Saturday, April 27, 2024

ఆనాడు మన యాస, భాషలపై చిన్నచూపు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హరీష్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయం మనందరికీ తెలిసిందేనని చెప్పారు. ఆనాటి వీరయోధులైన కొమరం భీమ్, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, స్వామి రామానంద తీర్థ. సర్దార్ జమలాపురం కేశరావు, వట్టికోట ఆళ్వార్ స్వామి, చాకలి ఐలమ్మ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బద్దం ఎల్లారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండి యాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు ఇంకా ఎందరో మహానుభావులు వారందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.

భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1956 వరకు సొంత రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రం కొనసాగిందని, మిగులు నిధులు గల హైదరాబాద్ రాష్ట్రం ఆనాడే అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని ముందుకు సాగిందని,  1956లో రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణ – ఆంధ్రలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, కానీ ఆంధ్ర వారి దోపిడీ విధానాలు, తెలంగాణ యాస, భాషలను చిన్న చూపు చూడడంతో ఆంధ్రప్రదేశ్ ఇరుప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదని వివరించారు. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడిందని, సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను పట్టించుకోకుండా గాలి కొదిలేసిందని, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్నిరంగాల్లో దారుణమైన వివక్ష అమలైందని, ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చిందని స్పష్టం చేశారు.

2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వయంగా సారథ్యం వహించి, ఉద్యమశంఖం పూరించి తెలంగాణ ప్రజలందరినీ ఒక్కటిచేసి, పధ్నాలుగేళ్లు అవిశ్రాంత పోరాటాన్ని నడిపించి లక్ష్య సాధన కోసం మరణం అంచులదాకా వెల్లడం వలన తెలంగాణ ఉద్యమం అంతకంతకూ తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం దిగివచ్చిందని, దాంతో 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందన్నారు. స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతగానో మారిపోయింది. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో శాంతికి నెలవుగా అలరారుతు సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తున్నది.

సిద్దిపేట జిల్లా చరిత్రలోనూ సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతోపాటు ప్రగతిశీల విజయ వీచికలను సాకారం చేసుకున్నామని చెప్పడం గర్వంగా ఉంది. ఒకప్పుడు ఎన్నికల హామీలుగా, సిద్దిపేట భవిష్యత్తుకు ట్యాగ్‌ లైన్లుగా ఉన్న జిల్లా కేంద్రం ఏర్పాటు, గోదావరి జలాలు, రైలు సౌకర్యాలను నేడు హెడ్‌ లైన్లుగా మార్చుకోవడం జరిగింది. ఏడు దశాబ్దాలుగా ఊరిస్తూ వచ్చిన చిరకాల వాంఛలను తొమ్మిదేళ్ల ప్రాయంలోనే గమ్యం చేర్చుకున్నామంటే తెలంగాణ స్వరాష్ట్రం సిద్దించడం, ముఖ్యమంత్రిగా ఈ ప్రాంత బిడ్డ కేసీఆర్‌ గారు ఉన్నందువల్లేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని హరీష్ రావు వివరించారు.

స్వరాష్ట్రం సాకారమైతే ఏమొస్తుందన్న విమర్శలకు నేటి అభివృద్ధి చిహ్నాలే సమాధానం చెబుతున్నాయి. తెలంగాణ వస్తేనే సిద్దిపేట జిల్లా ఏర్పాటైందని, తెలంగాణ వస్తేనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయని, తెలంగాణ వస్తేనే గజ్వేల్‌, కొమురవెల్లి, సిద్దిపేటకు రైలు సౌకర్యం వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రజా ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా ఈ ప్రభుత్వం చేపడుతున్న అన్ని పనులు కూడా చారిత్రాత్మకమైన కీర్తిప్రతిష్టలు పొందుతున్నాయి. మన గజ్వేల్‌, మన సిద్దిపేట, మన దుబ్బాక, మన హుస్నాబాద్‌, మన చేర్యాల ప్రాంతాలు తొమ్మిదేళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ స్వరాష్ట్రం, సిద్దిపేట జిల్లా సాకారంతో నలుదిశలా అభివృద్ధి వెలుగులు విరాజిల్లుతున్నాయి. కండ్ల ముందు, ఇండ్ల ముందు మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఆదర్శనీయ అడుగుజాడలతో జిల్లా ముఖచిత్రమే మారిపోయిందనే విషయాన్ని క్షుణ్ణంగా గ్రహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నాటి నినాదాలనే నిజాలుగా చేసుకున్నామని ఈ ప్రతిష్టాత్మకమైన సందర్భంలో మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉందని హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు.

అభివృద్ధి అంటే మూడు మురికి కాలువలు, ఆరు సీసీ రోడ్లను నిర్మించడం కాదని.. అభివృద్ధి అంటే జిల్లా ప్రజల జీవన ప్రమాణాలను మార్చడమని గడిచిన తొమ్మిది సంవత్సరాలలో నిరూపించడం జరిగింది. గత ప్రభుత్వాల పాలసీలను పక్కనబెట్టి ప్రజాసంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ పాలసీగా, సిద్దిపేట జిల్లా సర్వతోముఖాభివృద్దే ఎజెండాగా ముందుకెళ్లడం వల్లే విస్తృతమైన ప్రగతి సాధ్యమైంది. సాగునీటి రిజర్వాయర్లతో జిల్లాను వాటర్‌ హబ్‌గా మార్చుకున్నాము. హార్టికల్చర్‌ యూనివర్సిటీ, ఫారెస్టు యూనివర్సిటీ, మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ, వెటర్నరీ కాలేజీ, ఫార్మసీ కాలేజీ, పాలిటెక్నికల్‌ కాలేజీలు, గురుకులాల ఏర్పాటుతో జిల్లాను ఎడ్యుకేషనల్‌ హబ్‌గా తీర్చిదిద్దుకోవడం జరిగింది. సిద్దిపేటలో వెయ్యి పడకల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, గజ్వేల్‌లో జిల్లా ఆసుపత్రి, దుబ్బాకలో వంద పడకల ఆసుపత్రి, హుస్నాబాద్‌, చేర్యాల పట్టణాల్లో ప్రాంతీయ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు, మహిళా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసుకొని జిల్లాను మెడికల్‌ హబ్‌గా అగ్రస్థానంలో నిలబెట్టుకున్నాము.

బీడు బారిన భూములను సిరుల మాగాణుల్లా మార్చడమే గాకుండా దేశానికి అన్నం పెట్టే స్థాయిలో సిద్దిపేట జిల్లా రైతులను ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రొత్సహించింది. ఒకప్పుడు కరువు కాటకాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న ఈ ప్రాంతం నేడు అగ్రికల్చర్‌ హబ్‌గా, ఆదర్శవంతమైన పంటలకు చిరునామాగా తయారైందని గర్వంగా చెబుతున్నాను. ఆలయాలకు, అధ్యాత్మికతకు పెద్దపీట వేయడంతో టెంపుల్‌ హబ్‌గా… పర్యాటక కేంద్రాలను గుర్తించడంతో టూరిజం హబ్‌గా… అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సకల క్రీడా వసతుల స్పోర్ట్స్‌ హబ్‌గా… జిల్లాలోని నిరుద్యోగులకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల ఉపాధిని కల్పించిన ఐటీ హబ్‌గా… గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి రహదారుల నిర్మాణం, రింగు రోడ్ల ఏర్పాటుతో మెరుగైన రవాణాకు దిక్సూచిగా తీర్చిదిద్దుకున్నాం. పల్లెలు, పట్టణాల ముఖచిత్రాలు మారేలా ప్రభుత్వం ఆచరించిన ప్రగతికారక కార్యక్రమాలు ఎంతగానే దోహదం చేశాయి. అన్ని రకాల అద్భుతాలకు నిలయమై, అధ్యయన కేంద్రమై సిద్దిపేట జిల్లా డెవలప్‌మెంట్‌ హబ్‌గా అగ్రస్థానంలో నిలిచిందని గర్వంగా తలెత్తుకొని చెబుతున్నానని హరీష్ రావు వివరించారు.

ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని రెండు కండ్లుగా చేసుకొని ఈ ప్రభుత్వం సవ్యమైన దిశను ఆచరిస్తున్నది. సబ్బండ వర్గాల సంతోషం, సంతృప్తిని కాంక్షిస్తూ తెలంగాణ సర్కారు తలపెట్టిన ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు స్వయం ఉపాధి కల్పన, కుల వృత్తులకు ప్రొత్సహించే పథకాలు దేశానికే దిశానిర్ధేశం చేస్తున్నాయి. హనుమంతుడి గుడి లేని ఊరు ఉండదు.. కేసీఆర్‌ పథకం లేని ఇల్లు ఉండదు అనే స్థాయిలో గడపగడపకూ సంక్షేమాన్ని విస్తరించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. అప్రతిహతమైన, ఆదర్శమైన, అధ్యయనశైలియైున అభివృద్ధిని మన జిల్లాలో కొనసాగించుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరికీ ఉంది. ఈ దశలో మనందరం అప్రమత్తంగా కుట్రలను తిప్పి కొడదాం. వివేకంతో ఆలోచించి విద్వేషాలను ఓడిద్దాం. జాతీయ సమైక్యతా దినోత్సవ స్పూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్య ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందాం. నిరంతరం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా అవిశ్రాంతంగా పాటుపడే తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి దీక్షాదక్షతకు అండగా నిలుద్దాం. జిల్లా అభ్యున్నతి కోసం మనవంతు దోహదం చేద్దామని అందరినీ కోరుకుంటూ మరోమారు జిల్లా ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.

” స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేన మహీం మహిషా: |
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యమ్
లోకాసమస్తాత్ సుఖినోభవంతు “

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News