Saturday, April 27, 2024

2024-25లో పెట్టుబడుల ఉపసంహరణ తగ్గొచ్చు

- Advertisement -
- Advertisement -

2023-24లో కేంద్ర బడ్జెట్ అంచనా రూ. 51,000 కోట్లు
ఇప్పటివరకు కేంద్రం రూ.8000 కోట్లు మాత్రమే సమీకరించింది 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చెప్పిన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం నెరవేరడం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వచ్చే ఏడాది 50 శాతం మేరకు పెట్టుబడి ఉపసంహరణ టార్గెట్‌ను తగ్గించవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పెట్టుబడి ఉపసంహరణ లక్షం ఈ ఏడాది రూ.51,000 కోట్ల ఉండగా, ఇది రూ.20,000 కోట్లకు సవరించే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రభుత్వం రూ.8000 కోట్లను మాత్రమే సమీకరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆస్తుల విక్రయాల నుండి భారీ మొత్తాన్ని పొందే అవకాశం లేదు.

ఇప్పటికే ఉన్న ఎన్‌ఎండిసి స్టీల్, హిందుస్తాన్ జింక్ వాటాల సేల్, ఐడిబిఐ బ్యాంక్ విక్రయం ప్రణాళిక మార్చి 31 నాటికి జరిగే అవకాశాలు కనిపించడం లేదు. అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతిన్నది, ఇది ఒప్పందాలను పూర్తి చేయడానికి గత గడువులను కూడా ప్రభావితం చేసింది. అందువల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం 20242025 బడ్జెట్ అంచనాలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202324) బడ్జెట్ అంచనా కంటే 15-20 శాతం తక్కువగా ఉండవచ్చు. అయితే ఇది కొనసాగుతున్న ఆస్తి విక్రయాల పురోగతిపై కూడా ఆధారపడి ఉంటుంది.

లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం నాలుగోసారి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ. 51,000 కోట్ల బడ్జెట్ అంచనా కూడా తగ్గించవచ్చు. ఇదే జరిగితే ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోలేక పోవడం ఇది నాలుగోసారి అవుతుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ డేటా ప్రకారం, కేవలం ఆస్తులను విక్రయించడం ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు రూ.8,000 కోట్లు మాత్రమే సేకరించగలిగింది.

గతంలో ప్రభుత్వం చివరిసారిగా 2018-19లో మాత్రమే పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకుంది. అప్పుడు ప్రభుత్వానికి రూ.84,972 కోట్లు రాగా, బడ్జెట్ అంచనా రూ.80,000 కోట్లుగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐపిఒ నుండి ప్రభుత్వం రూ.35,293 కోట్లు సమీకరించింది. అయితే ఆ సమయంలో డిజిన్వెస్ట్‌మెంట్ వసూళ్లు సవరించిన అంచనా కంటే రూ. 15,000 కోట్లు తక్కువగా ఉన్నాయి.

రాబోయే ఎన్నికలు, మెరుగ్గా పన్ను..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పన్ను, పన్ను యేతర రాబడి వసూళ్లు మెరుగ్గా ఉన్నందున ఆస్తుల విక్రయాలలో నెమ్మదిగా పురోగతి ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఆందోళన కలిగించదు. కొత్త వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ఇటీవల ఆమోదించలేదు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడుల ఉపసంహరణ వంటి రాజకీయంగా సున్నితమైన అంశానికి ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్ నిలిచిపోయింది. ఎందుకంటే వారి ప్లాట్‌లను కోర్ డిజిన్వెస్ట్‌మెంట్ కార్యకలాపాల నుండి వేరు చేయాల్సి ఉంటుంది. కాంకోర్ విషయంలో లాజిస్టిక్స్ ఖర్చులపై ప్రభావం చూపుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో భారత్ పెట్రోలియంలో వాటా విక్రయ ప్రతిపాదనను పక్కనపెట్టాల్సి వచ్చింది. ఇప్పటికే పవన్ హన్స్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ కోసం బిడ్ విజేతలు అనర్హులుగా ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News