Friday, September 13, 2024

25న సిబిఐ విచారణకు హాజరుకానున్న తేజస్వి యాదవ్

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ డిప్యూటీ సిఎం , ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ ఈనెల 25న సిబిఐ విచారణకు హాజరుకానున్నారు. ఈమేరకు ఢిల్లీ హైకోర్టు ఆయనను ఆదేశించింది. అయితే సిబిఐ ఆయనను అరెస్టు చేయబోదని భరోసా ఇచ్చింది. లాండ్ ఫర్ జాబ్ కేసులో విచారణ కోసం ఢిల్లీ లోని సిబిఐ కార్యాలయానికి హాజరు కావాలని సిబిఐ మూడుసార్లు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 28తోపాటు మార్చి 4.11న సమన్లు జారీ చేసినప్పటికీ, తేజస్వియాదవ్ సిబిఐ ఎదుట హాజరు కాలేదు.

దీంతో మంగళవారం మూడోసారి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర అధికారులపై ఆరోపణలు ఉన్న లాండ్ ఫర్ జాబ్ కేసులో తనకు సమన్లు ఇవ్వడంపై కోర్టులో సవాల్ చేశారు. తండ్రి లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు తానుమైనర్ నని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అలాగే విచారణ కోసం ఢిల్లీకి పిలువడం పైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, తేజస్వియాదవ్ పిటిషన్‌పనై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. బీహార్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, ఏప్రిల్ 5న అవి ముగుస్తాయని, ఆ తర్వాత యాదవ్ హాజరవుతారని యాదవ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తేజస్వియాదవ్ ఢిల్లీ నివాసంలో ఈడీ తనిఖీల సందర్భంగా గర్భవతి అయిన ఆయన భార్యను అధికారులు విచారణ పేరుతో పలు గంటల పాటు కూర్చోబెట్టారని, దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరినట్టు కోర్టుకు తెలిపారు.

ఈ నేపథ్యంలో తేజస్వియాదవ్ ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సిబిఐ విచారణలో పాల్గొంటారని , ఏప్రిల్ 5 తరువాత భౌతికంగా హాజరవుతారని వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో ఛార్జిషీట్ సిద్ధంగా ఉందని సీబిఐ తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు తెలియజేశారు. దీంతో తేజస్వియాదవ్ హాజరు కావల్సిందేనని , వారాంతరాల్లో రావచ్చని అన్నారు. అయితే తేజస్విని ఇప్పుడు అరెస్టు చేయబోమని సిబిఐ తరఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 25న సిబిఐ ఎదుట హాజరు కావాలని తేజస్వియాదవ్‌కు ఢిల్లీ హైకోర్టు తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News