గత మూడు వారాలుగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత ధ్యేయంగా ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టల్లో వేల మంది పోలీసు బలగాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లోని ఎలిమిడి అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన మందు పాతర పేలుడులో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు శ్రీధర్, సందీప్, పవన్ కళ్యాణ్ ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో ఆర్‌ఎస్‌ఐ రణధీర్ తీవ్ర గాయాలు కాగా పలువురికి గాయాలు గాయపడ్డారు. విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు ఛత్తీస్‌గఢ్ కర్రెగుట్టలలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలింది.
కూంబింగ్‌లో పాల్గొన్న తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులను మావోయిస్టులు గుర్తించి పథకం ప్రకారం మందు పాతరను పేల్చారు. మృతి చెందిన పోలీసుల మృతదేహాలతో పాటు, తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా వరంగల్‌లోని ఎంజిఎం వైద్యశాలకు తరలించారు. వరంగల్ ఎంజీఎం మార్చురీలో పోస్టుమార్టం పూర్తి చేసి హనుమకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు మృతదేహాలను తరలించారు. ఆర్‌ఎస్సై రణధీర్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.