నిజామాబాద్ జిల్లా బోధన్ ఒక్కసారిగా ఉలికిపడింది. ‘ఉగ్ర’ లింకులు కలకలం సృష్టించాయి. ఎన్‌ఐఎ, కేంద్ర దర్యాప్తు సంస్థలు నిజామాబాద్ జిల్లా బోధన్‌లో తనిఖీలు చేపట్టాయి. ‘బోధన్ పట్టణంలో బుధవారం తెల్లవారు జామున ఎన్‌ఐఎ విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. కాగా ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అనంతరం బోధన్ కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకున్నట్లు సమాచారం. కాగాఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర నిఘా సంస్థలు, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో అషర్ డానిష్‌ను జార్ఖండ్‌లోని రాంచీలో అరెస్ట్ చేశాయి. అనంతరం అతడు ఇచ్చిన సమాచారం మేరకు దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకు న్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని బోధన్ పట్టణంలో కూడా ఎన్‌ఐఎ బృందాలు జల్లెడ పట్టాయి.
పక్కా సమాచారం మేరకు ఉగ్ర మూలాలు కలిగిన వ్యక్తిని అరెస్టు చేశాయి. అతని వద్ద ఐఎస్‌ఐఎస్ కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టడంతో పాటు ఓ ఎయిర్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయమై స్థానిక పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం అధికారికంగా విషయాలు వెల్లడించలేదు. గతంలోనూ బోధన్ పట్టణంలో ఉగ్రలింకులకు సంబంధించి ఎన్‌ఐఎ సహా పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేపట్టాయి. ఉగ్ర లింకులు కలిగిన వారిపై ఆరా తీశాయి. ప్రత్యేకించి బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు ఇక్కడి నుంచే పాస్‌పోర్టులు జారీ అయిన ఉదంతం కూడా అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తాజాగా ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్న వ్యక్తి పట్టుబడడం జిల్లాలో చర్చనీయాంశంతో పాటు ఆందోళనలకు తావునిస్తోంది.