Sunday, April 28, 2024

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని రాష్ట్ర సర్కార్ అన్ని విధాలుగా అండగా నిలిచి ఆర్థ్ధిక సహాయాన్ని అందిస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో పర్యటించి, వడగండ్ల వానతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను ఓ దార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యంతో రైతుల నోటికాడికి వచ్చిన బుక్క జారిపోవడం ఎంతో బాధకరమన్నారు. సిఎం కెసిఆర్ స్వయంగా రైతుబిడ్డ కాబట్టే రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకరాలు అందిస్తున్నారన్నారు. సిఎం కెసిఆర్ ఇప్పటికే వడ గండ్ల వాన పడిన ప్రాంతాల్లో పర్యటించి, నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10వేల ఆర్థిక సహాయం అందిస్తామనిప్రకటించారన్నారు. రైతుల ను ఆదుకోవాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంటే మరో రూ. 10 వేల ఆర్థ్ధిక సహాయాన్ని అందించాలన్నారు.

ఈ యాసంగి పంట కోసం నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయినా ప్రకృతి వైపరీత్యం వడగండ్ల వాన రూపంలో వచ్చి పంటల నష్టం జరిగిందన్నారు. భవిష్యత్తులో నెల ముందే పంట కోతను తెచ్చుకోగలిగితే ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నారు. అన్నదాతల ఆదాయం పెరగాలన్నదే లక్షంగా సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. యాసంగి కాలంలో రాష్ట్రం నుంచి పండే బాయిల్డ్ రైస్‌ను కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతుల బాయిలకాడ మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసిన సిఎం కెసిఆర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావల్సిన 30 వేల కోట్లను నిలిపివేసిందన్నారు. కెసిఆర్ పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంతోనే వ్యవసాయ రంగానికి గట్టి పునాదులు పడ్డాయన్నారు.

రాష్ట్రంలో ఈ యాసంగిలో 57 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని ఇందుకు నిదర్శనం కెసిఆర్ పాలననే అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా రాష్ట్రంలో నగదు బదిలీ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఏ గ్రామంలో తిరిగిన సిఎం కెసిఆర్ ప్రభుత్వం పట్ల రైతులలో ఎంతో ప్రేమ అభిమానం కనబడుతుందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలలో పర్యటించి పంట నష్టపోయిన పూర్తి వివరాలను సేకరించాలన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రజాప్రతినిధులు, నాయకులు బక్కి వెంకటయ్య, మారెడ్డి రవీందర్‌రెడ్డి, వంగనాగిరెడ్డి, యాదగిరి, వ్యవసాయ శాఖ అధికారులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News