Tuesday, September 10, 2024

దసరాకు కొత్త టీచర్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో దసరా నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరనున్నారు. సెప్టెంబర్ చివరి నాటికి డిఎస్‌సి ద్వారా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్‌సి పరీక్షలు ఈనెల 5వ తేదీతో ముగిసాయి. గత 18వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలను 55 కేంద్రాలలో షిఫ్టుల వారీగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు. డిఎస్‌సి పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ఆయా ప్రశ్నాపత్రాలకు సంబంధించిన ప్రాథమిక కీ లను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. అనంతరం ప్రాథమిక కీ లపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. నిపుణుల కమిటీ అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఆయా ప్రశ్నాపత్రాల తుది కీ ఖరారు చేస్తారు.

ఈ ప్రక్రియ దాదాపు రెండు వారాలలో ముగియనుంది. ఈసారి ఆన్‌లైన్ విధానంలో డిఎస్‌సి నిర్వహించిన నేపథ్యంలో తుది కీ ఖరారైన వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. అంటే సెప్టెంబర్ నెలలో డిఎస్‌సి ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిఎస్‌సి ఫలితాలు వెలువడిన తర్వాత ఆయా పోస్టులకు 1ః3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ ఏడాది అక్టోంబర్ 12వ తేదీన దసరా పండుగ ఉన్నది. సెప్టెంబర్ చివరి నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయితే దసరా నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరనున్నారు.

డిఎస్‌సికి 87.61 శాతం హాజరు నమోదు
డిఎస్‌సి పరీక్షలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 2,45,263(87.61 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,61,745 మందికి 1,37,872 (85.24 శాతం), సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జిటి) పోస్టులకు 88,005కి 81,053 (92.10 శాతం), లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు 18,211కు 16,092(88.36 శాతం), పిఇటి పోస్టులకు 11,996కు 10,246(85.41 శాతం) మంది హాజరయ్యారు. రాష్ట్రంలో తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) విధానంలో డిఎస్‌సి పరీక్ష నిర్వహించారు.

కొత్త టీచర్లు వచ్చే వరకు తాత్కాలికంగా సర్దుబాటు
ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయి కొత్త టీచర్లు విధుల్లో చేరేంతవరకు ప్రస్తుతం ఉన్న టీచర్లను పాఠశాల విద్యాశాఖ సర్దుబాటు చేసింది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల తర్వాత కొన్ని పాఠశాలల్లో టీచర్లు ఎక్కువగా ఉండగా, మరికొన్ని పాఠశాలల్లో తక్కువగా ఉన్నారు. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సమీప పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులను తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. కొత్త టీచర్లు వచ్చిన తర్వాత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించనున్నారు. కొత్త టీచర్లు విధుల్లో చేరిన తర్వాత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News