మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు ఆమోదం
బిల్లులను ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
నాలుగు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ
మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు బిల్లుకు శాసనసభ ఆమోదం
మన తెలంగాణ / హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 42 శాతం రిజర్వేషన్లు కల్పించే కీలక సవరణ బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ ఆదివారం ఆమోదం తెలిపింది. తీవ్ర వాదోపవాదాల నడుమ తెలంగాణ మున్సిపాలిటీల (మూడవ సవరణ) బిల్లు-2025, తెలంగాణ పంచాయతీరాజ్ (మూడవ సవరణ) బిల్లు-2025లను సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ముందుగా మంత్రి సీతక్క పంచాయతీ రాజ్ లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. మంత్రి సీతక్క ముందుగా మున్సిపల్, తర్వాత పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. అనంతరం వాటి గురించి చర్చ జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క ప్రసంగిస్తూ ఆర్థిక అసమానతలు తొలగాలంటే ఉపాధి కూడా ఉండాలని పేర్కొన్నారు. చిత్తశుద్ధి ఉండటం వల్లే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బిల్లు తెచ్చామన్నారు. 2018లో పంచాయతీరాజ్ చట్టంలో 50 శాతం రిజర్వేషన్లపై సీలింగ్ పెట్టామని అన్నారు. ఏ రాష్ట్రంలో రిజర్వేషన్లపై సీలింగ్ విధిస్తూ చట్టాలు లేవని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న సీలింగ్ను సవరించేందుకు మళ్లీ బిల్లు ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన 50 శాతం సీలింగ్ను తొలగించే సవరణ కోసమే బిల్లు తీసుకువచ్చామన్నారు. ముందుగా తెలంగాణ పురపాలక చట్టం 2019 నిబంధన సవరణ బిల్లుపై చర్చ జరిగింది. చర్చ జరుగుతున్నందున ఆర్డినెన్స్ కుదరదని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. సెషన్స్లో ఉన్నప్పుడు బిల్లు రూపంలో తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సీపెక్స్ సర్వే చేపట్టిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల సిఫారసుకు చర్యలు చేపట్టామన్నారు.
నాలుగు బిల్లులకు శాసనసభలో ఆమోదం:
మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ బిల్లు, ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
బీసీ వర్గాలకు ఇది చారిత్రాత్మక విజయం: మంత్రి సీతక్క
తెలంగాణ అసెంబ్లీలో బిసీ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఎక్స్ వేదికగా ఆసక్తిరమైన ట్వీట్ చేశారు. అందులో మా నాయకుడు రాహుల్ గాంధీ సూచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి క్రియాశీల నాయకత్వంలో తాము తెలంగాణ శాసన సభలో తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు-2025 ను గర్వంగా ప్రవేశపెట్టామన్నారు. ఈ బిల్లు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బిసిలు) కు 42 శాతం రిజర్వేషన్లను నిర్ధారిస్తుంది. గతంలో బిసిలు కేవలం 23శాతం రిజర్వేషన్లకు పరిమితం చేయబడ్డారని, ఇది వారి జనాభా నిష్పత్తిని ప్రతిబింబించలేదన్నారు. మన ప్రజా ప్రభుత్వం బిసిల వెనుకబాటుతనాన్ని అంచనా వేయడానికి ఇంటింటికీ సమగ్ర కుటుంబ సర్వే, శాస్త్రీయ కుల గణనను నిర్వహించింది. అంకితమైన కమిషన్ సిఫార్సుల ఆధారంగా, బిసిలకు 42శాతం రిజర్వేషన్లు అందించడానికి మేము తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 285 ఎని సవరించామన్నారు. ఈ బిల్లు కేవలం రిజర్వేషన్ల గురించి మాత్రమే కాదని, ఇది బీసీలకు సాధికారత కల్పించడం, వారి గొంతుకను వినిపించడం, స్థానిక పాలనలో వారి సరైన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం వైపు ఒక విప్లవాత్మక అడుగు అన్నారు. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడం బీసీ వర్గాలకు ఇది చారిత్రాత్మక విజయమని మంత్రి సీతక్క తన ట్వీట్ లో రాసుకొచ్చారు.
పూర్తిస్థాయిలో గ్రూప్-1, 2, 3 నియామకాలు: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
గ్రూప్-1, 2, 3 నియామకాలు పూర్తిస్థాయిలో భర్తీ చేస్తున్నామని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. బిల్లులో ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడాలని, ఎక్కడా నిధుల పరంగా ఇబ్బంది లేకుండా చూస్తామని, కావాల్సినంత మేర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఆనాడు కలెక్టరేట్లు కట్టేసి వదిలేశారని, కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వలేదని అన్నారు. సిబ్బంది అవసరం ఉన్నచోట తప్పకుండా ఏర్పాటు చేస్తామని, ఎక్కడ అవసరం ఉన్నా పార్టీలకతీతంగా అందిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
నో ఎల్‌ఆర్‌ఎస్ నో కాంగ్రెస్ రాకుండా చూసుకోండి: హరీష్‌రావు
నో ఎల్‌ఆర్‌ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుందని సభలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పట్టణ ప్రగతి కింద నెలనెలా మున్సిపాలిటీలకు డబ్బులిచ్చేవాళ్లమని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పట్టణ ప్రగతి నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు ఆరోపించారు. ఆనాడేమో కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ అన్నారని, ఇప్పుడేమో డబ్బులు కట్టాల్సిందేనని ప్రజల వద్ద వసూలు చేస్తున్నారని విమర్శించారు. నో ఎల్‌ఆర్‌ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుందని, తమ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ జీవో తెచ్చామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు ఖర్చు పెడతామని చెప్పామని, ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ఎంత డబ్బు వచ్చిందో, మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంత ఇచ్చారో చెప్పాలని కోరారు. వచ్చిన డబ్బు ఎంత..పట్టణాభివృద్ధి సంస్థలకు ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలన్నారు. రాష్ట్రం ప్రభుత్వం నుంచి పైసా కూడా మున్సిపాలిటీలకు ఇవ్వట్లేదని, కనీసం ప్రజలు కట్టిన డబ్బును ఆయా మున్సిపాలిటీలకు ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలన్నారు. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం కాదని, ఉన్న వాటికి ఏం చేస్తున్నారో కూడా ఆలోచించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.
42 శాతం రిజర్వేషన్లు విప్లవాత్మకమైన ముందడుగు: కూనంనేని
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనేది విప్లవాత్మకమైన ముందడుగు అని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. 9వ షెడ్యూల్‌లో చేర్చకపోతే బిల్లు అవ్వదని అంటున్నారని, సంపూర్ణ మద్దతిస్తున్నామంటూనే 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు కలిసి పోరాటం చేస్తామని ఎందుకు చెప్పట్లేదని కూనంనేని పేర్కొన్నారు. జయలలిత పోరాటం చేయడం వల్లే రిజర్వేషన్లకు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అంగీకరించారని గుర్తు చేశారు.
ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేసేందుకు చర్యలు: మంత్రి దామోదర రాజనరసింహ
ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. ఆదివారం శాసనసభలో తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్య శ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు వైద్యం అందించడంలేదని ఆరోపించారు. ఫీల్డ్ విజిట్…ఫీవర్ విజిట్ చేసుఉ్నత్న ఆశా వర్కర్లకు జీతాలు పెంచడంలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కోరుట్లలో వంద పడకల ఆసుపత్రి ఉన్నా సిబ్బంది లేక ఖాళీగా ఉందని, జనగాంలో సిటి స్కాన్ మిషన్ వచ్చి 3 నెలలైనా ఇన్‌స్టాల్ చేయలేదని చెప్పారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ మాట్లాడుతూ రోగులు ఆరోగ్య పరిస్థితి విషమించిన సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చనిపోతే సకాలంలో వైద్యం అందించక చనిపోయారంటూ వైద్యులపై వారి బంధువుల దాడులు చేయకుండా ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
అలాగే కాగజ్ నగర్ సిహెచ్‌సిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 6 నుంచి 8 నెలలుగా జీతాలు ఇవ్వక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని జీతాలు ఇచ్చేలా చూడాలని కోరారు. దీనిపై మంత్రి దామోదర రాజనరసింహ సమాధానమిస్తూ మానవ వనరులను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, 6 నుంచి 7 విడతలుగా పెండింగ్ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాధానమిచ్చారు. ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వారికి హామీ ఇచ్చారు.