Thursday, July 31, 2025

సరోగసీ రాకెట్.. లక్షల జాక్‌పాట్

- Advertisement -
- Advertisement -

మాతృత్వం! సృష్టిలోనే మహత్తరం. మాతృమూర్తి కావటం ప్రతి మహిళ గర్వకారణంగా భావిస్తుంది. ఎన్ని సిరిసంపదలు ఉన్నా బోసినవ్వుల పాపాయి ఇంటలేనిదే సంతృప్తి చెందలేరు. అలాగే పురుషుడికీ తండ్రి కావాలనే కోరిక ఉంటుంది. అయితే శారీరకమైన లోపాల కారణంగా గర్భధారణ జరగని సందర్భాల్లో ఆ దంపతుల మానసిక వేదనకు అంతు ఉండదు. అలాంటి వారికి మానసిక వేదనను దూరం చేసి, వారికి బిడ్డల్నిపొందే అవకాశం ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వల్ల కలుగుతోంది. అందులో భాగమే సరోగసీ (అద్దె గర్భం) (surrogacy) విధానం. ఆలస్యంగా పెళ్లి కావడం, భరించలేని ఒత్తిడులు, మానసిక ప్రశాంతత లోపించడం, తీరికలేని జీవనవిధానం, ఆహారపు అలవాట్లు ఇవన్నీ సంతాన వైఫల్యానికి దారితీసిన కారణాలే.

అటువంటి పరిస్థితుల్లో సరోగసీయే శరణ్యమవుతోంది. అండకణాలు, వీర్యకణాలతో ఫలదీకరణం చెందించిన తరువాత ఆ అండాలను వేరే తల్లిగర్భంలో ప్రవేశపెట్టి సంతానాన్ని పొందడాన్ని సరోగసీగా పిలుస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అద్దెతల్లుల గర్భాలద్వారా బిడ్డలను ప్రసవింపజేయడం. అయితే ఇప్పుడు సరోగసీ (surrogacy) అన్నది స్నేహపూర్వకం కాక, ఫక్కా కొన్ని లక్షల రూపాయల వాణిజ్యంగా మారింది. అంతేకాదు సరోగసీ పేరుతో శిశువిక్రయాల దందా సాగుతోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ యూనివర్శల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారం. ఇటువంటి దందాకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం 2021లో ది సరోగసీ (రెగ్యులేషన్) యాక్ట్‌ను అమలులోకి తీసుకు వచ్చింది. దీంతో ప్రభుత్వ అనుమతితోనే సంబంధీకుల ద్వారా బిడ్డలు పొందే అవకాశం ఉంది.

అయితే దేశ వ్యాప్తంగా సంతాన లేమి పెరిగిపోవడంతో 2023లో ఈ చట్టంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. దీని ప్రకారం సంతానాన్ని కోరుకునే దంపతులు అండ కణం, వీర్యం దానంగా పొందే విధానం ద్వారా తీసుకునే అవకాశం కల్పించింది. భార్యలో లోపం ఉంటే దాత అయిన మహిళ నుంచి అండకణం, భర్తలో లోపం ఉంటే దాత అయిన పురుషుడి నుంచి వీర్యం తీసుకోవచ్చు. ఈ వ్యవహారంలో ఎక్కడా ఆర్థిక లావాదేవీలు, క్రయవిక్రయాలకు ఆస్కారం ఉండ కూడదు. కానీ ఇప్పుడు ఈ నిబంధనలకు విరుద్ధంగా కేవలం సంపాదనే లక్షంగా దేశవ్యాప్తంగా అనేక అక్రమ కేంద్రాలు వెలిశాయి. యువకులు అందించే వీర్యం (స్పెర్మ్) కన్నా యువతులు అందించే అండకణం (ఎగ్) డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అండకణం దాతకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు, స్మెర్మ్ దాతకు వెయ్యి నుంచి రూ. 5 వేలు వరకు చెల్లిస్తున్నారు.

ఒక్కో అద్దె గర్భంకోసం రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు చెల్లిస్తున్నారు. అద్దెగర్భం మోసే తల్లులు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, నేపాల్ నుంచి కూడా వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 379 ప్రైవేట్ ఫెర్టిలిటీ, సరోగసీ సెంటర్లు ఉండగా, అందులో 292 కేంద్రాలు అక్రమ దందా నడుపుతున్నాయని తేలింది. సికింద్రాబాద్‌లోని యూనివర్శల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఓ జంటను మోసగించడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ సెంటర్ కేంద్రంగా శిశు విక్రయాలు సాగుతున్నట్టు బయటపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా అట్లూరి నమ్రత, అలియాస్ పచ్చిపాల నమ్రత మరో వైద్యురాలి పేరుతో ఈ రాకెట్‌ను సాగిస్తోంది. సంతానం కోసం వచ్చేవారికి ఎలాంటి అనుమతులు, నిబంధనలతో పనిలేకుండా సరోగసీ చేస్తామని చెప్పి లక్షల్లో వసూలు చేస్తున్నారు.

సరోగసీ లేకుండా నిరుపేద దంపతులకు చెందిన పిల్లల్ని అప్పగిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఓ జంటకు ఇలాగే (surrogacy) సరోగసీ లేకుండా మోసగించడంతో శిశువు పోలికలపై అనుమానంవచ్చి ఢిల్లీలో డిఎన్‌ఎ టెస్టులు చేయడంతో అసలు బండారం బయటపడింది. సరోగసీ పేరుతో రాజస్థాన్ దంపతుల నుంచి రూ. 30.25 లక్షలు గుంజినట్టు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో తెలంగాణ రాష్ట్రమంతా ఐవిఎఫ్, సరోగసీ కేంద్రాల్లో తనిఖీలు సాగుతున్నాయి. ఇతర దేశాల కన్నా భారత దేశంలో సరోగసీకి అయ్యే ఖర్చు తక్కువ కావడంతో విదేశాల దంపతులు కూడా భారతదేశానికి వచ్చి సరోగసీ చేయించుకోవడం ఎక్కువైంది. ఈ వాణిజ్య సరోగసీని 2015 లో కేంద్రం నిషేధించింది. ఐక్యరాజ్యసమితి అధ్యయనం ప్రకారం భారత దేశంలో 3000 కన్నా ఎక్కువ సంఖ్యలో సంతానోత్పత్తి క్లినిక్‌లు ఉన్నాయని తేలింది.

ఏటా 400 మిలియన్ డాలర్లకు పైగా ఈ వ్యాపారం సాగుతున్నట్టు అంచనా. సరోగసీ అక్రమాల వెనుక ఆర్థిక సంబంధమైన సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. అద్దెగర్భాల తల్లులు చాలావరకు కటిక పేదరికం అనుభవిస్తున్నవారే. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ శివారు ప్రాంతంలోలోని గ్రామం సరోగసీ (surrogacy) తల్లులకు స్థావరంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు మామూలు కూలి చేసుకుని బతికే వీరంతా సరోగసీ తల్లులుగా మారి లక్షాధికారులయ్యారు. ప్రసవానికి నాలుగైదు లక్షల రూపాయలతోపాటు ఆహారానికి, ఇతర అవసరాలకు మరో ఇరవై వేలు రూపాయలు సులువుగా అందడం తమ జీవితాలను మార్చివేసిందని వారు చెబుతున్నారు.

ఈ సరోగసీ కేంబ్రిడ్జి యూనివర్శిటీకి కూడా పాకింది. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో పరిశోధనలు, అధ్యయనం సాగించే సామాన్య విద్యార్థినులు తమ ఆర్థిక అవసరాల కోసం సరోగసీ వైపు మొగ్గు చూపుతున్నారు. వీరి అండకణానికి 750 డాలర్ల వంతున కొన్ని సంస్థలు చెల్లిస్తున్నాయి. వీరిలో అండకణం ఉత్పత్తి అమాంతంగా వృద్ధి కావడానికి తీసుకున్న మందులు ఒక్కోసారి వీరి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. శరీరంలో మార్పులు వస్తున్నాయి. అయినా ఆర్థిక బలహీనతలే వీరిని లొంగదీస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News