Thursday, July 18, 2024

పిసిసి పీఠంపై ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : పిసిసి అధ్యక్షుడి పదవిపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్‌నాయకులు పేర్కొంటున్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవి కాలం గురువారంతో ముగియడంతో నూతన చీఫ్ ఎన్నికకు ఏఐసిసి కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా టి-కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలతో ఏఐసిసి గురువారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య నాయకులు అందుబాటులో ఉండాలని ఏఐసిసి ఆదేశించింది. ఈ భేటీకి హాజరు కావాలని రాష్ట్రానికి చెందిన మంత్రులకు, సీనియర్‌లకు ఏఐసిసి కబురు పంపింది. సిఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రు లు వివిధ పనుల నేపథ్యంలో నాలుగు రోజులుగా ఢిల్లీ టూర్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా మణుగూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సైతం ఏఐసిసి ఆదేశాల నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకొని గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సమావేశంలో ప్రధానంగా పిసిసి అధ్యక్షుడి ఎంపిక,

మంత్రివర్గ విస్తరణ, చేరికలు, నామినేటెడ్ పోస్టులకు నాయకుల ఎంపిక తదితర అంశాలపై చర్చించినట్టుగా పిసిసి వర్గాలు చెబుతున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు ఏఐసిసి ముఖ్య నేతలతో పాటు సిఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఢిల్లీలో భేటీ అయ్యారు. అధ్యక్ష పదవి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. అయితే ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే వారికే ఈ పదవిని కట్టబెట్టాలని ఏఐసిసి భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబులతో పాటు ఎంపి బలరాం నాయక్, పిసిసి కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సహా పలువురు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ, ప్రచా ర కమిటీ చైర్మన్ మధుయాష్కీ ఢిల్లీ స్థాయిలో భారీగా లాబీయింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో నేరుగా పరిచయాలు ఉండటంతో తనకే అవకాశమివ్వాలని మధుయాష్కీ కోరుతున్నట్లుగా సమాచారం. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డి సైతం వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు టిపిసిసి చీఫ్ పోస్ట్ రేసులో ఉన్నారు.

ఆ ముగ్గురి విషయంలో సానుకూలం….
మాజీ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తన పేరును కూడా పరిశీలించాలంటే సిఎం రేవంత్ సహా ఏఐసిసి నాయకులతో మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఏఐసిసి కార్యదర్శిగా, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సైతం ఈ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరడం విశేషం. ఈ నేపథ్యంలోనే సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని పార్టీ అధిష్టానం ముందుకెళ్లాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. రెడ్డియేతర సామాజిక వర్గాలకు పిసిసి అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం పిసిసి సంస్థాగత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న మహేశ్ కుమార్ గౌడ్ పార్టీని పూర్తిస్థాయిలో నడుపుతున్నారు. కానీ, ఆయన్ను నియమిస్తే ప్రభుత్వంతో ఎలా సమన్వయం చేసుకొని ముందుకెళ్తారన్న అంశంపై అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మాజీ ఎంపి మధుయాష్కీ విషయంలో ఏఐసిసి సానుకూలంగా ఉన్నట్టుగా సమాచారం. దీంతోపాటు మంత్రి సీతక్కను పిసిసి అధ్యక్షురాలిగా నియమిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News