Monday, May 27, 2024

‘నిరుద్యోగం’పై అదే నిర్లక్ష్యం!

- Advertisement -
- Advertisement -

ఎన్నికల సమయాలలో దేశం ఎదుర్కొనే ప్రధాన సమస్యల గురించి చర్చలు జరగాలి, రాజకీయ పార్టీలు సైతం ఆయా సమస్యలకు తామే విధంగా పరిష్కార మార్గాలు చూపుతామో చెబుతూ ప్రజల ముందుకు రావా లి. కానీ ప్రస్తుత ఎన్నికలలో ప్రధాన రాజకీయ పక్షాలు ప్రత్యర్థులపై అనుచిత విమర్శలు కురిపిస్తూ, భావోద్వేగాలు రెచ్చగొడుతూ, సంక్షేమ కార్యక్రమాలను చూపెడుతూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలే ఎక్కువగా చేస్తున్నాయి. నేడు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగ యువత. ఈ సమస్య గురించి అధికార, ప్రతిపక్షాలు చెప్పుకోదగిన విధంగా స్పందించడం లేదు. గత పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి బయట పడవేసానని చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం ప్రపంచం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేశామని కూడా చెప్పుకుంటున్నారు.

కానీ తమ పాలనలో పెరుగుతున్న నిరుద్యోగ యువత గురించి మాటమాత్రం కూడా ప్రస్తావించే సాహసం చేయలేకపోతున్నారు. ప్రధాని మాటలలోనే 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం రేషన్ అందిస్తున్నట్లు వెల్లడవుతుంది. మరికొన్నేళ్లు ఈ సదుపాయం కొనసాగిస్తున్నట్లు కూడా ప్రకటించారు. దేశం ఎదుర్కొంటున్న భయంకరమైన ఆహార సంక్షోభాన్ని ఇది సూచిస్తుంది. చాలా కాలం పాటు నాలుగు ఏళ్ళ అవసరాలకు సరిపడిన ఆహార ధాన్యాలను గిడ్డంగులలో నిల్వచేయలేక, పురుగులు పట్టి విపరీత నష్టంకు గురవుతూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కడ ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందో అన్నభయంతో ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇటీవల ప్రకటించిన ‘ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024’ భారత దేశంలోని నిరుద్యోగ శ్రామికశక్తిలో 80 శాతం మంది యువత ఉన్నట్టు వెల్లడి చేసింది.

మరీ ముఖ్యం గా, సెకండరీ విద్య లేదా అంతకంటే ఎక్కువ ఉన్న యువతలో నిరుద్యోగం 2000లో 35.2 శాతం నుండి 2022లో 65.7 శాతానికి పెరిగింది. నేడు విద్యావంతులైన యువత భయంకరమైన నిరుద్యోగం ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రచారం కలిపిస్తున్న నైపుణ్యాభివృద్ధి, స్టార్ట్ యాప్ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో చెప్పుకోదగిన ప్రభావం చూపలేకపోయాయి. భారతదేశ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సైతం ‘2000 నుండి 2019 మధ్యకాలంలో యువత నిరుద్యోగం రెండు రెట్లు ఎక్కువ పెరిగింది, 5.7 శాతం నుండి 17.5 శాతానికి పెరిగింది.కానీ 2022లో 12.4శాతానికి తగ్గింది’ అని చెప్పుకొచ్చారు. ప్రధానంగా మహిళల ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తున్నది.

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రధాని మోడీ ఇప్పుడా అంశాన్ని ప్రస్తావించడం లేదు. దేశంలోని శ్రామిక శక్తిలో 46% మంది కలిగి ఉన్న వ్యవసాయ రంగంపై కేవలం 5% పెట్టుబడులు మాత్రమే అందుతున్నాయి. యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్న కారణంగా వ్యవసాయరంగంలో ఉద్యోగాల సృష్టి జరగడం లేదు. 8% ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్న మాటలు సైతం తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయి. కేవలం సంఘటిత రంగంలోని జిడిపిని మాత్రమే పరిగణనలోకి తీసుకొంటున్నారు. కీలకమైన అసంఘటిత రంగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే వృద్ధి రేటు 1- 2 శాతంకు మించని పరిస్థితి నెలకొంది.

మరోవంక వ్యవసాయేతర రంగాలలో ఉద్యోగాల సంఖ్య కూడా పడిపోతున్నది. గత ఎనిమిదేళ్లలో, 2013లో 7.5 మిలియన్ల నుండి 2019 నాటికి 2.9 మిలియన్లకు క్షీణించింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న 10 సంవత్సరాలలో, ఆర్థిక వ్యవస్థ ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ల వ్యవసాయేతర ఉద్యోగాలను సృష్టిస్తూ ఉండడంతో, ప్రతి ఏడాది 5 మిలియన్ల మంది ప్రజలు వ్యవసాయం నుండి నిష్క్రమించే అవకాశం కలిగెడిది. లాక్‌డౌన్ ఫలితంగా 2020లోనే 3.5 కోట్ల మంది ప్రజలు వ్యవసాయం వైపు మళ్లారు. కరోనా రెండవ వేవ్ మరో కోటి మంది వ్యవసాయం వైపు వెళ్లారు.

వ్యవసాయంలో ఆర్థిక ఉత్పాదకత తక్కువగా ఉంటూ ఉండడంతో మన జిడిపిలో 15% మాత్రమే అందిస్తుంది. జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్ డేటా ప్రకారం 2017-18, నిరుద్యోగం గత 45 ఏళ్లలో అత్యధిక స్థాయిలో ఉంది. 2012లో 2.2 శాతం నుంచి 6.1 శాతానికి పెరిగింది. గత దశాబ్దంలో 15 నుండి 29 సంవత్సరాల మధ్య ఉన్న యువత నిరుద్యోగం స్థాయి రెట్టింపు, మూడు రెట్లు పెరిగాయి. పేదరికం స్థాయి కూడా విపరీతంగా పెరగడంలో ఆశ్చర్యం లేదు. ప్రపంచ బ్యాంకు సెప్టెంబర్ 2022 నివేదికలో పేదరికంలో నివసించే వ్యక్తులు 70 మిలియన్లు పెరిగారని పేర్కొంది. వీటిలో 56 మిలియన్లు భారతదేశం నుండి మాత్రమే రావడం గమనార్హం.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగ నియామకాలు మొక్కుబడిగా మారాయి. లక్షలాది ఖాళీలను భర్తీ చేయడం లేదు. తాత్కాలిక ఉద్యోగులతో కాలం గడిపేస్తున్నారు. పైగా, దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలలో కీలకమైన పనులను ప్రైవేట్ వారికి అప్పగిస్తున్నారు. ఒక విధంగా ప్రభుత్వ యంత్రాంగపు ప్రైవేటీకరణ ప్రక్రియ తెలియకుండానే జరుగుతున్నది. దానితో రెగ్యులర్ ఉద్యోగాలు లభించడం నేడు దాదాపు అసాధ్యమవుతుంది. దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలుగా పేరొందిన ముంబై ఐఐటి, మద్రాస్ ఐఐటిలలోనే మూడవ వంతుకు పైగా పట్టభద్రులకు ఉద్యోగావకాశాలు లభించడం లేదని వెల్లడవుతుంది. దేశంలో విద్యావంతులైన యువకులలో నిరుద్యోగం ఎటువంటి సంక్షోభకరంగా మారుతుందో ఈ ధోరణి వెల్లడి చేస్తున్నది.

రెగ్యులర్ ఉద్యోగాలు లభించకపోవడంతో విద్యావంతులు సైతం అసంఘటిత ఉద్యోగులుగా మారిపోతున్నారు. లేనిపక్షంలో స్వయం ఉపాధి పేరుతో నిలకడలేని ఉపాధి అవకాశాలను వెతుక్కుంటున్నారు. ప్రపంచంలోనే యువకులైన శ్రామికులు అత్యధికంగా ఉన్న దేశంగా భారత్‌ను చెప్పుకుంటూ వస్తున్నాము. అయితే క్రమంగా వృద్ధాప్య దేశంగా మారుతూ ఉండడంతో యువతకు ఉపాధి అవకాశాలు మరింత సమస్యగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఆరేళ్ల క్రితం, మన శ్రామికశక్తిలో 32% మంది 45 ఏళ్లు పైబడి ఉండగా, నేడు 49% మంది 45 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. మరో 16 ఏళ్లలో 91% మందికి వృద్ధాప్య పింఛన్లు, ఇతర సామాజిక భద్రత, ఆరోగ్య ప్రయోజనాలు అందుబాటులో లేని వృద్ధాప్య సమాజంగా భారతదేశం మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారి కోసం ఉద్దేశించిన జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్‌ఎస్‌ఎపి) వంటి పథకాలకు కేటాయింపులు ఏమాత్రం పెరగడం లేదు. కరోనా సమయంలో రద్దు చేసిన సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీల రాయితీని ఇప్పటివరకు పునరుద్ధరించకపోవడం గమనార్హం. గత దశాబ్దంలో, వృద్ధులకు ఎన్‌ఎస్‌ఎపి కింద పెన్షన్ మొత్తాలు 2011 నుండి స్తబ్దుగా ఉన్నాయి. కేటాయింపులు సైతం గత 10 సంవత్సరాలుగా దాదాపు రూ. 9,500 కోట్ల వద్ద నిలిచిపోయాయి. సుప్రీంకోర్టు నిషేధించిన తర్వాత కూడా ఎలక్టోరల్ బాండ్లను ముద్రించేందుకు ప్రభుత్వం ఏకంగా రూ. 10,000 కోట్లు వెచ్చించిందని వార్తలు వస్తున్న తరుణంలో ఇటువంటి కీలక సంక్షేమ పథకానికి కేటాయింపులు మొక్కుబడిగా ఉండటం గమనార్హం.

మొత్తం బడ్జెట్‌లో ఎన్‌ఎస్‌ఎపికి కేటాయింపులు 2014- 15లో 0.58% నుండి ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం 0.2%కి తగ్గిపోయాయి. విచారకరమైన అంశం ఏమిటంటే పెరుగుతున్న నిరుద్యోగ సంఖ్యకు, ద్రవ్యోల్బణం కూడా తోడవడంతో ప్రజల కొనుగోలుశక్తి చెప్పుకోదగినంతగా పెరగడం లేదు. దానితో పారిశ్రామిక వేత్తలు ఉత్పాదక రంగంలో మరిన్ని పెట్టుబడులకు సాహసం చేయడం లేదు. దాని ఫలితంగా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడం లేదు. ఇదంతా ఒక విషవలయంగా మారుతున్నది.

ప్రభుత్వం సైతం ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించగల విద్య, ఆరోగ్య, సామాజికరంగాలలో పెట్టుబడులను పెంచకపోగా, క్రమంగా వెనుకడుగు వేస్తున్నది. దానితో సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. యువతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు దాదాపు అన్నిరాజకీయ పార్టీల నేతలు చెబుతున్నా ఆ దిశలో సరైన విధానాలతో మాత్రం ప్రజల ముందుకు రావడం లేదు. ముఖ్యంగా మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలలో పెట్టుబడులు పెరగడం లేదు. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు వాటిపట్ల ఒకరకంగా వివక్షచూపే రీతిలో వ్యవహరిస్తున్నాయి.

చలసాని నరేంద్ర
98495 69050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News