విదేశీ ఏజెన్సీల మోసపూరిత విధానాలతో మయన్మార్ సరిహద్దులో యువత బందీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రా ల్లోని పలు జిల్లాలకు చెందిన 21 మంది యువకులు బందీగా ఉన్నట్లు సమాచారం. మొదట థాయిలాండ్‌లో ముగ్గురు వ్యక్తులు చెప్పడంతో స్నేహితులంతా ఉద్యోగాల కోసం వెళ్లగా, ఆ తర్వాత మోసపోయారు. అయితే, థాయిలాండ్ ఏజెన్సీ నిర్వాహకులు మొదట ఆశలు చూపించి ఉద్యోగాల్లో చేర్చగా, తరువాత మయన్మార్ ఏజెన్సీకి యువతను అమ్మేశారు. అక్కడ యువతను ఆన్‌లైన్‌లో అమ్మాయిల మాదిరి మాట్లాడిస్తూ చాటింగ్ చేయించడమే పని అని చెప్పినట్లు తెలిసింది. ఆ పని చేయలేమని చెప్పగానే ఏజెన్సీ నిర్వాహకులు చిత్రహింసలు పెట్టినట్లు బాధితులు తెలిపారు. అయితే, విదేశీ ఏజెన్సీల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే శాశ్వతంగా జైల్లో నిర్బంధిస్తామనే బెదిరింపులను కూడా ఎదుర్కొంటు న్నారని బాధితులు తెలిపారు.
దీంతో మమ్మల్ని రక్షించండి అని ఆర్తనాలు వినిపించారు. మేము ఎక్కడ ఉన్నామో మాకే తెలియదు, మా లొకేషన్ కూడా తెలియడం లేదని చెప్పుకొచ్చారు. కాగా, బాధిత యువత కుటుంబ సభ్యులు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధులను వరుసగా కలుస్తు న్నారు. దీంతో నంద్యాల ఎంపి, పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ బైరెడ్డి శబరిని ఢిల్లీలో బాధితుల తల్లిదండ్రులు కలిసి సమస్యను వివరించారు. దీంతో ఎంపి శబరి విదేశాంగ శాఖకు స్వయంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నేరుగా వీడియో కాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు తెలిసింది. ఇక, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి మాట్లాడుతూ ఎపికి చెందిన యువకులు ఉపాధి కోసం మయన్మార్‌కి వెళ్తే అక్కడ కిడ్నాప్‌కు గురయ్యారని తెలిపారు. బాధితులను భారత్‌కు తీసుకోచ్చేలా కేంద్ర ప్రభుత్వం చూడాలని కోరారు.