Thursday, April 18, 2024

సంపాదకీయం: రాజ్యాంగానికి సుప్రీం రక్ష!

- Advertisement -
- Advertisement -

sampadakiyam ప్రధాన నగరాలన్నీ వీధుల్లోకి వచ్చి నిరసన కంఠాలైన అసాధారణ సందర్భంలో మౌనం చిత్తగించకుండా తన కర్తవ్యాన్ని పాటించే ప్రయత్నం చేసినందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును మనసారా అభినందించకుండా ఉండలేం. తనను సృష్టించిన రాజ్యాంగం మౌలిక విలువలకే ముప్పు కలుగుతున్న పరిస్థితుల్లో చీమ కుట్టినట్టయినా అనిపించని రీతిలో సుప్రీంకోర్టు వ్యవహరించి ఉంటే అంతకంటే బాధాకరమైన పరిణామం మరొకటి ఉండేది కాదు. దేశం హింసాయుతమైన కష్ట కాలంలో ఉన్నదని భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ బాబ్డే గురువారం నాడు చేసిన వ్యాఖ్యకు, కశ్మీర్‌లో ఇంటర్‌నెట్ బంద్‌పై శుక్రవారం నాడు జస్టిస్ రమణ అధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం స్పందించిన తీరుకు ప్రజాస్వామ్య భారతం హర్ష పులకాంకితురాలయిపోయింది, ఉబ్బితబ్బిబ్బయింది. పొరు గు దేశాల్లో ఉండలేక వలస వచ్చిన ముస్లిమేతర మతస్థులకు పౌరసత్వాన్ని కట్టబెట్టడం లక్షంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణ చట్టాన్ని రాజ్యాంగ బద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై గురువారం నాడు సిజెఐ చేసిన నోటి వ్యాఖ్య దేశంలో రాజ్యాంగానికి రక్షణ పూర్తిగా కొరవడలేదనే అభిప్రాయానికి చోటిచ్చింది.

ఇటువంటి పిటిషన్‌ను తానింతవరకూ చూడలేదన్న జస్టిస్ బాబ్డే, చట్టం రాజ్యాంగ బద్ధతను కోర్టు స్వయంగా సమీక్షించి తెలుసుకోవలసి ఉంటుందని వ్యాఖ్యానించారు. చట్టమంటేనే రాజ్యాంగ విహితమైనదనే భావన సహజంగా ఏర్పడుతుందని అలాగని దానిని క్షుణ్ణంగా పరిశీలించకుండా అది రాజ్యాంగ బద్ధమైనదని ఎలా ప్రకటించగలం అని బాబ్డే ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టం అత్యంత వివాదాస్పదంగా మారి జనాగ్రహానికి గురి అవుతున్న సంగతిని ఆయన గమనించారు. దాని రాజ్యాంగ బద్ధత అనుమానించదగినదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొన్నారు. ఈ చట్టం పట్ల దేశ ప్రజలు సంతృప్తికరంగా లేరని కూడా తెలుసుకున్నారు. అందుకే ఆయన అలా విజ్ఞతాయుతంగా వ్యాఖ్యానించారు. సెక్యులర్ ప్రజాస్వామిక రాజ్యాంగం మూలాలే కదిలిపోతున్న భయానక నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి వెలిబుచ్చిన అభిప్రాయం భవిష్యత్తుపై ఆశలు చావకుండా చేస్తున్నది. కశ్మీర్‌లో ఇంటర్‌నెట్ పై నిషేధం కొనసాగించడం ప్రాథమిక హక్కులకు భంగకరమని ప్రకటిస్తూ త్రిసభ్య సుప్రీం ధర్మాసనం శుక్రవారం నాడు ఇచ్చిన తీర్పు కూడా రాజ్యాంగ నియమాలకు ఏ మాత్రం విఘాతం కలిగించినా ఊరుకోమనే హెచ్చరికను ధ్వనిస్తున్నది.

ఇంటర్‌నెట్‌పై నిషేధాన్ని నిరవధికంగా కొనసాగించడం టెలికం నిబంధనలకే కాకుండా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది.కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన 370వ అధికరణను రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చివేసిన దరిమిలా అక్కడ హింస, ఉగ్రవాదం తలెత్తకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక నిర్బంధాలను విధించింది. వేలాది మందిని జైళ్లలో పెట్టడం, మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహమ్మద్ సయీద్‌లను నిర్బంధంలో ఉంచడం, కొంత కాలం సెల్‌ఫోన్‌లను నిషేధించడం, ఇంటర్‌నెట్ సేవలను అందుబాటులో లేకుండా చేయడం వంటి చర్యలు తీసుకున్నది. నెట్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్‌లపై జస్టిస్ రమణ ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పింది.

నెట్ బంద్ చేయడం వాణిజ్య కార్యకలాపాలకు, వైద్య మున్నగు అత్యవసర సేవలకు అంతరాయం కలిగిస్తుందంటూనే అది ప్రజల ప్రజాస్వామ్య మౌలిక హక్కులకు విరుద్ధమని వ్యాఖ్యానించడం పాలకులకు చెంప పెట్టువంటిది. కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ను వెంటనే పునరుద్ధరించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించకపోడాన్ని కొందరు న్యాయ నిపుణులు ఎత్తి చూపినప్పటికీ అది ప్రాథమిక హక్కులకు భంగకర మని ప్రకటించడమే హర్షణీయమైన పరిణామమని ప్రజాస్వామ్య హితం కోరుకుంటున్నవారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని నొక్కి చెప్పిన సుప్రీంకోర్టు ముందు ముం దు కశ్మీర్‌లో నెట్ పునరుద్ధరణకు ఆదేశించడానికి వెనుకాడబోదని ఆశించవచ్చు. “కశ్మీర్ చాలా హింసను చవిచూసింది. అందుచేత భద్రతకు, మానవ హక్కులకు మధ్య సమ తూకాన్ని పాటించడానికి వీలయినంతగా ప్రయత్నిస్తామని” జస్టిస్ రమణ తీర్పును ప్రకటిస్తూ వెలిబుచ్చిన అభిప్రాయం గమనించదగినది. అనునిత్య హింసను అనుభవించిన కశ్మీర్‌లో అవసరమైనప్పుడు సమాచార సంబంధాలను పరిమితం చేయడం కోరదగినదేగాని అది అక్కడి ప్రజల హక్కులకు భంగకరం కాకుండా చూడవలసి ఉందనే స్పృహతో సుప్రీం ధర్మాసనం ఈ కేసులో నిర్ణయాన్ని ప్రకటించింది. అందుచేత మితిమించితే ప్రభుత్వ నిర్బంధ కాండపై వేటు వేయడానికి సుప్రీంకోర్టు సందేహించబోదని ఆశించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News