Saturday, April 27, 2024

11,062 మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ జారీ అయింది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. గురువారం ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, సిఎం ఒఎస్‌డి మాణిక్‌రాజ్, విద్యాశాఖ ముఖ్యదర్శి బుర్రా వెంకటేశ్వరం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తదితరుల పాల్గొన్నారు. 5,089 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరులో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన విద్యాశాఖ, తాజాగా అదనపు పోస్టులను జత చేస్తూ 11,062 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2023 జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి 46 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, ఎస్‌సి,ఎస్‌టి,బిసి, ఇడబ్లూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంది. మెగా డిఎస్‌సి పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

4 నుంచి దరఖాస్తులు
డిఎస్‌సికి మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో విద్యాశాఖ పేర్కొంది. దరఖాస్తు రుసుము రూ.1000లుగా నిర్ణయించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.
స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629
మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 ఉండగా, 727 భాషా పండితులు, 182 పిఇటి, 6,508 ఎస్‌జిటి, ప్రత్యేక కేటగిరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, ప్రత్యేక కేటగిరి ఎస్‌జిటి 796 పోస్టులను భర్తీ చేయనుంది. జిల్లాల వారీగా పోస్టులను పరిశీలిస్తే.. రాష్ట్రంలో అత్యధిక పోస్టులు హైదరాబాద్‌లో 878 ఉండగా, ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం జిల్లాలో 757, సంగారెడ్డి జిల్లాలో 551, కామారెడ్డిలో 506 చొప్పులు ఖాళీలు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 176 ఉండగా, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 26 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్‌జిటి పోస్టులు అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 537 పోస్టులు ఉండగా, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 21 ఉన్నాయి.

ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్‌సి నోటిఫికేషన్
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్‌సి నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుగునంగా వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండేలా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలనే సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ గత మూడు వారాలుగా కసరత్తు చేసి నోటిఫికేషన్‌ను సిద్ధం చేసింది. 5,089 పోస్టుల భర్తీకి గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్‌కు 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో డిఎస్‌సి పరీక్షలు జరగలేదు. ప్రభుత్వం మారినందున మరిన్ని పోస్టులను కలిపి పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తది విడుదల చేసింది. నాటి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్ తయారు చేశారు. పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రశ్నపత్రాలు మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News