Monday, September 1, 2025

తెలంగాణ బిడ్డను చేతులతో ఎత్తి పట్టుకుని ప్రళయాలను దాటాలె

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అస్తిత్వ సృజన రంగం: ఈ అంశంపై సృజన రంగానికి సంబంధించిన, కొందరు ప్రముఖ రచయితల, మేధావుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం మేము మొదలు పెట్టాం. అందులో భాగంగా ఈసారి ప్రముఖ కవి, సాహితీవేత్త, తెలంగాణా చరిత్ర, సాహిత్య పరిశోధకులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అభిప్రాయాలు ఈ వారం మెహఫిల్‌లో

తెలంగాణ అస్తిత్వం అన్న మాటకి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి?
‘తెలంగాణ అస్తిత్వం’ అన్నమాట, ‘తెలంగాణ పరిరక్షణ వేదిక’ ఏర్పడిన సందర్భంలో, రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల తర్వాత మళ్లీ చర్చలోకి వచ్చింది. బహుశా ఈ నేపథ్యంలో మీరు ఈ ప్రశ్న వేసినరనుకుంట. అప్పటికీ, ఇప్పటికీ ఒకటే నిర్వచనం. తెలంగాణ భౌగోళిక పటం, చారిత్రక పటం, సాంస్కృతిక పటం, భాషాపటం, సాహిత్య పటం, రాజకీయ పటం, ఆర్థిక పటం- తెలంగాణ భౌగోళిక పటంగా మాత్రమే స్వతంత్రతను, విముక్తిని పొందింది. మిగతా అన్ని రంగాల్లో ఆంధ్ర ఆధిపత్యం అంతం కాలేదు, కాకపోగా ఉత్తర భారత ఆధిప త్యం మొదలైంది. ఈ హెజిమోనీల నుంచి అన్ని పటాలను కాపాడుకోవాలనే ప్రకటనే ‘తెలంగాణ అస్తిత్వం’ సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల్లో ఆ అస్తిత్వ, ప్రతిఫలం, ప్రయోజనం, విసృతి ఎలా ఉంది? ఎలా ఉండాలి అని మీరు అనుకుంటారు? గత తెలంగాణ అస్తిత్వాన్ని, స్వాతంత్య్ర పూర్వ భారతదేశ అస్తిత్వంతో పోల్చదలుచుకున్న.

ఆంగ్లేయులు తమ ఆధిపత్య స్థిరీకరణ కోసం భారతదేశ అస్తిత్వాన్ని అన్ని రకాలుగా మసక బార్చే ప్రయత్నం చేసినరు. జాతీయోద్యమం ఆ ప్రయత్నాన్ని వమ్ము చేసింది. దేశ అస్తిత్వ పతాకాన్ని ఎగరేయడం కోసం సృజన ప్రక్రియల ద్వారా (కవిత్వం, కథలు, నవలలు), తాత్విక సామాజిక రాజకీయ వ్యక్తీకరణల ద్వారా ఆ మహత్తర కార్యాన్ని సాధించింది. అట్లాగే తెలంగాణ అస్తిత్వాన్ని మరుగుపరిచే పనిని, క్రమంగా అంతర్ధానం చేసే పనిని అంతర్గత వలస విధానం చేసింది. ఈ ‘Back Drop’లో మీ ఈ ప్రశ్నను చూడాలె. స్వాతంత్య్రం అనంతర కాలంలో దేశంలో ఏం జరిగింది అనేదానికి ఈ ప్రశ్నను అనుసంధానిస్తే తెలంగాణలోనూ అదే జరిగింది. ఆ నెపంతో భారతదేశ స్వాతంత్య్రాన్ని ఎలా నిరాకరించలేమో, తెలంగాణ స్వాతంత్యాన్ని అలా నిరాకరించలేము.

జాతీయోద్యమ సంరంభం సాహిత్య సాంస్కృతిక కళా రంగాల్లో సృష్టించిన సమ్మోహం, అనంతర కాలంలో ఎలా ప్రతిఫలించిందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా అలాగే ప్రతిఫలించింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం సృజన రం గంలో తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకి, విస్త రణకి చోటు దొరికిందా? ఎలాంటి నూతన మార్పులు జరిగాయి అనుకుంటున్నారు? నేను మళ్లీ భారతదేశ స్వతంత్యాన్ని పోలికగా తెస్త. రెండూ విముక్తి ఉద్యమాలే. ఒకటి బ్రిటిష్ వలస నుంచి విముక్తి, రెండు అంతర్గత వలస నుంచి విముక్తి. ప్రపంచ చిత్రపటంలో భారతదేశం ఏ మేరకు విముక్తి అయిందో, తెలంగా ణ కూడా ఆ మేరకు విముక్తి అయింది. స్వా తంత్య్ర కాలం నుంచి ఇప్పటిదాకా అనేక సం కెలలు మిగిలే ఉన్నవి.

తెలంగాణ విషయంలో కూడా అంతే. ఆ మిగిలి ఉన్న సంకెలలను గు రించే మళ్లీ ప్రస్తుత అస్తిత్వ పరిరక్షణ ఉద్య మం. స్వాతంతోద్యమ కాలం సృజన రంగం గొప్ప విముక్తి కాంక్షతో సంరంభంగా నడిచింది. దేశం పతాకాన్ని ఎగరేసింది. కవిత్వం నవలలు కథలు నాటికలు ఆ పతాకను పట్టుకొని నడిచినవి. స్వాతంత్య్ర అనంతరం ఆ బాధ్యతను ప్రభుత్వాల మీద పెట్టి నిష్క్రమించినవి. తెలంగాణలో కూడా అంతే. అట్లా అని సృజన రంగం మొద్దు బారిందని (మొద్దు బారిందని కొందరు తృప్తిపడతరు) కాదు. తెలంగాణ భాష పట్ల పాజిటివ్ చూపు ఉద్యమ కాలంలో మొదలై, రాష్ట్ర ఏర్పాటు తర్వాత క్రమ క్రమంగా తగ్గింది. అందుకు ఆంధ్ర సినిమా రంగం ఒక ఉదాహరణ. అదే సమయంలో తెలంగాణ నుంచి వచ్చిన సినిమాలు తెలంగాణ భాషని కేంద్రంగా చేసుకున్నవి. కవిత్వంలో కూడా తెలంగాణ భాషా అస్తిత్వ పతాకాన్ని ఎగరేసిండ్రు కొందరు.

కానీ ఎక్కువ మంది ఆంధ్ర మీడియా ప్రభావం వల్ల తెలంగాణ ఉద్యమ పూర్వ స్థితికి వెళ్ళిం డ్రు. కథా రంగంలో అంతే. నాటకం గురించి నాకు అంతగా తెలియదు. భువన విజయానికి ప్రతిగా కేవలం తెలంగాణ కవులతో కూడుకొని ఉన్న తెలంగాణ భువన విజయం వచ్చిందని తెలుసు. తెలంగాణ చారిత్రక ఐకాన్సుని తీసుకుని నవలలు వచ్చినవి. ఆశించిన స్థాయి లో ఫలితాలు రాలేదని దీన్ని విఫల ఉద్యమంగా చూడలేం. సిద్ధించని ఫలితాల కోసమే తెలంగాణ పరిరక్షణ ఉద్యమం.
మరీ ముఖ్యంగా గ్లోబలీకరణ అనంతర పరి స్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా సృజన రంగం లో, ఎంతో వేగవంతంగా, వివిధ రకాల సం స్కృతుల కలగలుపు జరుగుతున్న స్థితి ఉంది.

తెలంగాణా స్వీయ అస్తిత్వేతర సంస్కృతు లు, సాహిత్య, కళారంగాల నుండి మంచిని తెలుసుకోవడం, నేర్చుకోవడం, తమ సృజనా త్మక రంగాల్లో సమ్మిళితం చేసుకోవడం అవసరమని అను కుంటున్నారా? ఈ ప్రశ్నలో రెండు భాగాలు ఉన్నవి. ఒకటి, గ్లోబలీకరణ అనంతర పరిస్థితుల్లో వివిధ రకా ల సంస్కృతుల కలగలుపు జరుగుతున్నదనేది అర్థ సత్యం మాత్రమే. గ్లోబలీకరణను ముందు కు తెచ్చిన అమెరికా, యూరప్ ఖండ దేశాలు కొన్ని తమ దేశాలకు నష్టం జరుగుతున్నదని తమ దేశాల ప్రయోజనాలే ఫస్ట్ అని, అనేక ఆంక్షలు విధించడం ద్వారా తమ దేశ అస్తిత్వ ప్రకటన చేస్తున్నవి.

ఈ బ్యాక్ డ్రాప్‌లో తెలంగాణ అస్తిత్వ ప్రకటన అసమంజసం కాబోదు. రెండు, ఇది తెలంగాణకు మాత్రమే వర్తించే ప్రశ్న కాదు. ఏ దేశానికైనా, ఏ ప్రాదేశికతకై నా, ఏ భాషా సమూహానికైనా, ఏ మత సమూహానికైనా వర్తించే ప్రశ్న. ఇతర (other)లోని మంచిని తెలుసుకోవడం, నేర్చుకోవడం, అడా ప్ట్ చేసుకోవడం మంచిదే, కానీ అది రెండు సమూహాల మధ్య రెసిప్రోకల్‌గా ఉండాలె. సం స్కృతుల సమ్మేళనంలో ఒకటే దీన్ని నిర్దేశించకూడదు. సహజంగా జరగాలె. అట్లా జరుగుతున్నదా? దేశాల మధ్య కానీ, ప్రాదేశికతల మధ్య గానీ. అదే అసలైన ప్రజాస్వామిక ప్రక్రియ.

తెలంగాణా అస్తిత్వం, సంస్కృతి పరిరక్షణ కోసం నిర్దిష్టంగా మీరు చేసే సూచనలు ఏమిటి?
అనేక ప్రళయాలు ముంచెత్తుతుంటయ్, తెలంగా ణ బిడ్డను చేతుల తో ఎత్తి పట్టుకుని దాటాలే. నిర్దిష్టంగా, గతంలోనే అనేక వ్యాసాల్లో పలు సూచనలు చేసిన. మళ్లీ చెప్త.
1.ఇన్నాళ్లుగా చరిత్ర, సాహిత్య చరిత్ర కోస్తాం ధ్ర దృక్కోణమ్ నుండే రాయడమయింది. ఇప్పుడు తెలంగాణ ప్రాంత దృక్కోణం నుండి రాయాలె.
2.ఈ చరిత్ర రచనకు తెలుగు అకాడమీ లాంటి ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాలే.
3.తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో 90 శాతం పరిశోధనలు తెలంగాణ సంబంధిత అంశాల మీద జరిగే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలె.
4.కుల పురాణాలు, శైవమత ప్రభావం వలన తెలంగాణ నుండే ఎక్కువగా వచ్చినవి, వాటికి అష్టాదశ పురాణాల హోదా కల్పిస్తూ సాహిత్య చరిత్రను నిర్మించాలె.
5.మిగతా తెలుగు ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణలో ముస్లింలు ఎక్కువ. వాళ్లు పరాయి వా ళ్ళు అనే భావన పోవాలి. పోకపోతే, ఆ లెక్కన ఆర్యులు, వైదికి, నియోగి బ్రాహ్మణులు పరా యి వాళ్లే, ఇంకా ఈ లెక్కన దేశంలోని అనేక జాతుల వారు ఈ గడ్డకు పరాయి వాళ్లే.
6.బతుకమ్మ పండుగకు, సమ్మక్క, సారక్క ఆరాధనకు గల చారిత్రక మూలాలు తెలియ రాలేదు. ఆ మూలాలను వెలికి తీయాలె.
7.తెలంగాణలో ఎంతోమంది వైతాళికులు ఉన్నరు. కోస్తాంధ్ర దృక్కోణం వల్ల వారు మసకబారినరు. వారందరి చరిత్రను వెలికి తీసి, తెలంగాణతో సంబంధం లేని పేర్లను తొలగించి, వీరి పేర్లను ఆయా సంస్థలకు పెట్టాలె.
8.మన్నెంకొండ హనుమద్దాసు, రాకమచర్ల వెంకటదాసు, వేపూరి హనుమద్దాసు, ముష్టిపల్లి వెంకట భూపాలుడు లాంటి వాళ్ళు వేలాది కీర్తనలు రచించిండ్రు. వారికీ అన్నమయ్య హోదా కల్పించాలె.
9.తెలంగాణ రాజకీయ రంగాన్ని దాని మానాన దాన్ని పోనివ్వాలె. బయటివారు వేలుపెట్టకూడదు.
10.విద్య, సినిమా, వ్యాపార, మీడియా, నిర్మాణ రంగం ఇంకా ఆంధ్రా ఆధిపత్యంలోనే ఉన్నవి. దీన్ని అరికట్టి తెలంగాణ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు కల్పించాలే. ఇంకా చాలా అంశాలకు సంబంధించిన సూచనలున్నవి. మరో సందర్భంలో వాటి గురించి చెప్త.

Also Read : దురాశ, దుర్బుద్ధితోనే రీడిజైన్

  • సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News