Saturday, May 10, 2025

ఉగ్రవాదానికి ఊతం.. పాకిస్తాన్ పతనం

- Advertisement -
- Advertisement -

స్వాతంత్య్రం తర్వాత కూడా భారతదేశానికి శత్రుబాధలు తప్పలేదు. అప్పటి ఆల్ ఇండియా ముస్లింలీగ్ నాయకుడు మహ్మద్‌అలీ జిన్నా భారత్ నుండి ముస్లింలను వేరు చేసి ప్రత్యేక ముస్లిం దేశం కోసం ఒత్తిడి తేవడం జరిగింది. మత ప్రాతిపదికన 1947 ఆగస్టు 14 వ తేదీన ఇండియా విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది. పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడి సుమారు 78 సంవత్సరాలు కావస్తున్నా, భారత్‌పై ఆ దేశం ఇంకా ప్రతీకారాలతో రెచ్చిపోవడం దేనికి సంకేతం? భారత్‌పాక్ మధ్య కుదిరిన సిమ్లా, లాహోర్ ఒప్పందాలు ఏమైనాయి? రక్తపాతంతో పాక్ ఇప్పటివరకు ఏం సాధించింది? తన శక్తికిమించిన ఆయుధాలను కొనుగోలుచేసి, అణ్వస్త్రాలను ప్రోదిచేసి, క్షిపణులకు పదును పెట్టి, ఉగ్రవాదులకు ప్రోత్సాహమిచ్చి, భారత ఉపఖండంలో శాంతికి విఘాతం కలిగిస్తున్న దాయాది దేశానికి ఒనగూడే ప్రయోజనమేమీ లేదు.

ఇప్పటికే ఆర్ధికంగా చితికిపోయి, అంతర్గత కలహాలతో కకావికలమైన పాక్ తన పొరుగుదేశం భారత్‌తో యుద్ధం చేసి, విజయం సాధించగలదనుకోవడం భ్రమ మాత్రమే. ఉగ్రవాదుల ఏరివేతకు భారత్ తలపెట్టిన ఒక చిన్న చర్యకే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. పహల్గాం నరమేధానికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ను చేపట్టింది. ఉగ్రవాదులను మట్టుపెట్టడంతో భారత్ శాంతిస్తుందని అంతా భావించారు. పాకిస్తాన్ తాను చేసిన పొరపాట్లతో భారత్‌ను రెచ్చగొట్టేలా చేసింది. తత్ఫలితమే పాక్ ప్రస్తుత పరిస్థితికి కారణం. గతంలో భారత్ పాక్ మధ్య అనేక సంఘర్షణలు జరిగాయి. కొన్ని సంఘర్షణలు యుద్ధాలకు దారితీసాయి. 1947- 48 మధ్య, 1965 లోను, 1971 లోను భారత్ పాక్ మధ్య తీవ్రమైన యుద్ధాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది.

భారత్‌తో తలపడిన ప్రతిసారి పాక్ పరాజయం పాలయింది. అయినా ఈ యుద్ధాల నుండి పాక్ గుణపాఠం నేర్చుకోలేదు. పైగా చైనా అండ చూసుకుని భారత్ సమగ్రతను దెబ్బకొట్టాలని పాక్ ప్రయత్నించడం సిగ్గుచేటు. గత నెలలో పవల్గాంలో ఉగ్రవాదులు అమాయకులను మతం పేరు చెప్పి చంపడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. పైగా భారత్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు ప్రతీకార చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం ప్రతినబూనింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడంతో సుమారు 100 మందికి పైగా కరడుగట్టిన ఉగ్రవాదులు హతమైనారు. ఈ దాడుల్లో కరడు గట్టిన తీవ్రవాది మసూద్ అజహర్ కుటుంబ సభ్యులంతా హతులవడం, కాందహార్ విమానం హైజాక్‌లోను, పార్లమెంట్, పఠాన్‌కోట్, పుల్వామా దాడుల్లోను ప్రధాన పాత్ర పోషించిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రముఖ నాయకుడు అబ్దుల్ రవూఫ్ అజార్ హతమవడం ఉగ్రవాదుల వెన్ను లో వణుకు పుట్టించింది.

భారత్ ఇంతటి సాహసానికి ఒడిగట్టదనుకున్న పాక్ నేలవిడిచి సాము చేసింది. ఎల్‌ఒసి వెంబడి పాక్ కాల్పులు జరుపుతున్నది. పాక్ భారత దేశంలోని 15 నగరాలను టార్గెట్ చేసింది. నార్త్ నుంచి వెస్ట్రన్ సరిహద్దు వరకు భారత్ మిలిటరీని మట్టుపెట్టడానికి పాక్ ఆర్మీ ప్రయత్నించింది. పాక్ మిస్సైళ్ళు, డ్రోన్లు భారత్ ముందు నిలవలేకపోయాయి. భారత్ ఎయిర్ ఢిఫెన్స్ వ్యవస్థ పాక్ దాడులను తిప్పికొట్టింది. భారత్ ఎయిర్ డిఫెన్స్‌ను లక్ష్యంగా చేసుకున్న పాక్‌కు బుద్ధి చెప్పడానికి భారత్ కూడా పాక్ ఎయిర్ ఢిఫెన్స్ ను టార్గెట్ చేయడం స్వాగతించాలి. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు సంబంధించిన ఒప్పందాన్ని అప్పట్లో అమెరికా వ్యతిరేకించి, ఆంక్షలు విధించింది.ఇప్పుడు పాక్‌ను తిప్పికొట్టడానికి రష్యా ఆయుధాలు ఉపకరిస్తున్నాయి. పాక్ ఎంత ప్రమాదకరమో, భారత్‌కు రక్షణ ఎంత ముఖ్యమో అమెరికా ఇప్పటికైనా తెలుసుకోవాలి. చైనా, అమెరికాల వద్ద పాకిస్తాన్ కొనుగోలు చేసిన యుద్ధ విమానాలను భారత్ గగనతలంలోనే పేల్చేసింది. ఈ చర్యతో పాకిస్తాన్ త్రివిధ దళాలు కకావికలమైనాయి.

ఎల్‌ఒసి వద్ద (నియంత్రణ రేఖ) ఇరుదేశాల సైన్యం మోహరించి ఉంది. భారత్ సైనికుల సాహసానికి పాక్ సైన్యం ప్రతీకార చర్యలకు దిగినా, భారత్ వ్యూహాలకు దాయాది దేశం బెంబేలెత్తిపోతున్నది. ఆపరేషన్ సిందూర్ పేరుతో జరుగుతున్న పాక్ ప్రేరిత ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం క్రమేపీ ఇరుదేశాల మధ్య తీవ్రమైన యుద్ధానికి దారితీసే ప్రమాదముంది. పాక్ ఆర్మీ, సివిలియన్స్ జోలికి పోకుండా కేవలం ఉగ్రవాద పోస్టులను నిర్వీర్యం చేయడానికే పరిమితమైన భారత్‌ను పాక్ రెచ్చగొట్టింది. ఉగ్రవాదులతో తమకు సంబంధం లేదని వాదిస్తున్న పాక్ నాయకులు, మిలిటరీ పెద్దలు ఆపరేషన్ సిందూర్‌లో హతులైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరుకావడం, ఉగ్రవాద చర్యలకు సంఘీభావం ప్రకటించడం ద్వారా ప్రపంచం దృష్టిలో పాక్ దోషిగా నిలబడింది. ఉగ్రవాదులకు పాక్ ఇస్తున్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా ఇంతకంటే నిదర్శనమేముంటుంది?భారత్‌లోని పలు నగరాల ఎయిర్ ఫోర్టులను, ఎయిర్ బేస్ లను పాక్ టార్గెట్ చేసింది. యుద్ధ విమానాలతో విరుచుకుపడాలని ప్రయత్నించి, తప్పిదం చేసిన పాక్‌కు భారత్ తగిన గుణపాఠం చెప్పింది.

లాహోర్, కరాచీల్లో నిప్పుల వర్షం కురిసింది. జమ్మూకశ్మీర్, ఉద్దంపూర్‌లపై పాక్ క్షిపణి దాడులను భారత్ తిప్పికొట్టింది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ సియాల్ కోట్‌లను భారత్ టార్గెట్ చేసింది. పాక్ ఈ నగరాలను షట్‌డౌన్ చేసింది. పాక్ ప్రధాని పారిపోయినట్లుగా, బంకర్లలో దాకున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. భారత్ ప్రతీకారం ఈ విధంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. టర్కీ తప్ప ప్రపంచదేశాలేవీ పాక్‌కు మద్దతుగా నిలిచే సాహసం చేయబోవు. ఇస్లామిక్ దేశాలు సైతం పాక్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. పాక్ దుర్మార్గాలు రుచించకపోవడమే కాకుండా భారత్‌తో గల వాణిజ్య సంబంధాలు కూడా ఇందుకు కారణం కావచ్చు. చైనా ప్రత్యక్షంగా పాక్‌కు మద్దతునీయకపోయినా, పరోక్ష సహకారం అందచేస్తుందనడంలో సందేహం లేదు. భారత్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలకు పాక్ మద్దతునిస్తున్నది. ఇందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిందని భారత్ ఎప్పటి నుంచో ఐక్యరాజ్యసమితిలోను, ఇతర అంతర్జాతీయ సంస్థలకు మొరపెట్టుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోయింది. జనరల్ జియా ఉల్ హక్ నుండి, ముషారఫ్ వర కు భారత్‌తో పాక్ పలు శాంతి ఒప్పందాలు చేసుకుంది.

ఇరు దేశాల మధ్య సుహృద్భావం కోసం అప్పటి ప్రధాని వాజ్ పేయీ లాహోర్ బస్సు యాత్ర కూడా చేపట్టారు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది. అన్ని ఒప్పందాలను పాక్ తుంగలో తొక్కింది. సరిహద్దుల వద్ద కాల్పులకు తెగబడుతూ, కవ్వింపులకు పాల్పడుతూ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులను చొప్పించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొంతకాలం కశ్మీర్‌లో అలజడులు చెలరేగినా, వాస్తవాన్ని అర్థం చేసుకున్న కశ్మీర్ యువత క్రమేపీ తమ జీవితాలను బాగు చేసుకోవడానికి, ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిస్తూ, ఉగ్రవాదం పట్ల విముఖత ప్రదర్శిస్తున్నది. కశ్మీర్‌లో టూరిజం వ్యాప్తిచెందుతూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిస్థితిని అర్థ్ధం చేసుకుని, పాకిస్తానీయుల చర్యలపట్ల విసుగెత్తి భారత్‌లో ఉంటేనే తమకు మేలని కశ్మీర్ ప్రజలే కాకుండా పిఒకెలోని యువత కూడా భావిస్తున్నది. పాక్‌లోని బెలూచిస్తాన్, సింధు ప్రాంతాల ప్రజలు ఎందుకు పాకిస్తాన్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారో కశ్మీర్ ప్రజానీకం అవగతం చేసుకుంది.

అభివృద్ధి బాటలో పయనిస్తున్న బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖతం చేసి, ఎలా అరాచకాన్ని సృష్టిస్తున్నదో, పాక్ ప్రమేయంతో బంగ్లాదేశ్‌కు ఏ గతి పట్టిందో విదితమే. తాలిబాన్లతో అంటకాగిన పాకిస్తాన్‌కు ప్రస్తుతం అఫ్ఘానిస్తాన్ కు తీవ్రమైన శత్రుత్వం నెలకొంది. పాక్‌లో అంతర్యుద్ధం చెలరేగింది. పాక్‌లోని బలూచిస్తాన్, సింధ్‌లతో పాటు పాక్‌లోని పలు ప్రాంతాల ప్రజలు పాక్ పాలకులకు, సైన్యానికి వ్యతిరేకంగా తీవ్రమైన పోరు కొనసాగిస్తున్నారు. పాక్ పాలకులపై అక్కడి ప్రజలకు నమ్మకం లేదు. ప్రస్తుత భారత్- పాక్ సరిహద్దులు బాంబులతో దద్దరిల్లుతున్నాయి. పలుచోట్ల పాక్ ప్రతీకార దాడులకు తెగబడుతూ క్షిపణులను ప్రయోగిస్తున్నది. పాక్ క్షిపణులను భారత్ గగనతలంలోనే భస్మం చేస్తున్నది. జమ్మూ టార్గెట్‌గా పాక్ దాడులు చేస్తున్నది. పఠాన్ కోట్, శ్రీనగర్, జైసల్మీర్‌పై పాక్ డ్రోన్లను ప్రయోగించినా భారత్ వాటిని కుప్పకూల్చింది. ఏదిఏమైనప్పటికీ భారత దేశం గతంలో మాదిరిగా ప్రపంచ దేశాల ఒత్తిడికి లొంగకుండా పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను వశం చేసుకోవాలి.

  • సుంకవల్లి సత్తిరాజు
    9704903463
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News