ఖైదీల్లో 23.3 శాతం మంది దోషిగా నిరూపింపబడ్డారు. వీరికి శిక్షకూడా పడింది. ఇక విచారణలో ఉన్న ఖైదీల్లో 52.1 శాతం మంది జిల్లా జైళ్లలో నిర్బంధం అనుభవిస్తున్నారు. సెంట్రల్ జైళ్లలో 35.8 శాతం మంది విచారణ ఖైదీలు బందీగా ఉన్నారు. విచారణ ఖైదీల్లో ఎక్కువ శాతం మంది జైళ్లలో ఉన్నది ఉత్తరప్రదేశ్‌లోనే. ఈ రాష్ట్రంలో మొత్తం 1,21,609 మంది ఖైదీల్లో 94,131 మంది విచారణ ఖైదీలుగా ఉంటున్నారు. తరువాతి స్థానంలో బీహార్ ఉంది. బీహార్‌లో మొత్తం 64,000 మంది ఖైదీల్లో 57,000 మంది విచారణ ఖైదీలే కావడం విశేషం. ప్రతి నలుగురు ఖైదీల్లో ముగ్గురు విచారణ ఖైదీలే ఉండడం లోక్‌సభలో కూడా చర్చల దుమారం రేపింది. భారీ సంఖ్యలో విచారణ ఖైదీలు జైళ్లలో మగ్గుతుండడం తీవ్రమైన సమస్యగా పరిణమిస్తోంది. దశాబ్ద కాలంలో దేశంలో విచారణ ఖైదీల జనాభా 8.05 శాతం పెరిగింది. 2013లో దేశం మొత్తం మీద ఖైదీల్లో 67.72 శాతం మంది విచారణ ఖైదీలుగా ఉన్నారని తేలింది.

నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం విచారణ ఖైదీల్లో సగానికి సగం మంది యువతే అని తేలింది. ప్రత్యేకంగా 49.7 శాతం మంది 18 నుంచి 30 ఏళ్ల వారే. 2013 లో వీరి శాతం 46.7 శాతం మించి మరో మూడు శాతం వరకు పెరగడం చెప్పుకోతగ్గది. యువతలో అధికశాతం మంది ప్రమాదకరమైన ప్రవర్తనలో ఉండడమే నేరస్థులుగా ముద్రపడుతున్నారు. వీరిలో ప్రగతిశీల పరిపక్వత తగ్గిపోతుంది. న్యాయదేవత కళ్లకు మాత్రం నేరస్థులైన 18 ఏళ్లు వచ్చినవారు పెద్దల వలెనే శిక్షకు అర్హులుగా పరిగణింపబడతారు. 2022 లో విచారణ ఖైదీల్లో 66 శాతం మంది అట్టడుగు కులాలకు చెందిన సామాజిక వర్గాల వారే. వీరిలో షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల వారు ఉన్నారు. అంటే ప్రతి ఇద్దరు విచారణ ఖైదీల్లో 1.3 శాతం మంది ఈ అట్టడుగు కులాలకు చెందినవారేనని తెలుస్తోంది.

విచారణ ఖైదీల్లో 20.94 శాతం షెడ్యూల్ కులాలు, 9.26 శాతం షెడ్యూల్డ్ తెగలు, 35.88 శాతం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందినవారని ఎన్‌సిఆర్‌బి డేటా వెల్లడించింది. వీరి శాతం క్రమంగా 2013లో 21.3 శాతం, 11.3 శాతం, 31.5 శాతం మొత్తం మీద 64 శాతం ఉన్నట్టు తేలింది. అయితే 2013 లో 20.8 శాతం మంది ముస్లిం విచారణ ఖైదీలు కావడం గమనార్హం. అన్ని వర్గాల విచారణ ఖైదీలను లెక్కగడితే దేశ ఖైదీల జనాభాలో 85 శాతం మంది వీరేనని బయటపడింది. ఈ అంశంపై నిపుణులు దృష్టి సారిస్తున్నారు. మైనార్టీ వర్గాల వారు ఎక్కువగా ఉండటం ప్రపంచం మొత్తం మీద కనిపిస్తున్న అంశమని నిపుణులు చెబుతున్నారు. సామాజిక, ఆర్థిక స్థాయిల్లో ఎవరైతే తక్కువగా ఉంటారో వారే జైళ్లలో ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తుంటారని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ విజయ రాఘవన్ అభిప్రాయపడ్డారు. మత ప్రాతిపదికన పరిశీలిస్తే హిందువుల వాటా 2013లో 69.01 శాతం ఉండగా, 2022 నాటికి 65.24 శాతానికి తగ్గింది.

సిక్కు సామాజిక వర్గాన్ని పరిశీలిస్తే 2013 నాటికి సిక్కు విచారణ ఖైదీల శాతం 4.2 శాతం ఉండగా, 2022 నాటికి 4.67 శాతం పెరిగింది. క్రైస్తవుల్లోని విచారణ ఖైదీల సంఖ్య 2013లో 4.55 శాతం ఉండగా, 2022 నాటికి 2.5 శాతం వరకు తగ్గింది. దేశంలోని జైళ్లు రానురాను ఖైదీలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి పదిమంది ఖైదీల్లో ఎనిమిది మంది విచారణ కోసం ఎదురు చూస్తుండడం పరిపాటి అవుతోంది. ప్రస్తుతం దేశంలో 1400 జైళ్లు ఉన్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన తరువాత 2020 నుంచి 2021 వరకు ఖైదీల సంఖ్య 13 శాతం పెరిగింది. దీంతో 80 శాతం పైగా జైళ్లు కిక్కిరిసిపోయాయి. సుప్రీం కోర్టు ఆదేశం మేరకు జైళ్లలో రద్దీని తగ్గించడానికి 2020లో అనేక మంది ఖైదీలను విడుదల చేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం జైలు ఆక్యుపెన్సీని 93 శాతం కంటే కొంచెం తక్కువగా తగ్గించారు. అయితే 2021 నాటికి ఆక్యుపెన్సీ రేటు మళ్లీ 130 శాతానికి పెరిగింది. ప్రధాన రాష్ట్రాల్లో కర్ణాటక తరవాత 100 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. దేశం మొత్తం మీద జైళ్లలో దాదాపు 63 అసహజ మరణాలు సంభవించాయి.
డిటెన్షన్ సెంటర్ల నిర్వాకం

ఇదిలా ఉండగా ఇతర దేశాలనుంచి ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి అనధికారికంగా మనదేశంలో ఉంటున్న వారిని అక్రమ వలసదారులుగా గుర్తించి శిక్ష విధించడం పరిపాటిగా వస్తోంది. అయితే వారి శిక్షాకాలం పూర్తయినప్పటికీ వారిని బహిష్కరించి వారి దేశాలకు పంపించడంలో విపరీత జాప్యం జరుగుతోంది. అంతవరకు వారు ఆయా రాష్ట్రాల్లో డిటెన్షన్ సెంటర్లు (నిర్బంధ శిబిరాలు)లో ఉండవలసి వస్తోంది. అయితే ఈ డిటెన్షన్ సెంటర్ల నిర్వహణ సరిగ్గా లేదని హర్షమండెర్ అనే ఉద్యమనేత అధ్యయనంలో వెల్లడైంది. ఆయన జాతీయ మానవ హక్కుల మైనారిటీల మోనిటర్‌గా 2018 జనవరి 2224 తేదీల మధ్యలో అసోంలోని ఆరు డిటెన్షన్ సెంటర్లను అధ్యయనం చేసి అక్కడి డిటైనీల బాధలను వెలుగులోకి తెచ్చారు. ఆ నివేదిక ఆధారంగానే సుప్రీం కోర్టులో 2018 సెప్టెంబర్ 20న పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో డిటెన్షన్ సెంటర్ల అధ్వాన స్థితి బయటి ప్రపంచానికి తెలిసింది. దీనిపై సుప్రీం కోర్టు కేంద్రానికి, అసోం రాష్ట్రానికి తమ స్పందన ఏమిటో తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. డిటెన్షన్ సెంటర్లకు, జైళ్లకు తేడా అన్నది లేకుండా పోయిందని నివేదిక వెల్లడించింది. ఇది చర్చనీయాంశం కావడంతో లోక్‌సభలో కూడా ఈ ప్రస్తావన చర్చకు వచ్చింది. దీంతో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ కన్నుతెరిచి కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో ఈ డిటెన్షన్ సెంటర్ల నిర్వహణ సరిగ్గా ఉండేలా చూడాలని ఆదేశించింది. ఈ మేరకు 2009, 2012, 2014, 2018 సంవత్సరాల్లో ఆదేశాలు జారీ అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ సెంటర్ల పరిస్థితిపై హర్షమండెర్ సాగించిన అధ్యయనంలో ఎన్నో వాస్తవాలు బయటపడ్డాయి. ప్రధానంగా జైలుకు, డిటెన్షన్ సెంటర్‌కు మధ్య తేడా లేకపోవడం, డిటైనీలను, ఖైదీలను ఒకేలా చూడడం, డిటైనీలకున్న హక్కులను పాటించకపోవడం బయటపడింది.

పెరోలు కానీ, వేతనంతోకూడిన పని వంటి ప్రయోజనాలు కానీ డిటైనీలకు వర్తింప చేయడం లేదు. ఈ నేపథ్యంలో హోం మంత్రిత్వశాఖ దేశం మొత్తం మీద డిటెన్షన్ సెంటర్లకు వర్తింప చేసే మేన్యువల్‌ను కొత్తగా రూపొందించింది. అయితే ఈ మేన్యువల్‌ను చాలా రాష్ట్రాలు వర్తింప చేయడం లేదు. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌ను పురస్కరించుకుని 2018 నవంబర్ 5న దేశం మొత్తం మీద డిటెన్షన్ సెంటర్లలో నిరీక్షిస్తున్న విదేశీయులను ఏ విధంగా చూడాలో వివరిస్తూ కొత్త నిబంధనలను తయారు చేసినట్టు సుప్రీం కోర్టుకు కేంద్రం తెలియజేసింది. ఈ మేన్యువల్ ప్రకారం జైలులో కాకుండా బయటనే డిటెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. డిటైనీల సంఖ్యను సెంటర్ పరిధి నిర్ణయించాలి. డిటైనీల శిక్షాకాలం పూర్తి కాగానే సంబంధిత అధికార యంత్రాంగానికి లేదా డిటెన్షన్ సెంటర్ ఇన్‌ఛార్జికి తెలియజేసి వారిని అప్పగించాలి. డిటైనీలు తమ నిరీక్షణ కాలంలో వీలైతే మెట్రో నగరాల పరిధిలో అధికారులకు అందుబాటులో ఉండే వెసులుబాటు కల్పించాలి.

బహిష్కరణకు సంబంధించి రాయబార కార్యాలయాల్లో సంప్రదింపుల దగ్గర నుంచి వారికి ట్రావెల్ డాక్యుమెంట్లు జారీ చేసే వరకు నిరీక్షణ కాలంలో వారికి తగిన సౌకర్యాలు సరిగ్గా సమకూర్చే బాధ్యత అధికారులదే. అలాగే డిటైనీలు ఒకే కుటుంబం వారైతే అదే సెంటర్‌లో ఉంచాలి తప్ప వేర్వేరు సెంటర్లలో ఉంచరాదు. అయితే అసోం డిటెన్‌షన్ సెంటర్లలో అలాంటి పరిస్థితి లేదని తేలింది. ఒకే కుటుంబం వారిని ఆరేళ్లకు పైగా ఉన్న పిల్లలతో సహా వేర్వేరు సెంటర్లలో నిర్బంధించి ఉంచారు. కనీసం వారికి పెరోలు కూడా అనుమతించడం లేదు. ఈ పరిస్థితులు బయటపడిన తరువాత కేంద్ర హోంశాఖ ఇలాంటి ఆంక్షలు విధించవద్దని రాష్ట్రాలను ఆదేశించింది. మరి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితుల్లో డిటెన్షన్ సెంటర్ల నిర్వహణపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటే కానీ పరిస్థితుల్లో మార్పు రాదు.

  • పి. వెంకటేశం
    9985725591
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News