Home జగిత్యాల అభివృద్దిలో మనమే ఫస్ట్!

అభివృద్దిలో మనమే ఫస్ట్!

Telangana Welfare schemes

రాయికల్‌ :  దేశవ్యాప్తంగా తెలంగాణ అభివృద్దిలో ముందుందని, మన పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమయ్యాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాయికల్ మున్సిపల్ అభివృద్ది కోసం మంజూరైన రూ.25 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ఆయన జగిత్యాల జెడ్పి చైర్‌పర్శన్ దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌లతో కలిసి శనివారం భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆనంతరం స్థానిక పద్మశాలి సంఘ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యమ ఫలితంగా తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడిందని ఆనంతరం కెసిఆర్ నాయకత్వంలో తెరాస ప్రభుత్వం ఏర్పడిందన్నారు. అంతకుముందు 60 ఏళ్ల పాటు పాలన సాగించిన పాలకులు తెలంగాణ అభివృద్దిని విస్మరించారని, 60 ఏళ్ల కాలంలో జరగని అభివృద్దిని ఐదేళ్లలో చేసి చూపిన ఘనత కెసిఆర్ సర్కార్‌కు దక్కుతుందన్నారు.

60 ఏళ్ల పాటు పాలించిన పాలకుల హాయంలో అభివృద్ది పేరిట ఇక్కడి ప్రజలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలన చేపట్టిన కెసిఆర్ ప్రజా సంక్షేమమే ధ్వేయంగా పని చేస్తు వినూత్న పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. వినూత్న పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. మన పథకాలను ఇతర రాష్ట్రాలు స్పూర్తిగా తీసుకొని అమలు చేస్తున్నాయని గొప్పగా చెప్పారు. రైతులకు రైతుబంధు, భీమా, నాణ్యమైన కరంటు అందజేస్తు అన్నదాతలకు అండగా నిలిచామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపరచి పేదలకు అధునిక వైద్యం అందేలా దృష్టి పెట్టినట్లు చెప్పారు. జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిని మెరుగు పరిచినట్లు చెప్పుతూ హైదరాబాద్‌లో లభించే వైద్య సేవలన్నీ జగిత్యాల గవర్నమెంట్ ఆస్పత్రిలోనే లభిస్తాయని వివరించారు.

ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా సర్కార్ ఆస్పత్రులను తీర్చిదిద్దడంతో ఎక్కువ మంది నమ్మకంతో మహిళలు సర్కార్ ఆస్పత్రుల్లోనే డెలివరీ అవుతున్నారని చెప్పారు. కెసిఆర్ కిట్, గర్భీణీలకు సౌకర్యాలు, ఆర్థికసాయం అందించడంతో సర్కార్ ఆస్పత్రులపై నమ్మకం పెరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో పాలన సౌకర్యం మరింత విస్తరించి ప్రజలకు సకల సౌకర్యాల లభించాలని తలిచి కొత్త జిల్లాలు, మండలాలు, కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేసారు. తండాలను జిపిలుగా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామిని నెరవేర్చామని చెప్పుతూ పెన్షన్‌ల సాయం పెంచి పేదలకు అండగా నిలిచినట్లు వివరించారు. లక్షలాది మంది బీడి కార్మికులకు జీవనభృతి అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కేదక్కుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి తెలంగాణ సర్కార్ పని చేస్తున్నట్లు వివరించారు.

యాదవులకు సబ్సీడీపై గొర్రెలు, మేకలు, గంగపుత్రులకు సబ్సీడీపై పరికరాలు, చేపల పెంపకం కోసం చర్యలు తీసుకున్నామని చెప్పారు. గీతకార్మికులు, పద్మశాలిలు తదితర వర్గాల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజాసంక్షేమమే లక్షంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంటు అందించడమే కాకుండా ప్రాజెక్ట్‌లను త్వరగా పూర్తి చేసి సాగు నీరు అందించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జగిత్యాల జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, మరింత అభివృద్దితో దూసుకువెళ్లుతుందని తెలిపారు.

కవిత ఎంపిగా ఉన్న సమయంలోనే ఇచ్చిన హామి మేరకు రాయికల్ మేజర్ గ్రామపంచాయతీని మున్సిపల్‌గా ఏర్పాటు చేస్తామని వివరించారు. జగిత్యాల జిల్లాలో రాయికల్ మున్సిపల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ మున్సిపల్‌ను మరింత అభివృద్ది చేస్తామని చెప్పుతూ మాదిగకుంటలో ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణ విషయమై తగు చర్యలు తీసుకుంటానని హామి ఇచ్చారు. ఈ సమావేశంలో జెడ్పి చైర్‌పర్శన్ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, ఎంపిపి లావుడ్యా సంధ్యారాణి, జెడ్పిటిసి జాదవ్ ఆశ్విని తదితరులు పాల్గొన్నారు.

Telangana Welfare schemes are ideal for the Country