* ప్రమోషన్ గరిష్ట వయసు 45 నుంచి 50 ఏళ్లకు పెంపు
* సంబంధిత ఫైలుపై సంతకం చేసిన మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
* అంగన్‌వాడీల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ
* అంగన్‌వాడీల సేవల్లో స్వయం సహాయక సంఘాలకు భాగస్వామ్యం
* ముందుకు వచ్చే స్వచ్ఛంద సంస్థలకు అవకాశం
* త్వరలో సరికొత్త బాలామృతం
* మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో సీతక్క
మన తెలంగాణ / హైదరాబాద్ : అంగన్‌వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. అంగన్‌వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితి నీ 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సంబంధిత ఫైలుపై గురువారం సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 4,322 మంది అంగన్వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం ఏర్పడనుంది. గతంలో 45 ఏళ్లు దాటిన తర్వాత ప్రమోషన్ కోసం అవకాశాలు లేకపోయినా, ఇప్పుడు వారికీ మళ్ళీ అవకాశం లభించనుంది. గరిష్ట వయో పరిమితిని పెంచాలని అంగన్వాడి హెల్పర్ యూనియన్ల విజ్ఞప్తి మేరకు సాధ్యసాధ్యాలను
పరిశీలించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అర్హతలు ఉన్న 50 ఏళ్ల లోపు హెల్పర్లకు టీచర్ పదోన్నతి ఇవ్వడంలో ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు నివేదిక సమర్పించారు. ఇటీవలే అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో 50 ఏళ్ల వయసులో టీచర్ గా పదోన్నతి పొందే హెల్పర్లు ఇంకా 15 ఏళ్లు విధులు నిర్వర్తించవచ్చని సూచించారు. 45 సంవత్సరాల వయస్సు దాటిన అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఫైలుపై మంత్రి సీతక్క సంతకం చేశారు. దీంతో త్వరలో అధికారిక ఉత్తర్వులు వెల్లడి కానున్నాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది అంగన్‌వాడీ హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కేవలం వయస్సు కారణంగా తాము టీచర్లుగా ప్రమోషన్ కోల్పోతున్నామని బాధపడిన తమకు సీతక్క న్యాయం చేశారని తెలిపారు.
అంగన్‌వాడీల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అంగన్‌వాడీల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. చిన్నారుల్లో పోషకాహారాన్ని మెరుగపరిచేందుకు మహిళా స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. గురువారం మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం, పోషకాహార మిషన్, ఉద్యోగ ఖాళీల భర్తీ, కారుణ్య నియామకాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సిఈఓ దివ్యా దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ సృజన, తెలంగాణ ఫుడ్స్ ఎండి కె. చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు ఆర్టీసీ ద్వారా కోటి ఆదాయం : ఆర్టీసీ అద్దె బస్సుల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు రూ.కోటి ఆర్జించాయి. ఇప్పటి వరకు 150 బస్సులను ఆర్టీసీకి మహిళా సంఘాలు అద్దె ప్రాతిపదికన అప్పగించాయి. ఒక్కో బస్సుకు ఆర్టీసీ నెలకు రూ.70 వేలు చెల్లిస్తోంది. నెలకు మహిళా సంఘాలు కోటి అందుకోనున్నాయి. దీనికి సంబంధించి మొదటి నెల పేమెంట్‌ను ఆర్టీసీ మహిళా సంఘాలకు చెల్లించింది. దీనికి సంబంధించిన చెక్కును ఆర్టీసీ యాజమాన్యం నుంచి సెర్స్ సిఈఓ దివ్యా దేవరాజన్ అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కతో భేటీ అయిన దివ్యా దేవరాజన్ సెర్ప్ సిబ్బంది మంత్రి సీతక్కకు మిఠాయిలు తినిపించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఆర్టీసీలో మహిళా సంఘాలకు అద్దె బస్సులకు అవకాశం కల్పించి నెలకు కోటి ఆదాయాన్ని ఆర్జించేలా సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీతక్క ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. ప్రజాభవన్‌లో ఈనెల 5న ప్రజాభవన్‌లో జరిగే ఆర్టీసీ బస్సు ఓనర్లుగా ఉన్న మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు.