Sunday, April 28, 2024

కర్ణాటక మోడల్ అంటే కష్టాల మోడల్

- Advertisement -
- Advertisement -

ఫిష్‌ఫెడ్ చైర్మన్ పిట్టల

మనతెలంగాణ/హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలో అక్కడి సిఎం సిద్దారమయ్య, మంత్రి డికె శివ కుమార్ అక్కడ అమలు చేస్తున్నట్లు తెలంగాణలో చేస్తామని ఊదరగొడుతున్నారని.. కర్ణాటక మోడల్ అంటే కష్టాల మోడల్ అని తెలంగాణ ఫిష్‌ఫెడ్ చైర్మన్ పిట్టల రవీందర్ అన్నారు.మంగళవారం పిట్టల మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారని , కాంగ్రెస్ నేతల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. తాము కర్ణాటక వెళ్లి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నామని ,ఇక్కడి పత్రికల్లో, టీవీ లో ఇస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదన్నారు. డికె ప్రాతినిధ్యం వహిస్తున్న కనకపూర నియోజకవర్గంలో పర్యటించి వాస్తవాలు తెలుసుకున్నామన్నారు. 22 గ్రామాల్లో పర్యటించి వాస్తవాలను ప్రజలను అడిగామని తెలిపారు.

కర్ణాటక ఎన్నికల్లో 100 రోజుల్లో 5 స్కీంలు అమలు చేస్తామని హామీ ఇచ్చి చేయడం లేదన్నారు. 6 నెలలు దాటినా అమలు చేయడం లేదన్నారు. యువనిధి స్కీం కింద డిగ్రీ విద్యార్థులకు రూ. 3000, డిప్లమా చేసిన వారికి రూ.1500 ఇస్తామని హామీఇచ్చి ఇప్పటికి ఇవ్వడం లేదన్నారు. ఇస్తున్నట్లు పత్రికల్లో మాత్రం ప్రకటనలు ఇచ్చారని ఆరోపించారు. గృహలక్ష్మి పథకం అందరికి ఇస్తామని, ఇప్పుడు బిపిఎల్ వారికే అమలు చేస్తున్నారని తెలిపారు. శక్తి పేరుతో మహిళలకు అన్నీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నారని , కేవలం ఆర్డినరీ బస్సుల్లో బిపిఎల్ వారికే ఇస్తున్నారని, ప్రయాణ సమయంలో ఇబందులు పడుతున్నట్టు తమదృష్టికి వచ్చిందని తెలిపారు.

గృహ జ్యోతి కింద 200 యూనిట్ లు ప్రతి ఇంటికి విద్యుత్ ఉచితంగా అందరికీ ఇస్తామన్నారని, గతంలో వాడిన వినియోగాన్ని బట్టి 200 యూనిట్లు దాటినా వారికి ఇవ్వడం లేదని తెలిపారు. తమ పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడట్లు అయిందని కర్ణాటక ప్రజలు బాధపడుతున్నారన్నారు. 22 గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్ ఎక్కడా కనపడలేదన్నారు.కర్ణాటకలో అమలు చేస్తున్న స్కీమ్ లన్ని ఆశ చూపించి ఓట్లు వేశాక మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హామీలు అన్నీ ఉత్తవే అన్నారు.కర్ణాటక మోడల్ శుద్ధ అబద్దం అన్నారు. తెలంగాణలో ఇదే అభివృద్ధి కొనసాగాలంటే కర్ణాటక మోడల్ ను తిరస్కరించాలని ప్రజలకు విజ్ణప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News