బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి ఆమె తప్పుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. సినిమా చేయాలంటే దీపికా పలు కఠినమైన కండీషన్లు పెట్టడమే ఇందుకు కారణమని గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు దీపికాకు మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah) మద్ధతు ఇస్తున్నారనే వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం దీపికాకు సంబంధించిన వీడియోకి తమన్నా లైక్ కొట్టడమే.
దీపిక (Deepika Padukone) గతంలో సినిమాల్లో ఓవర్‌టైమ్ పని చేయడం.. ప్రపంచంలో నెలకొన్న లింగ అసమానతల గురించి మాట్లాడిన వీడియోని ఓ అభిమాని సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకి తమన్నా లైక్ కొట్టినట్లు స్క్రీన్‌షాట్ తీసి ఆ వ్యక్తి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో దీపికాకు తమన్నా (Tamannaah) సపోర్ట్ ఇస్తున్నారని అంతా అనుకున్నారు. అయితే తమన్నా తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ‘‘తనకు తానుగా పోస్ట్‌లను ఇన్‌స్టాగ్రామ్ ఎలా లైక్ చేస్తుందో చెబితే బాగుంటోంది. ఈ విషయం తెలియని కొందరు దీన్ని పెద్ద వార్తలా ప్రచారం చేస్తున్నారు. నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి’’ అంటూ తమన్నా తన స్టోరీలో పోస్ట్ చేశారు. దీంతో తమన్నా కావాలని లైక్ చేయలేదని స్పష్టమవుతోంది.