Sunday, April 28, 2024

మయన్మార్ సరిహద్దులో త్వరలో కంచె

- Advertisement -
- Advertisement -

భారత్‌లోకి రాకపోకలు కట్టడి
హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటన

గువాహటి : భారత్, మయన్మార్ సరిహద్దులో కంచెను కేంద్రం త్వరలో ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం ప్రకటించారు. దేశంలోకి స్వేచ్ఛాయుత రాకపోకల నిరోధానికి బంగ్లాదేశ్‌తో సరిహద్దులో కంచె ఏర్పాటు చేసిన వైనాన్ని అమిత్ షా ఈ సందర్భంగా ఉదహరించారు. భారత్, మయన్మార్ సరిహద్దు సమీపంలో నివసించే జనం 16 కిలో మీటర్ల దూరం దాటి పరస్పర భూభాగంలోకి ప్రవేశించేందుకు వీలు కల్పిస్తున్న ‘స్వేచ్ఛా రవాణా వ్యవస్థ (ఎఫ్‌ఎంఆర్)’ ఈ ప్రకటనతో త్వరలో ముగియగలదు.

గువాహటిలో అస్సాం పోలీస్ కమాండోల పాసింగ్ ఔట్ పరేడ్‌ను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తూ, ‘బంగ్లాదేశ్‌తో సరిహద్దులో వలె మయన్మార్‌తో భారత్ సరిహద్దులో త్వరలో కంచె ఏర్పాటు కాగలదు’ అని తెలియజేశారు. ‘బంగ్లాదేశ్‌తో సరిహద్దులో వలె మయన్మార్‌తో గల స్వేచ్ఛ సరిహద్దులో కంచె ఏర్పాటు చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిశ్చయించిందని అస్సాంలోని మా మిత్రులకు చెప్పదలిచాను’ అని అమిత్ షా తెలిపారు. ‘మయన్మార్‌తో గల భారత్ స్వేచ్ఛా రాకపోకల వ్యవస్థ (ఎఫ్‌ఎంజి) ఒప్పందంపై కూడా ప్రభుత్వం పునఃపరిశీలిస్తోంది. భారత్‌లోకి స్వేఛ్చా రాకపోకలు త్వరలో ముగియగలవు’ అని మంత్రి చెప్పారు.

మయన్మార్‌తో భారత్‌కు 1643 కిలో మీటర్ల నిడివి గల సరిహద్దు ఉన్నది. అది మిజోరామ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మీదుగా సాగుతుంది. ఆ రాష్ట్రాలన్నీ ప్రస్తుతం ఎఫ్‌ఎంఆర్‌ను వినియోగిస్తున్నాయి. భారత్ ‘ఏక్ట్ ఈస్ట్’ విధానంలో భాగంగా 2018లో దానిని అమలు పరుస్తున్నారు. మయన్మార్‌తో సరిహద్దు ఆందోళనల గురించి భారత్ ప్రస్తావించిన నెల తరువాత అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశంలోకి మయన్మార్ శరణార్థుల వలసతో సహా సరిహద్దు పొడవునా సవాళ్లు ఎదురవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News