Friday, March 29, 2024

ఉద్యమానికి ఊతమిచ్చిన బతుకమ్మ

- Advertisement -
- Advertisement -

telangana bathukamma celebrations

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను చూసి తట్టుకోలేక కెసిఆర్ తన పదవులను త్యజించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటానికి నడుం బిగించారు. 15 సంవత్సరాల పాటు శాంతియుతంగా గాంధేయ మార్గంలో జరిపిన సుదీర్ఘ పోరాటంలో తన ప్రాణాలను పణంగా పెట్టి, ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ ఉద్యమం ఊపందుకోడానికి తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవం తోడ్పడింది. యాభై ఏళ్ల పైబడి నివురు గప్పిన నిప్పులా స్తబ్దంగా ఉండిపోయిన తెలంగాణ సంస్కృతి కెసిఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో తిరిగి జీవం పోసుకున్నది. రెక్కలు విప్పి ఉవ్వెత్తున లేచి ప్రజలను చైతన్య పరిచింది. ఈ రకంగా తెలంగాణ జన చైతన్యానికి తెలంగాణ జానపద కళా సాహిత్యాలు తోడ్పడ్డాయి. తెలంగాణలో లేని జానపద ప్రక్రియ అంటూ లేదు. స్త్రీల పాటలు, కోలాటాలు, పేదరాశి కథలు. జానపద గేయాల, శ్రామిక గేయాలు, తోలు బొమ్మలాటలు (వీధి నాటకాలు), మార్మికతతో కూడుకున్న తాత్విక గేయాలు, పొడుపు కథలు, సామెతలు, పిల్లల పాటలు జాజిరి పాటలు, ఉయ్యాల పాటలు, శృంగార గేయాలు, వీర గాథలు ఇలాంటి గేయ సాహిత్యంతో పాటు, జానపద నృత్యలు తెలంగాణ గ్రామీణ వాతావరణంలో తరతరాలుగా మనుగడ సాగిస్తున్నారు. అలాగే, గిరిజన నృత్యాలైన గోండుల సృత్యాలు, కోయ నృత్యాలు, లంబాడి సృత్యాలు కూడా తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం.

నిరుపమానమైన, ఉత్కృష్టమైన తెలంగాణ సంస్కృతిలో ప్రధానమైనది. ‘బతుకమ్మ పండుగ’. రాజకీయ కారణాల వల్ల కొన్ని దశాబ్దాలుగా మరుగునపడిపోయిన ఈ వేడుకకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తిరిగి జీవం పోశారు. ‘తెలంగాణ జాగృతి’ పేరుతో ఒక సాంస్కృతిక సంస్థను స్థాపించి, ఊరూ, వాడా, పల్లె, పట్టణం అనే తేడాలు లేకుండా ఒక్క తెలంగాణలోనే కాకుండా, యావద్భారత దేశంలోనూ, విదేశాల్లోనూ తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడైతే వున్నారో అక్కడికల్లా వెళ్ళి బతుకమ్మ పండుగను ప్రచారం చేసి, ఆడించారు.

ఎక్కడో పల్లెటూళ్ళలో గ్రామీణ మహిళలు చేసుకునే బతుకమ్మ వేడుకను తెలంగాణ అంతటా వ్యాపింపజేశారు కవిత. పెద్ద, చిన్న, అధికారులు, నాయకులు, శ్రామికులు అన్న తేడా లేకుండా అందరూ చేయిచేయి పట్టుకుని బతుకమ్మ ఆడే స్ఫూర్తిని రగిలించారు ఆమె. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఆఖరికి సచివాలయం, శాసనసభ వంటి ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, మంత్రులు, ఐఎఎస్ అధికారులు, స్వీపర్లు అన్న భేదభావం మరచి అందరూ చేయిచేయి పట్టుకుని బతుకమ్మ ఆడే వాతావరణం మూలం గా తెలంగాణలో ఏర్పడింది. ఈ బతుకమ్మ వేడుక తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి, హోరువానకు సుడిగాలి తోడైనట్లుగా మహోధృతంగా తెలంగాణ ఉద్యమం ముందుకు సాగడానికి తోడ్పడింది.

బతుకమ్మ తెలంగాణ జీవన స్రవంతిలో ఒక భాగం. ఆశ్వీయుజ మాసంలో వచ్చే శరన్నవ రాత్రులు ఆది పరాశక్తిని అర్చించే పవిత్ర దినాలు. అమ్మవారు ఈ విశ్వంలోని చరాచర ప్రకృతి అంతా నిండియున్నదని చెప్పే పండుగ శరన్నవరాత్రులు. అమ్మవారినే ప్రకృతిగానూ, ప్రకృతినే అమ్మ వారి గానూ భావించి పరమ పవిత్రంగా పూజించడం బతుకమ్మ పండుగ ప్రత్యేకత. దసరా నవరాత్రులతో సద్దుల బతుకమ్మగా ప్రారంభమై తొమ్మిది రోజులు జరుగుతుంది. మహాలయ అమావాస్య నుంచి మహార్నవమి వరకు సాగే ఈ ఉత్సవంలో బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు తెలంగాణలో గడపగడపనా కనువిందు చేస్తుంది. మన సాంస్కృతిక సౌరభాలను వెదజల్లుతుంది. తొమ్మిది పూర్ణత్వానికి ప్రతీక. నవవిధులకు, నవావరణాలకు బతుకమ్మను తొమ్మిది రకాల పూలతో అలంకరిస్తారు. తంగేడు, గునుగు, కట్ల, రుద్రాక్ష, సీతమ్మ జడ, గోరింట, గుమ్మడి, బంతి, మందార, గన్నేరు, బీర, నిత్యమల్లె పుష్పాలను ఒక క్రమ పద్ధతిలో గోపురంలా అమరుస్తారు. మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఈమె ఈ తొమ్మిది రోజులు పుట్టింటికి వచ్చినట్లు భావించి
బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో |
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
తంగేడు పువ్వై తరలి రావే తల్లి..
అంటూ ముత్తెదువులు పాడుతూ తమ మమకారాన్ని చాటుకుంటారు. ఒక్కో రోజు ఒక్కో రూపంతో బతుకమ్మను పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల కోతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాల్గవ రాజు నానే బియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు సఖినాల బతుకమ్మ లేదా వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా గౌరీ దేవి అమ్మవారు పూజలందుకుంటుంది.

బతుకమ్మ వేడుకల చివరి రోజు సాయంత్రం ముత్తైదువులందరూ కొత్త బట్టలు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిట్లో పెడతారు. ఇరుగు పొరుగు ఇళ్ళవారు కూడా తమ బతుకమ్మలను ఇదే విధంగా తెచ్చి పెడతారు. అందరూ కలిసి వలయాకారంలో మానవహారంగా ఈ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. చీకటి పడే వేళకు ఆడపడుచులందరూ తమ తమ బతుకమ్మలను తలల పై పెట్టుకుని, తమకు దగ్గరలో వున్న చెరువుకు కానీ పెద్ద బావికి గానీ ఊరేగింపుగా వెళ్లి పాటలు పాడుతూ బతుకమ్మలను నీట జారవిడుస్తారు. ఆ తర్వాత పంచదార, రొట్టెతో చేసిన ‘మలీద’ అనే వంటకాన్ని బంధువులకు పంచిపెడతారు. బతుకమ్మ పండుగ సందర్భంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ. చీరలు ఉచితంగా పంపిణీ చేస్తున్నది. ఇటువంటి కార్యక్రమం ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేపట్టలేదు. చేపట్టి విజయవంతంగా నిర్వహించనూలేదు. సంవత్సరం ఈ కోట మంది ఆడపడుచులకు సుమారు రూ. 340.00 కోట్ల ఖర్చుతో బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతున్నది.

మనిషికి ‘ప్రకృతికి సంబంధించిన ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ఒక విశిష్ట స్థానాన్ని సముపార్జించి పెట్టింది. మనిషి జీవితానికి ప్రకృతితో విడదీయరాని అనుబంధం వుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. కానీ ఈ విషయాన్ని మర్చిపోయిన ఆధునిక మానవుడు యాంత్రికంగా మారి, అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసానికి పాలుపడుతున్నాడు. విచక్షణా రహితంగా చెట్లను నరికివేస్తున్నాడు. దీని వల్ల భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు కూడా లభించని దుస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాన్ని ఎంతో దూరదృష్టితో గ్రహించిన ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ తల్లిని పచ్చని వస్త్రంతో అలంకరించడానికి ‘హరిత హారం కార్యక్రమాన్ని మరొక మహోద్యమంగా ముందుకు తీసుకు వచ్చారు. గత ఎనిమిదేళ్ళుగా ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం హరిత శోభను సంతరించుకుని కళకళలాడుతున్నది. తెలంగాణ పట్ల ఇంతటి నిబద్ధత గల ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇది తెలంగాణ ప్రజలుగా మనమంతా గర్వించదగ్గ పరిణామం.

కోలేటి దామోదర్- (చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణసంస్థ లిమిటెడ్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News