సర్వే ప్రకారం 10,200 మంది నిర్వాసితుల గుర్తింపు
తొలిదశలో 1600 కుటుంబాలకు పునరావాసం
మూసీ పరీవాహకంలో అర్హులైన పేదల వివరాలు సేకరించండి
నేటి నుంచి ఇంటింటికీ మూడు జిల్లాల కలెక్టర్లు
బఫర్‌జోన్‌లో కట్టడాలకు విలువను బట్టి పరిహారం లేదా ప్రత్యామ్నాయం
అర్హులైన సామాన్యులకు అన్యాయం జరగొద్దు
చెరువుల వద్ద సిసి కెమెరాలు, కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం
పాతబస్తీ మెట్రో విస్తరణ పనుల్లో వేగం పెంచండి
సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: మూసీ బాధిత ప్రజలకు అద్భుతమైన పునరావాస పథకం తీసుకురావాలని సిఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అలాగే బఫర్‌జోన్‌లో నివసించే కట్టడాలకు ఆర్‌ఎఫ్‌సి టిఎల్‌ఏఆర్‌ఆర్ చట్టం ప్రకారం, భూమి పట్టాదారుకు భూ విలువను బట్టి పరిహారం అందించాలని సిఎం అధికారులను ఆదేశించారు. మంగళవారం మూసీ రివ ర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌తో పాటు హైదరాబాద్ మె ట్రో రైలుపై సంబంధిత అధికారులతో సిఎం రేవం త్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఐఏఎస్ ఆమ్రాపాలి, హైడ్రా క మిషనర్ రంగనాథ్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి, సలహాదారు శ్రీనివాసరాజు, సిఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి,హెచ్‌ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అ హ్మద్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జి ల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమీక్షలో భాగంగా సిఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూసీ పరిధిలోని బఫర్ జోన్‌లో ఇళ్లు ఉన్న ప్రజలకు, డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను సిఎం రేవంత్ ఆదేశించారు. ఏ ఒక్క సామాన్యుడికి కూడా అన్యాయం జరగొద్దని సిఎం సూచించారు. ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
మొదటి దశలో 1,600 కుటుంబాలకు..
ఇక ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, వాటికి సంబంధించి ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లను గుర్తించాలని సూచించా రు. అవి ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని సిఎం రేవంత్ ఆదేశించారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా 16 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, దీనిపై జీఓ విడుదల చేయాలని సిఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మూసీ పరివాహక ప్రాంతా ల్లో 10,200 మంది ప్రజలు ఉంటున్నట్లు సర్వే ద్వారా గుర్తించిన ప్రభుత్వం వారికి పునరావాసం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే మూ సీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగం గా నేటి నుంచి అధికారులు రంగంలోకి దిగి, మూ సీ పరిసర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో నేటి నుంచి ఇంటింటికి వెళ్లి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు గురించి, పునరావాసం కోసం ఇళ్లు నిర్మిస్తున్న విషయాల గురించి ప్రజలకు వివరించనున్నారు. అయితే మొదటి దశలో 1,600 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సిఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
నిర్వాసితులయ్యే కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల మందికి డబుల్ బెడ్‌రూం గృహాలను కేటాయిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ బెడ్ (నదీ గర్భం), బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలకు పునరావాసం కల్పించేందుకు ఈ ఇళ్లను ఉపయోగిస్తారు. ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకా రం 10,200 మందిని ప్రభుత్వం నిర్వాసితులుగా గుర్తించింది. అందులో భాగంగా నేడు కలెక్టర్‌లు, అధికారులు కలిసి ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలను కలిసి ఎక్కడెక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్ల ను కేటాయించారో తెలియజేస్తారు. ముందుగా రివర్ బెడ్‌లో ఆక్రమణలో ఉన్న 1,600 ఇళ్లను తొలగించి అక్కడ ఉన్న వారిని డబుల్ బెడ్ రూం ఇళ్లలోకి తరలిస్తారు.
మూసీ బఫర్ జోన్ లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు పరిహారం చెల్లిస్తారు. నిర్మాణ ఖర్చుతో పాటు, వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. దీంతోపాటు డబుల్ బెడ్‌రూం ఇళ్లను కూడా కేటాయిస్తారు. మూసీ బాధిత ప్రజలకు చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే భరోసా ఇచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ మెట్రో మార్గానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాతబస్తీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలని సిఎం సూచించారు. మెట్రో మా ర్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి, పరిష్కరించాలని సిఎం సూచించారు.