Wednesday, May 22, 2024

రింకును ఎంపిక చేయకపోవడం బాధగానే ఉంది: అగార్కర్

- Advertisement -
- Advertisement -

అన్ని ఆలోచించే జట్టును ఎంపిక చేశాం: చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్

ముంబై: పకడ్బంధీ ప్రణాళికతోనే టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియాను ఎంపిక చేశామని బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ స్పష్టం చేశారు. వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన జట్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చీఫ్ సెలెక్టర్ అగార్కర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి జట్టు ఎంపికపై వస్తున్న విమర్శలు, సందేహాలపై వివరణ ఇచ్చారు. ఐపిఎల్ కంటే ముందే వరల్డ్‌కప్ జట్టు ఎంపిక కోసం ప్రణాళికలు రచించామన్నారు. జట్టు ఎంపికలో ప్రతిభకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ప్రస్తుత జట్టులో టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉందన్నారు.

దీంతో మిడిల్ ఆర్డర్‌లో స్వేచ్ఛంగా ఆడే శివమ్ దూబెను తీసుకున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్‌లో శివమ్ దూబె అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఐపిఎల్ రికార్డు ఎంపికగానే దూబెకు టీమిండియాలో చోటు కల్పించామన్నారు. అయితే అతను తుది జట్టులో ఉంటాడా లేదా అనేది చెప్పలేమన్నారు. మరోవైపు హార్డిక్ పాండ్య ఎంపికపై వస్తున్న విమర్శల్లో అర్థం లేదన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో హార్దిక్ ఒకడనే విషయాన్ని గుర్తు చేశారు. హార్దిక్ ఫిట్‌గా ఉన్నంత కాలం జట్టులో ఉండాలని తాను భావిస్తున్నట్టు తెలిపారు. హార్దిక్ పాండ్యలో అపార ప్రతిభ దాగివుందన్నారు.

టీమిండియాలో అతను చాలా కీలకమైన ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రింకు సింగ్‌ను ఎంపిక చేయక పోవడం తనకు బాధకు గురి చేసిందన్నారు. రింకు సింగ్ ప్రతిభావంతుడైన క్రికెటర్ అని అయితే ప్రస్తుతం జట్టులో ఉన్న తీవ్ర పోటీ నేపథ్యంలో అతనికి టీమిండియాలో చోటు కల్పించడం కష్టంగా మారిందన్నారు. అయినా అతనికి ట్రావెలింగ్ సబ్స్‌లో చోటు కల్పించిన విషయాన్ని మరువ కూడదన్నారు. ఇక జడేజా, అక్షర్ మెరుగైన ఆల్‌రౌండర్లని వారిని మెగా టోర్నీలో చోటు కల్పించక తప్పలేదన్నారు. బంతితో బ్యాట్‌తో ఇద్దరు మెరుగ్గా రాణిస్తున్న విషయాన్ని అగార్కర్ గుర్తు చేశారు. కాగా, వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నమెంట్ కోసం జట్టు ఎంపిక కత్తిమీద సాములాంటిదన్నారు. ఇది కఠినమైన పక్రియ అన్నారు. ఇలాంటి పెద్ద టోర్నీల్లో జట్లను ఎంపిక చేసిన ప్రతిసారి విమర్శలు వెల్లువెత్తడం సహాజమని అగార్కర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News