Tuesday, October 15, 2024

భారత ప్రజాస్వామ్యంపై పదేళ్ల పాటు దాడి

- Advertisement -
- Advertisement -

ఇప్పుడు అది ఎదురు దాడి చేస్తోంది
ఎన్నికలు ప్రజాస్వామ్యం భవితపై ఆశలు రేపాయి
యుఎస్ నేషనల్ ప్రెస్ క్లబ్‌లో రాహుల్ గాంధీ

వాషింగ్టన్ : భారత ప్రజాస్వామ్యం గడచిన దశాబ్దంలో తీవ్ర దాడికి గురైందని, కాని అది తిరిగి ఎదురుదాడి చేస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం వాషింగ్టన్‌లో విలేకరుల గోష్ఠిలో చెప్పారు. రాహుల్ నేషనల్ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ, ‘భారతీయ ప్రజాస్వామ్యం గడచిన పది సంవత్సరాల్లో ధ్వంసమైందని చెప్పగలను, అయితే, ఇప్పుడు అది తిరిగి పోరాడుతోంది’ అని తెలిపారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మా నుంచి లాక్కోవడం చూశాను. నా కళ్లతో దానిని చూశాను. మా శాసనసభ్యులను కొనుగోలు చేయడం, అపహరించడం తిలకించాను.

వారు అకస్మాత్తుగా బిజెపి శాసనసభ్యులు అయ్యారు. అందువల్ల భారత ప్రజాస్వామ్యం దాడికి గురైంది, చాలా దారుణంగా బలహీనమైంది, అది ఇప్పుడు తిరిగి పోరాడుతోంది. అది ఎదురు పోరాడుతుందని నా నమ్మకం’ అని లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ చెప్పారు. ఎన్నికల ఫలితాలు దేశంలో ప్రజాస్వామ్యం భవితపై నాలో ఆశలు రేకెత్తించాయని రాహుల్ చెబుతూ, సమాన అవకాశాలు లేకపోయినా లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇచ్చాయని తెలిపారు. ఆయన తన అనుభవాలను పంచుకుంటూ, బ్యాంకు ఖాతాలు స్తంభనతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసిందని తెలియజేశారు. ‘మా బ్యాంకు ఖాతాలు స్తంభించగా మేము ఎన్నికల్లో పోరాడాం.

మరి వేరే ప్రజాస్వామ్య వ్యవస్థలో అలా జరిగిందా అన్నది నాకు తెలియదు. అటువంటిది సిరియాలో లేక ఇరాక్‌లో సంభవించి ఉండవచ్చు. అయితే, మేము మా ఎన్నికల సమయంలో కూర్చుని మా కోశాధికారితో మాట్లాడాం. ‘మన వద్ద డబ్బు లేదు’ అని ఆయన చెప్పారు. ఇప్పుడు డృఢచిత్తం గల వోటర్ ఉన్నాడు. అయినప్పటికీ ప్రచారాల నిర్వహణ అవసరం ఉంది. మీకు సంభాషణల అవసరం ఇప్పటికీ ఉంది. మీకు ఇప్పటికీ సమావేశాలు ఉండడం అవసరం’ అని ఆయన అన్నారు. తనపై ఇరవై పైచిలుకు కేసులు ఉన్నాయని, దేశ చరిత్రలో పరువునష్టం దావాకు జైలు శిక్ష పడిన ఏకైక వ్యక్తిని తానేనని రాహుల్ తెలిపారు. ‘ప్రస్తుతం జైలులో ఉన్న ఒక ముఖ్యమంత్రి మాకు ఉన్నారు& అవును, భారతీయ వోటర్ దృఢచిత్తం గల వ్యక్తి. అతను ఒక శిలలా నిలబడతాడు. పూర్తిగా అతను చేస్తాడు.

అయితే. అతనికి అందుకు వెసులుబాటు కల్పించడం అవసరం. అదే కొరవడింది’ అని రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ‘తాను భగవంతునితో మాట్లాడుతుంటానని 21వ శతాబ్దంలో ఒక ఆధునిక దేశంలో ప్రజలకు చెప్పే ప్రధాని ఇక్కడ ఉన్నారు. ఆయన ఇతరులు అందరి కన్నా భిన్నం. ఇతరుల వలె కాకుండా ఆయన నేరుగా భగవంతునితో అనుసంధానం ఉన్న మనిషి. ఇక మాకు అది ముగిసిన ఆట (ఎన్నికల్లో మోడీ దృక్పథంలో).

మేము ఆయనను ఓడించామని మాకు తెలుసు’ అని అన్నారు. ‘ఆయన లోక్‌సభలోకి అడుగు పెట్టి, ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేసిన మొదటి పని చాలా మంచిది. ఆయన భారత రాజ్యాంగాన్ని తన నుదుటికి ఆనించుకున్నారు’ అని రాహుల్ తెలిపారు. ‘అది ఆసక్తికరమైన విడ్డూరం. ఒక వైపు ఆయన రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆయన దాడి చేస్తున్నారు. రాజ్యాంగాన్ని తన నుదుటికి ఆనించేలా భారత ప్రజలు చేశారు’ అని రాహుల్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News