Friday, March 29, 2024

రాష్ట్రానికి తోఫా.. ‘టిఫా’

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : పుట్టబోయే పిల్లల్లో లోపాలను గర్బంలో ఉండగానే గుర్తించేందుకు ‘టిఫా’ (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ స్కాన్) దోహదం చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లను శనివారం హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీశ్‌రావు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడు తూ,ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటికే 155 ఆ ల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్లు ఉన్నాయని, నెల కు సగటున 11 నుంచి 12 వేల పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. టిఫా స్కాన్ వల్ల మాత్రమే తల్లి గర్బంలో ఉండగానే పుట్టబోయే పిల్లల్లో లోపాలను గుర్తించగలుగుతా అన్నారు. ప్రైవేటులో టిఫా స్కాన్‌కు రూ. 2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చవుతుందని, ప్రభుత్వాసుపత్రుల్లో టిఫా స్కానింగ్ అందుబాటులోకి రావడంతో పేదలకు పూర్తిగా ఆర్థిక భారం త ప్పుతుందని చెప్పారు.

రూ. 20 కోట్లతో 56 టి ఫా మిషన్లు స మకూర్చినట్లు తెలిపారు. దీని కో సం ఇప్పటికే రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులకు ప్ర త్యేక శిక్షణ ఇచ్చామని అన్నారు. నిపుణులైన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్టు లు మా త్రమే ఈ స్కాన్ చేస్తారని, గర్బంలోని శి శువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని ఇందులో భాగంగా స్కాన్ చేస్తారని వివరించారు. ప్రతి నెలా సగటున 20 వేల మంది గర్బిణులు ఈ సేవలు ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. గర్బిణులకు 18 నుంచి 22 వా రాల మధ్య ఈ స్కాన్ చేయాల్సి ఉంటుందని వివరించారు.అంతర్జాతీయ నివేదికలు, వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం 7 శాతం శిశువుల్లోలోపాలుఉండే అవకాశం ఉందన్నారు.

ఆరోగ్య రంగంలో చివరస్థానంలో యుపి

ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే, ఇక్కడికి వచ్చే బీజేపీ నా యకులు ప్రచారం కోసం ఏదో ఒకటి మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. కేంద్ర ప్రభు త్వం విడుదల చేసిన నీతి అయోగ్ ర్యాంకింగ్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటే, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ ఆరోగ్య రంగంలో అన్ని రాష్ట్రాల కంటే చిట్టచివరి స్థానంలో ఉందని అన్నారు. అక్కడి ఆరోగ్య రంగం ఎందుకు ట్రబుల్‌లో ఉందో బిజెపి నాయకులు చెప్పాలని ప్రశ్నించారు. గతేడాది నుంచి వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో అనవసర సి- సెక్షన్లు తగ్గుముఖం పట్టి, సాధారణ ప్రసవాలు పెరిగాయని తెలిపారు.

ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 3 లక్షల 60 వేల ప్రసవాలు జరిగాయని అన్నారు. గతేడాది అక్టోబర్ నెలలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 61.41 శాతం సి సెక్షన్లు జరగగా, ఈ ఏడాది అక్టోబర్ నెలలో 54.49 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. అనవసర సి సెక్షన్ల వల్ల తల్లికి, బిడ్డకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని, తల్లికి భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండగా, బిడ్డకు మొదటి గంటలో టీకాతో సమానమైన ముర్రు పాటు ఇవ్వకపోవడం వల్ల వ్యాధులను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని బిడ్డ కోల్పోతుందని చెప్పారు. మన రాష్ట్రంలో అనసవర సి సెక్షన్లు తగ్గించేందుకు అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

రెండు నెలల్లోనే టిఫా స్కానింగ్ ఏర్పాటు

ఏకకాలంలో 56 టిఫాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. మాతా శిశు సంరక్షణలో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టిన కెసిఆర్ కిట్ పథకాన్ని పేట్ల బురుజు మెటర్నిటీ ఆసుపత్రి వేదికగా 2017 జూన్ 2 సిఎం కెసిఆర్ ప్రారంభించారని, ఇప్పుడు ఇదే వేదికగా మరొక అద్బుతమైన కార్యక్రమాన్ని జరుపుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. తాను పేట్ల బురుజు ఆసుపత్రిని సందర్శించినప్పుడు టిఫా స్కానింగ్ వల్ల గర్భిణీలు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించామని, వెనువెంటనే రాష్ట్రవ్యాప్తంగా టిఫా స్కానింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించి చర్యలు చేపట్టామని తెలిపారు. వైద్య సిబ్బంది కృషితో రెండు నెలల్లోనే ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిత్య పర్యవేక్షణ, గర్భిణులకు ఉచిత స్కానింగ్ సేవలు అందించాలని లక్ష్యంతో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు.

మేనరిక వివాహాలు, జన్యు సంబంధ లోపాలు, ఆలస్యంగా గర్బం దాల్చడం, కొందరికి గర్బం దాల్చినప్పటి నుంచే శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం కావడం, పోషకాహార లోపం.. ఇలాంటి కారణాల వల్ల శిశువుల్లో లోపాలు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలాంటి లోపాలను టిఫా స్కాన్‌తో ముందుగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. గుండె, ఊపిరితిత్తులు వంటి అంతర్గత అవయవాలు, కంటి రెప్పలు, పెదవులు, వేళ్లు, చెవులు, కండ్లు, ముక్కు.. ఇలా ప్రతి అవయవాన్ని 3డి, 4డి ఇమేజింగ్ రూపంలో స్కాన్ చేస్తుందని, గ్రహణం మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకరగా ఉండటం, వెన్నుపూస వంటి అవయవాల్లో ఏవైనా లోపాలు తెలుస్తుందని చెప్పారు. కొన్ని సందర్బాల్లో పిల్లలు పుట్టగానే సర్జరీ చేయాల్సి రావొచ్చని, ముందే గుర్తించగలిగితే డెలివరీ సమయంలో పీడియాట్రిక్ సర్జన్లను అందుబాటులో ఉంచి ప్రాణాలు రక్షించవచ్చని తెలిపారు.

మూండంచెల వ్యవస్థ..

ప్రసవానికి ముందు సేవలు (ఏఎన్‌సీ, 102 అమ్మ ఒడి వాహ్నాలు), ప్రసవ సమయంలో సేవలు (డెలివరీలు, ఎంసీహెచ్ కేంద్రాలు, ఐసీయూ, ఎస్‌ఎన్సీయు), ప్రసవం తర్వాత (102 వాహనాలు, కేసీఆర్ కిట్ కిట్స్, చైల్ ఇమ్యునైజేషన్) ఏఎన్‌సీ చెకప్స్, కేసీఆర్ కిట్‌లో నమోదైన గర్భిణులకు తప్పనిసరిగా నాలుగు సార్లు ఏఎన్‌సీ చెకప్స్ తదితర సేవలు మూడంచెల వ్యవస్థలో అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో సిఎం కెసిఆర్ వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఒకే రోజు 56 టిఫా స్కానింగ్ మిషన్లు ప్రారంభించుకోవడం ఆరోగ్య చరిత్రలో గొప్ప విషయమని పేర్కొన్నారు. మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుటుంబ ఆరోగ్య సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డిఎంఇ రమేష్ రెడ్డి, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, పేట్ల బురుజు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి, మెటర్నల్ హెల్త్ జెడి డాక్టర్ పద్మజ, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శశికళ తదితరులు పాల్గొన్నారు.

గర్బిణులతో వర్చువల్‌గా మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు

పేట్ల బురుజు ప్రభుత్వ ఆసుపత్రి వేదికగా జరిగిన 56 టిఫా మిషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు వర్చువల్‌గా పలువురు గర్బిణులతో మాట్లాడారు. ఆరోగ్యం, ఆయా ఆసుపత్రుల్లో అందుతున్న సేవలు వంటి అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. మంచి వైద్య సేవలు అందుతున్నాయని గర్బిణులు చెప్పడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. సమీప ఆసుపత్రుల నుంచి వచ్చే గర్బిణులు స్కానింగ్ చేసుకునేందుకు వీలుగా వారంలో ఒక రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. హోం మంత్రి, అధికారులు పేట్ల బురుజు ఆసుపత్రిలో ప్రారంభించగా, వివిధ జిల్లాల్లోని 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికంగా ప్రజాప్రతినిధులు, ఆసుపత్రులు సూపరింటెండెంట్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News