Friday, January 27, 2023

సిఎస్‌కు సిఎం పిలుపు

- Advertisement -

 

Team of top officials went to Delhi on CM KCR call

హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన ఉన్నతాధికారుల బృందం

చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్,
వ్యవహారాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
అరవింద్ కుమార్, నీటి పారుదల శాఖ స్పెషల్
చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, డిజిపి మహేందర్
రెడ్డి హస్తినకు పయనం బకాయిల వసూలే
ప్రధాన అజెండా రాష్ట్ర పరిస్థితులు, శాంతి
భద్రతలపై సమీక్షించనున్న సిఎం కెసిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బృందం సోమవారం సాయంత్రం హుటాహుటిన న్యూఢిల్లీకి వెళ్లింది. న్యూఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర పరిపాలనాపరమైన అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించేందుకు న్యూఢిల్లీకి వారిని పిలిపించినట్లుగా అధికారవర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సుమారు రూ.34 వేల కోట్ల నిధులను రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేయాలనే సంకల్పంతో అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లినట్లుగా తెలిసింది. చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్‌తో పాటు మున్సిపల్ వ్యవహారాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, నీటి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్, డిజిపి మహేందర్‌రెడ్డి తదితరులు న్యూఢిల్లీకి వెళ్లిన బృందం లో ఉన్నారు. రాష్ట్రంలో అమలులో ఉన్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇతర అభివృద్ధి, పథకాలను మెచ్చుకొన్న నీతి ఆ యోగ్ కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫారసులను అమలు చేయాలని, 14వ, 15వ ఆర్థ్ధిక సంఘాలు చేసిన సిఫారసులను అమలు చేయాలని కోరనున్నారు.

అలాగే విభజన సమయంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.470 కోట్ల నిధులను కూడా విడుదల చేయాలని మరోసారి కేంద్రాన్ని కోరేందుకు చీఫ్ సెక్రటరీ బృందం నిశ్చయంతో ఉందని తెలిపారు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టంలో అకస్మాత్తుగా చేసిన మార్పుల మూలంగా తెలంగాణ రాష్టానికి రుణాల సమీకరణకు కూడా ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్న అంశాలను కూడా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లవచ్చునని తెలిపారు. దళితబంధుకు పథకానికి అవసరమైన నిధులను కూడా సమీకరించుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని, రాజీవ్ స్వగృహ పథకంలోని ఇళ్లను అమ్మకాలు పూర్తిచేయాలని ప్ర భుత్వం నిర్దేశించుకొన్న లక్షాలు, యాక్షన్‌ప్లాన్‌పై ఉన్నతాధికారుల తో ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్షించే అవకాశాలున్నాయని తెలిపా రు.

అంతేగాక రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న భారీ, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్రజల్‌శక్తి శాఖ నుంచి రావాల్సిన క్లియరెన్స్‌లను త్వరగా ఇవ్వాలని కోరతారని, క్లియరెన్స్‌ల జారీకి కేంద్రం జాప్యం చేయడం మూలంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుంటుబడ్డాయని, ఆయా ప్రాజెక్టుల్లో పనిచేసే కార్మికలోకానికి కూడా ఎన్నో ఇ బ్బందులు తలెత్తాయని కూడా కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్ళేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకొన్నారని తెలిపారు. రాష్ట్రంలో గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలుచేయడానికి మార్గదర్శకాలను జారీ చేసుకునే ప్రక్రియను కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసే అవకశాలున్నాయని తెలిపారు. ప్రస్తుతం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు కూ డా పూర్తయ్యాయని, అంతేగాక గ్రూప్-1 నోటిఫికేషన్ జారీచేసే నా టికి గిరిజన్లుకు 10 శాతం రిజర్వేషన్లనుప్రవేశపెట్టలేదని, అందుచే త ఈసారికి గూప్-1కు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేసే అవకాశాలు లేవని, అయినప్పటికీ ఈ గ్రూప్-1కు కూడా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలుచేయడానికి అనుకూలాంశాలు ఏమైనా ఉన్నాయా..? లేవా..? అనే అంశాలపై అధికారులు ముఖ్యమంత్రి కె.సి.ఆర్.కు సమగ్రంగా వివరణలు ఇచ్చుకునే అవకాశాలున్నాయని తెలిపారు.

అంతేగాక గిరిజన బంధ పథకాన్ని ప్రవేశపెట్టడానికి, ఆ పథకాన్ని అమలు చేయడానికి అనుసరించడానికి నియమ, నిబంధనలు, బడ్జెట్ (నిధులు) ఎంత అవసరమవుతుందనే అంశాలపైన ఉన్నతాధికారుల బృందం ముఖ్యమంత్రికి నివేదించే అవకాశాలున్నాయని తెలిపారు. దీనికితోడు రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులపైన కూడా సీఎం సమీక్షిస్తారని, ముఖ్యంగా మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా కొందరు అల్లర్లు సృష్టించే అవకాశాలున్నాయని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ఆ నిందను అధికారపార్టీపైకి నెట్టే ప్రయత్నాలు జరుగుతాయి గనుక అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలు ప్రశాతంతంగా జరగడానికి తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా సీఎం డి.జి.పి.తో సమీక్షించనున్నారని, అందుకు తగినట్లుగానే డి.జి.పి.మహేందర్‌రెడ్డి సమగ్ర సమాచారంతోనే సీఎంకు నివేదించేందుకు ప్రిపేర్ అయ్యి వెళ్ళారని కొందరు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles